Wednesday, 30 December 2015

ప్రేమంది... పెళ్లంది... వదిలి వెళ్లింది!

చొరవగా పలకరించింది. స్నేహహస్తం అందించాడు. ప్రేమలో పడ్డానంది. పెళ్లి పెద్దలా బాధ్యత నెరవేర్చాలనుకున్నాడు. కానీ నిన్నే పెళ్లాడతానందా అమ్మాయి. ఆ అబ్బాయేం చేశాడు? తర్వాతేం జరిగింది? అతడి మాటల్లోనే.
వూరి నుంచి సిటీలోకి వచ్చిపడ్డా. కొత్తచోటు. కొత్త ఉద్యోగం. అంతా గందరగోళం. నా బెరుకుతనం గమనించి ‘హాయ్‌.. కొత్తగా వచ్చారా? ఏ వూరు?’ అంటూ చొరవగా పలకరించింది నందిత. నేనూ మాట కలిపా. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేది తను. నాకో మంచి నేస్తం దొరికిందని సంబరపడ్డా. ఏడాది తిరక్కముందే మేం బెస్ట్‌ఫ్రెండ్స్‌ అయ్యాం. కష్టసుఖాలు పంచుకునేవాళ్లం. ఓసారి మాటల సందర్భంలో కన్నవాళ్లు చనిపోయారంది. బాధేసింది. తనకి అమ్మానాన్నలు లేని లోటు తీర్చాలనుకున్నా. అభిమానం, ఆప్యాయతలు పంచడం మొదలెట్టా.
‘నేనో అబ్బాయిని ప్రేమిస్తున్నా. పేరు రాజేశ్‌. తనకీ నేనంటే ఇష్టమే’ మెరిసే కళ్లతో చెప్పిందోరోజు. నా స్నేహితురాలి మనసుకి నచ్చినవాడు దొరికినందుకు నాకూ హ్యాపీనే. కొన్నాళ్లు సాఫీగానే గడిచింది వాళ్ల ప్రేమ ప్రయాణం. తర్వాత అప్పుడప్పుడు మా ఇద్దరికీ గొడవలవుతున్నాయనేది. సర్దిచెప్పేవాణ్ని. కొన్నాళ్లకు మేం పూర్తిగా మాట్లాడుకోవడం లేదంది. వాళ్లను కలపడానికి చాలా ప్రయత్నించా. తను ఏడుస్తుంటే ‘మీరు మళ్లీ కలుస్తారు. అయినా ఏం జరిగినా నీ మంచికే’ అని ఓదార్చేవాణ్ని.
నాకూ సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు ఇంట్లో. అమ్మాయిల ఫొటోలన్నీ నందితకు చూపించేవాణ్ని. తనభిప్రాయం చెప్పేది. అమ్మానాన్నలతోపాటు నాకూ ఓ అమ్మాయి బాగా నచ్చింది. నాల్రోజుల్లో ముహుర్తాలు పెట్టుకోవాలనుకున్నాం. సంతోషంతో ఆ మాట నందిత చెవినేశా. నేనూహించని విధంగా స్పందించింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు లేకుండా ఉండలేను’ అంది. ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. ఆ షాక్‌ నుంచి తేరుకొని ‘నువ్వు ప్రేమించింది రాజేశ్‌ను కదా. మీ ఇద్దర్ని ఎలాగైనా నేను కలుపుతా’ అన్నా. తను విన్లేదు. ‘నాకు నువ్వే కావాల’ంటూ ఏడుపు. ఆ కన్నీరుకు కరిగిపోయా. ‘అమ్మనాన్న లేని నాకు అన్నీ నువ్వే’ అంటుంటే దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నా.
