మూడేళ్ల ప్రేమలో ముక్క మాట్లాడుకుంది లేదు. ఆపై రెండేళ్ల నిరీక్షణ. అయినా ఇప్పుడు వాళ్లు మూడుముళ్లేసుకున్న జంట. ఇదెలా సాధ్యమైంది అంటే అతడి మాటల్లోనే..
ప్రిన్సిపల్‌ని కలవడానికెళ్తుంటే ఎదురైంది తను. కలువ పూవులాంటి కళ్లు.. చంద్రబింబంలా ముఖం.. గులాబీ రేకుల్లాంటి పెదాలు.. చూడగానే 'వావ్' అనేలా ఉంది.
తనపేరు ప్రియ. అదృష్టంకొద్దీ నా క్లాస్‌మేట్. అదేం చిత్రమో.. మిగతా అమ్మాయిలతో గలగలా మాట్లాడే నాకు తనెదురుపడగానే గొంతు మూగబోయేది. మాట కలపాలని ఆలోచిస్తుండగానే ఏడాది కరిగింది. వేసవి సెలవులొచ్చాయి. నా మనసులో మంట పుట్టింది.
కాలేజీలు తెరిచారు. ఈసారి ప్రియ కనిపిస్తే మనసులో మాట చెప్పాలనే ఆత్రం. ఇంతలోనే 'అమ్మాయిని పోషించలేనివాడికి ప్రేమించే అర్హత లేదు' తాత మాటలు గుర్తొచ్చాయి. అదీ నిజమే! నాకా పైసా సంపాదన లేదు. మనసంతా గందరగోళం. చివరికి మది మాట మనసు దాటి బయటికి రానేలేదు.
ఓసారి క్లాసు గుమ్మం దగ్గర ఎదురైంది ప్రియ. కళ్లలోకి చూశా. తనూ తీక్షణంగా చూసింది. మనసు మనసూ మాట్లాడుకున్నాయి. కాసేపటికి తేరుకొని సిగ్గుల మొగ్త్గె తలొంచుకుంది. నేనంటే తనకూ ఇష్టమేనని అర్ధమైంది. ఆరోజు నుంచి మేం ఎదురుపడితే నా పెదాలపై చిరునవ్వు. ఆమె కళ్లలో మెరుపు. మూడేళ్లూ ఇలాగే గడిచాయి.
ఫేర్‌వెల్ డే. మా చూపులకి ఆఖరిరోజు. గుండెని మెలిపెట్టే బాధ. కాలేజీ మెయిన్ గేటు దగ్గరికొచ్చి నిల్చున్నా. నీళ్లు నిండిన కళ్లతో సమీపించింది ప్రియ. 'ఇప్పుడైనా పలకరించవా?' అన్నట్టుగా ఉన్నాయ్ చూపులు. అయినా నా నోరు పెగల్లేదు. కాసేపు చూపులయ్యాక కళ్లతోనే వీడ్కోలు పలికాం. బయటికొచ్చాక నాపై నాకే అసహ్యమేసింది. ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడలేని పిరికివాణ్నని తిట్టుకున్నా.
ఎంటెక్‌లో జాయినయ్యా. ఓరోజు ప్రియ ఫ్రెండ్ కనిపించింది. ఆతృతగా పలకరించా. 'తను ఎం.ఎస్. చేయడానికి యూకే వెళ్లిందిగా' అంది. నా ఆశల్ని చిదిమేస్తూ.
చదువు పూర్త్తెంది. మొదటిసారి ఇంటర్వూకి వెళ్లబోతున్నా. నా మొబైల్‌కి ్చ్ద్ద ్మ్త్ఠ ్జ్ఠ్బ్మ అనే మెసేజ్. హడావుడిలో ఎవరో తెలుసుకోలేదు. మొదటి ప్రయత్నమే సక్సెస్. ప్రోగ్రాం మేనేజర్‌గా ఎంపికయ్యా. మంచి జీతం. జీవితం సాఫీగానే గడిచిపోయేది. అయినా ప్రియ చెంత లేదనే వెలితి వెంటాడేది.
ఉదయం ఐదింటికే ఫోన్. చిరాకుతో లిఫ్ట్ చేయలేదు. మళ్లీమళ్లీ రింగవుతోంది. తప్పదనుకొని ఎత్తి 'హలో' అన్నా. 'ఎలా ఉన్నావు?' అవతలివైపు అమ్మాయి గొంతు. అది నా గుండెను తట్టింది. అప్రయత్నంగానే 'ప్రియా' అన్నా. అటువైపు ఏడుపు. నాకూ కన్నీళ్లాగలేదు. ఐదేళ్ల ఎడబాటు తర్వాత దక్కిన తొలి పలకరింపు. కాసేపు మౌనమే మాఇద్దరి మధ్యా. తేరుకొని 'నిన్ను చూడాలని ఉందిరా' అన్నా. గుడికి రమ్మంది. గంటకల్లా చేరుకున్నా. ఐదేళ్లు తపస్సు చేస్తే ప్రత్యక్షమైన దేవతలా నా ఎదురుగా ప్రియా. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' మొదటిమాటే తన నోటినుంచి. 'రెండ్రోజుల్లో నా పెళ్లి. నాకిష్టం లేదు. నువ్వు నాకు కావాలి' మిగతా వివరాలూ చెప్పింది. ఈసారి క్షణం ఆలస్యం చేయలేదు. ఎవరికీ భయపడ్లేదు. ధైర్యంగా ప్రియ చేయందుకున్నా. రెండ్రోజుల్లో మూడుముళ్లతో ఒక్కటయ్యాం.
నిస్వార్థంగా ప్రేమని ప్రేమిస్తే అది తప్పకుండా మనల్ని తిరిగి ప్రేమిస్తుందని మొదట్నుంచీ నా నమ్మకం. నా విషయంలో రుజువైంది. అదే నమ్మకంతో పెద్దల్నీ ఒప్పించే పనిలో ఉన్నాం. మీ ఆశీస్సులు కోరుతున్నాం.
© Shekharmine
No comments:
Post a Comment