వెలుగుల దీపం.. వెలగాలి జీవితం!
గాలిని చీల్చుకుంటూ వెళ్తోంది రైలు. అంతకన్నా వేగంగా నాలో జ్ఞాపకాల దొంతరలు. మనసులో ఒకటే ఆరాటం. ఎప్పుడెప్పుడు దీపని కలుస్తానా అని. సమాజంలో నాకంటూ గుర్తింపు, మంచి జీవితం ఉందంటే అది నా ఫ్రెండ్ చలవే.స్కూళ్లో చిగురించింది మా స్నేహం. తనంటే టీచర్లకి ప్రత్యేక అభిమానం. కుర్రాళ్లకి హడల్. చదువు, ఆటల్లో తనెప్పుడూ ఫస్టే. నాదేమో వెనక బెంచీ. మొదట్లో తనంటే కుళ్లు. కావాలనే 'బక్కపీచు' అనేదాన్ని. ఓసారి నా పక్కన కూర్చుంది. 'ఏంటి బక్కపీచు అంటున్నావ్? నన్నో ఐదు దెబ్బలు కొట్టు. నిన్ను ఒక్కటే కొడతా. ఎవరి బలమేంటో తెలుస్తుంది' అంది. భలే ఛాన్స్. కసిగా ఐదు దెబ్బలేశా. కిక్కురుమనలేదు. తను ఒక్కటిచ్చేసరికి 'కెవ్'మన్నా. 'ఎవరో విజిల్ వేశారు మేడమ్' అంటూ కవర్ చేసింది. అప్పుడర్థమైంది. తను సన్నగా ఉండే కరెంట్ తీగని.
రాన్రాను మేం క్లోజ్‌ఫ్రెండ్సయ్యాం. దీప పక్కనుంటే పండగే. సందేహాలు తీర్చేది. నోట్స్ ప్రిపేర్ చేసిచ్చేది. నాకే కాదు, క్లాసులో అందరికీ సాయపడేది. అందుకే తనంటే అందరికీ ఇష్టం. అలాంటి అమ్మాయి నాకు క్లోజ్‌ఫ్రెండ్ అయినందుకు గర్వంగా ఉండేది.
కాలేజీ ఫస్టోచ్చిందని దీపకి నగదు బహుమతిచ్చారు. ఆ మొత్తాన్ని ఓ అనాథాశ్రమానికి ఇచ్చిందని తెలిసి అభినందించాం.
పీజీ మధ్యలోనే పెళ్త్లెంది నాకు. 'అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం ట్రై చేయవే' అంది అత్తారింటికెళ్తుంటే. కొన్నాళ్లకి తనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందనే కబురు. ఎప్పట్లాగే జీతంలో కొంత మొత్తం ఛారిటీకి ఇచ్చేది. పెళ్లయ్యాక తనని మిస్ అవుతున్నానని బెంగగా ఉండేది. నేనెప్పుడైనా పుట్టింటికొస్తే పరుగెత్తుకొచ్చేది. కొన్నాళ్లకి దీప కూడా పెళ్లి శుభలేఖ నా చేతిలో పెట్టింది. చాలా సంతోషించా. ఎంతైనా ప్రియసఖి కదా! దగ్గరుండి మరీ పెళ్లిలో హడావుడి చేశా.
నేనూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. ప్చ్.. అన్నీ ఫ్లాప్. 'ఇంట్లో హాయిగా ఉండక ఎందుకీ తిప్పలు' బంధువుల సలహా. దీపకి ఫోన్ కలిపా. 'ఇప్పుడిలా అన్నవారే రేపు నీకుద్యోగం వస్తే మెచ్చుకుంటారు. ప్రయత్నం ఆపక'ంది. ఎలా ప్రిపేర్ కావాలో సూచించింది. ఆ ప్రోత్సాహంతోనే జాబ్ సంపాదించా. కానీ పరాయి రాష్ట్రంలో. 'ఫోన్లున్నాయ్ కదా డియర్. బాధ పడకు' అంటూ సాగనంపింది. నా అదృష్టం. తొందర్లోనే సొంతూరికే ట్రాన్స్‌ఫరైంది. ఇదిగో రైళ్లో ఉండగానే ఈ సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి.
ఇంటికెళ్తూనే ఆతృతగా దీపని కలిశా. కుశల ప్రశ్నలయ్యాయి. కొత్త కాపురమెలా ఉందంటే సమాధానం దాటవేసింది. మనసేదో కీడు శంకించింది. తర్వాత దీప వాళ్లమ్మని కలిశా. 'పెళ్లి చేసుకున్న భర్త నానా హింసలు పెడుతున్నాడమ్మా' అంది. అంత మంచి అమ్మాయికి ఏంటీ దుస్థితి? పైగా ఆ టార్చర్‌ని తనెందుకు భరించడం? మనసులో వేల సందేహాలు. కోపం ఆగలేదు. 'నీకు టాలెంట్, ఉద్యోగం ఉన్నాయ్. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేస్తావ్. అయినా ఇన్ని కష్టాలెందుకు భరించడం? విడాకులకు ప్రయత్నించు. అండగా నేనుంటా' అన్నా. చిరునవ్వు నవ్వింది. 'కష్టాలొచ్చాయని పారిపోతామా? అయినా నేను ఇంకొకర్ని చేసుకుంటే తనూ అలాగే ఉంటే?' అంది. నా దగ్గర సమాధానం లేదు. మళ్లీ తనే అందుకుంది. 'అలాగని నేను చేతగాని దానిలా కూర్చోను. మావార్ని మార్చుకుంటా. సవాళ్లని ఎదుర్కోవడమంటే నాకిష్టం కదా' అంది నవ్వుతూ. ఆ మాటతో నా దీప తను కరుగుతూ ఇతరులకు వెలుగు పంచే కొవ్వొత్తిలా కనిపించింది. తన వాదనా సబబే. తనెప్పుడూ తెలివిగానే ఆలోచిస్తుంది. ఈ విచక్షణ, ఆలోచన ఉంటే చాలా జీవితాలు విచ్ఛిన్నం కావు. తన సంసారం చక్కబడాలని కోరుకుంటున్నా.
© Shekharmine
No comments:
Post a Comment