అమ్మానాన్నలు నిశ్చితార్థం ఏర్పాట్లలో ఉన్నారు. నందితను నేరుగా ఇంటికి తీస్కెళ్లా. ‘ఈమే మీక్కాబోయే కోడలు’ అన్నా. అమ్మానాన్నలు నోరెళ్లబెట్టారు. కష్టపడి వాళ్లని ఒప్పించా. ‘సరే.. నీకు నచ్చిందే చెయ్‌’ అని వదిలేశారు. నా ప్రియనేస్తం నాలో సగభాగం అవుతుందని వూహల్లో మునిగిపోయా. కొద్దిరోజులు బాగానే గడిచాయి. తర్వాత నందితలో మళ్లీ మార్పు. కారణం.. రాజేశ్‌ మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. తను మెల్లిమెల్లిగా నాకు దూరం కావడం మొదలుపెట్టింది. తట్టుకోలేకపోయా. ఆ ఎడబాటును తట్టుకోలేక నిలదీశా. ‘రాజేశ్‌ మళ్లీ వస్తాడనుకోలేదు. అందుకే నిన్ను ప్రేమించా. ఇప్పుడు అతడ్నే పెళ్లాడతా’ అంది. ఎంత స్వార్థం? ఇప్పుడు తను కనీసం నాతో మాట్లాడ్డం లేదు.
తను స్నేహం చేస్తే నేను స్వార్థం లేని అనురాగం కురిపించా. తను వేరొకర్ని ప్రేమించిందని తెలిసినా పెద్దమనసుతో కొత్త జీవితం ఇవ్వాలనుకున్నా. ఆమె కోసం కన్నవాళ్లనీ, ఓ అమ్మాయికీ బాధ పెట్టా. ఇవన్నీ తనకి తెల్సు! అయినా స్వార్థంతో తన దారి తను చూసుకుంది. వగస్తోంది మాత్రం నేనే. నా తొందరపాటు నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నా.
© Shekharmine

వద్దు గురూ ఇలాంటి స్నేహాలు


చురుకైన, తెలివైన అమ్మాయిన్నేను. సొంతడబ్బా కాదిది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరిదీ ఇదేమాట. పది వరకూ సొంతూళ్లొ చదివా. ఇంటర్‌ కరీంనగర్‌లో. ప్రతిభకుతోడు అందరితో సఖ్యంగా ఉండటంతో కాలేజీలో నేనందరికీ ఇష్టం. రెండేళ్లు జాలీగా గడిచాయి. పైచదువులకోసం సిటీ బస్సెక్కక తప్పలేదు. అప్పుడైతే ఏడుపే.
క్లాసులో స్వీటీ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మాది ఒకే క్లాసు, ఒకే బెంచీ. హాస్టల్‌ వేరే. అయితేనేం? ఎవరికి ఖాళీ ఉన్నా ఇంకొకరి గదిలో వాలిపోయేవాళ్లం. మమ్మల్నంతా ‘ఒకే గూటి పక్షులు’ అనేవాళ్లు. కొన్నాళ్లకి మేం ఒకే హాస్టల్‌ గదికి మారాం. అప్పట్నుంచి ఒకే తనువు, ఒకే మనసులా మెలిగేవాళ్లం.
వేసవి సెలవులిచ్చారు. స్వీటీని చూడకుండా, మాట్లాడకుండా ఉండటం నావల్ల కాలేదు. ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఎదురుచూశా. తను కనపడగానే పరుగెత్తి ఆనందంగా హత్తుకున్నా. కానీ స్వీటీ ఉలకదూ పలకదు. ఎదురుపడితే తల తిప్పుకునేది. నోరు తెరిస్తే మూతి ముడుచుకునేది. నిలదీస్తే ‘నువ్వంటే పిచ్చి పెంచుకుంటున్నా. ఇదిలాగే కొనసాగితే ఏమైపోతానో అని భయమేస్తోంది. అందుకే దూరంగా ఉంటున్నా’ అంది. ఆ సమాధానంతో నిజంగానే తను పిచ్చిదానిలా కనిపించింది. అయినా తమాయించుకొని ‘స్నేహంలో ఇవన్నీ భాగమే. ఎవరికేం కాదు. మునుపటిలా ఉండు’ అని నచ్చజెప్పా. ‘అయితే నేను చెప్పినట్టు వినాలి’ షరతు పెట్టింది. సరేనన్నా.
అప్పట్నుంచి ప్రత్యక్ష నరకం చూపించేది. ‘నువ్వు నాతోనే ఉండాలి. నాతోనే మాట్లాడాలి’ అనేది. ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే గొడవ, ఏడుపు. అమ్మాయిలైనా, అబ్బాయైనా. ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఇంకొన్నాళ్లకైతే ఏకంగా బెదిరింపులకే దిగింది. అలాగని తనని వదల్లేను. కాదని వేరొకరితో మాట్లాడలేను. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయం. నా లవర్‌ నానీతో ఇవన్నీ చెప్పుకొని ఏడ్చేదాణ్ని.
స్వీటీని ఎలాగైనా మార్చాలని నా పాకెట్‌మనీతో ఓ సైకాలజిస్టు దగ్గరికి తీస్కెళ్లా. మనోవ్యాధి ముదిరిందన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించాలనీ, పదివేలు ఖర్చవుతుందన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇక తను చెప్పినట్టే వినడం మొదలెట్టా. నా స్నేహితులందరికీ దూరమయ్యా. పోనీలే.. జీవితంలో ఒక్క బెస్ట్‌ఫ్రెండ్‌ అయినా మిగులుతుందని సర్దిచెప్పుకున్నా. ఇన్ని బాధలు అనుభవిస్తూనే బీటెక్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకం అందుకున్నా.
ఏడాది గడిచింది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క స్నేహితురాలూ నాతో లేదు. ఏమైందో తెలియదుగానీ మా చదువులయ్యాక నాతో మాట్లాడ్డం తగ్గించింది. ఈ గందరగోళంలో ఉండగానే నాకు నానీతో పెళ్లైంది. తర్వాత కొన్నాళ్లకు నేనే ఫోన్‌ చేశా. అవే పొడిపొడి మాటలు. ఆపై నాకు పాప పుట్టింది. అప్పుడే తన పెళ్లి కుదిరింది. రమ్మంటూ శుభలేఖ పంపింది. పాపకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెళ్లలేకపోయా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకుందో లేక నాపై ద్వేషం పెంచుకుందో ఫోన్‌ నెంబర్‌ మార్చేసింది. జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు డిలీట్‌ చేసింది. అసలు తనను కలిసే, మాట్లాడే వీలు లేకుండా చేసింది. ఎందుకిలా చేసిందో? ఆ చిత్రమైన వైఖరేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తన కోసం నేను నా స్నేహితుల్ని వదులుకున్నా. చిన్నచిన్న ఆనందాలకు దూరమయ్యా. తన వెంటే ఉండి అనుక్షణం నరకం అనుభవించా. బహుమానంగా నన్నో శత్రువులా భావించి తనే కనుమరుగైంది. సంతోషంలో, ఆపదలో తోడుండేవారు నిజమైన స్నేహితులు. నాకు ఆపదలు తెచ్చిపెట్టినా తనే నా ఫ్రెండ్‌ అనుకున్నా. కానీ దారుణంగా మోసం చేసింది. ఇలాంటి స్నేహం విలువ తెలియనివాళ్ల కోసం ఎవరూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు.
© Shekharmine

అనుకోని పరిచయం.. పెనవేసిన బంధం!

దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాపు. మాదాపూర్‌ వెళ్లడానికి అరగంట నుంచి నిరీక్షిస్తున్నా. వచ్చిన రెండు బస్సులూ కిక్కిరిసి ఉన్నాయి. ఫుట్‌బోర్డ్‌పై వేలాడ్డం నావల్ల కాదు. ‘బైక్‌ కొను మామా. నీకేం తక్కువ’ స్నేహితుల మాటలు గుర్తొచ్చాయి. ఔను.. నెలకు ముప్ఫై అయిదువేల జీతం నాకు. బండి కొనడం కష్టమేం కాదు. కానీ ఈ ట్రాఫిక్‌, కాలుష్యంలో ఇరవై కిలోమీటర్లు వెళ్లిరావడమే నరకం.
ఆరేళ్ల కిందట ఎంసీఏ పట్టాతో నగరంలో అడుగుపెట్టా. మొదటి జీతం ఐదువేలు. ఇరుకు గదిలో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉండేవాణ్ని. మా ఇంటిపక్కనే లక్ష్మి ఆంటీ ఉండేది. అచ్చం అమ్మలా ఆదరించేది. వాళ్లింట్లో ప్రత్యేక వంటకం చేస్తే మొదట రుచి చూసేది మేమే. ఏదైనా శుభకార్యం జరిగితే మాదే హడావుడి. రూమ్మేట్లిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్లిపోయినా ఆ అమ్మకాని అమ్మనూ, అచ్చొచ్చిన ఇంటినీ వదల్లేకపోయా. నా గురించి తెలిసినవాళ్లంతా ‘నువ్వు సెంటిమెంటల్‌ కాదురా మెంటల్‌గాడివి’ అనేవాళ్లు. నవ్వుకునేవాణ్ని.
దూరం నుంచి వస్తున్న 127కే నా ఆలోచనలకు బ్రేక్‌ వేసింది. ఖాళీగానే ఉంది బస్సు. ఎక్కుదామని అటువైపు పరుగెత్తుతుంటే సడెన్‌గా దూసుకొచ్చిందో స్కూటీ. దానిపైన ఇద్దరమ్మాయిలు. నన్ను తప్పించడానికి వాళ్లు సడెన్‌బ్రేక్‌ వేయడం, స్కూటీ అదుపు చేయలేక కింద పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. లేపుదామని దగ్గరికెళ్లా. ‘కళ్లు జేబులో పెట్టుకున్నావా?’ గుడ్లురిమింది వెనకమ్మాయి. బస్సులు ఆగేవైపు దూసుకురావడం వాళ్లదే తప్పు. పైగా నన్నే అనడంతో ‘బస్టాపు ఏమైనా మీ బాబుదా’ అన్నా కోపంగా. మాటామాటా పెరిగింది. వేరేవాళ్లు అడ్డుపడటంతో గొడవ సద్దుమణిగింది. జీన్స్‌, టీస్‌ వేసుకొని ఆధునికంగా ఉన్నారే తప్ప వాళ్లలో కాస్తైనా కామన్‌సెన్స్‌ ఉన్నట్టు కనిపించలేదు. గొడవ వదిలేసి వెనకాలే వచ్చిన మరో బస్సు ఎక్కి కూర్చున్నా. అసలు అమ్మాయిలంటే ఎలా ఉండాలి? గతంలోకి వెళ్లింది మనసు.
నేనూ, స్వాతి ఒకేరోజు ఉద్యోగంలో చేరాం. హాఫ్‌శారీలో అందంగా అలంకరించుకొని వచ్చింది తను. అణకువగా మాట్లాడుతూ మొదటిరోజే నా మనసు దోచింది. ఆఫీసుకు రాగానే నా కళ్లు తనని వెతికేవి. తనేమో అవసరమైతే తప్ప నోరు విప్పదు. ఇష్టపడుతున్నానని తనతో చెప్పాలా? వద్దా? ఏడాదిన్నర సంశయించా. ఆపై ఆ అవసరం లేకపోయింది. ఆరేళ్ల ప్రేమికుడంటూ పెద్దల్ని ఎదిరించి ఓ కుర్రాడ్ని ఆర్యసమాజ్‌లో పెళ్లాడింది తను.
స్వాతి షాక్‌ నుంచి తేరుకోకముందే పెళ్లిచూపులకని ఇంటినుంచి పిలుపు. అయిష్టంగానే వెళ్లా. నాకు నచ్చినట్టే సంప్రదాయబద్ధంగా ముస్తాబై వచ్చిందా అమ్మాయి. తనని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అదే విషయం బుర్రలో మెదులుతుండగానే పరిచయాలయ్యాయి. ‘ఇంకా ఏవైనా అనుమానాలుంటే పక్కకెళ్లి మాట్లాడుకోవచ్చు’ అనుమతి ఇచ్చేసిందో పెద్దావిడ. వరండాలోకి నడిచాం. ‘మీరు ఇంతకుముందు నన్నెప్పుడైనా చూశారా?’ అటెళ్లగానే నేనడిగిన మొదటి ప్రశ్న. నవ్వే తన సమాధానం. రెట్టించి అడిగా. ‘హైదరాబాద్‌లో మిమ్మల్ని స్కూటీతో డ్యాష్‌ ఇవ్వబోయింది నేనే’ అంటూ నవ్వింది. ‘రెణ్నెళ్లకే మర్చిపోయారా?’ అంది. హా.. అప్పుడు గుర్తొచ్చింది. ‘అన్నట్టు నా అసలు గెటప్‌ ఇదేనండీ. అప్పుడేదో ఫ్రెండ్‌ బలవంతంతో జీన్స్‌ వేసుకున్నా’ అడక్కముందే వివరణ ఇచ్చుకుంది. ‘సారీ’ చెప్పి మరోసారి మనసారా నవ్వింది. ఇంకేం.. లావణ్యతో నా తొలి చూపులు ఓకే అయ్యాయి. సారీసారీ మలి చూపులు అనాలేమో!
సీన్‌ కట్‌చేస్తే అనుకోకుండా కలిసిన అమ్మాయే అర్థాంగి అయ్యింది. ఏడాది తిరిగినా మా మధ్య చిన్న అలక కూడా లేదు. ‘మళ్లీ జీన్స్‌ వేసుకోవా బంగారం’ అని అప్పుడప్పుడు సరదాగా అడుగుతుంటా. ‘వద్దు బాబూ మళ్లీ డ్యాష్‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అంటుంది నవ్వుతూ. గిల్లికజ్జాలతో మొదలైన మా జీవిత ప్రయాణం ఇలా సంతోషంగా సాగి పోతోంది.
© Shekharmine

మతం చేసింది మానని గాయం!

చుట్టూ ఉన్న ప్రపంచం మనం వూహించనంత వేగంగా మారుతోంది. మనుషులు మాత్రం పాతకాలం నాటి మనస్తత్వాలను పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ల మూఢ మతవిశ్వాసాలు రెండు మనసుల్ని విడదీశాయంటున్న యువకుడి అంతరంగం.
పీజీలో ఉండగా మిస్డ్‌కాల్‌తో నా జీవితంలోకొచ్చింది జ్యోత్స్న. ప్రేమగా తనని బుజ్జీ అనేవాణ్ని. తనెలా ఉంటుందో? ఏం చేస్తుందో? పదేపదే ఇవే ఆలోచనలు. చాన్నాళ్లు ఫోన్‌ పలకరింపులయ్యాక ‘నిన్ను చూడాలనుంది. ఎప్పుడు కలుసుకుందాం?’ అన్నానోసారి. ‘కలవడం కుదరదు. ఫొటోలు పంపుకుందాం’ అంది. అదే అదృష్టమనుకొని అప్పటికప్పుడే ఛాయాచిత్రం పంపా. నా ఖర్మకాలి అది వాళ్ల నాన్న చేతిలో పడింది. సీన్‌ తారుమారైంది.
మరుసటిరోజే ఫోన్‌. ‘బాబూ మీ ఫొటో అందింది. పెళ్లిచూపులకు ఎప్పుడొస్తున్నార’ంటూ. బుజ్జికి సంబంధాలు చూస్తున్నారని అర్థమైంది. నేనూ పెళ్లికొడుకుగానే ప్రొసీడయ్యా. కానీ ఎన్నాళ్లని అబద్ధాన్ని దాయగలం? నా బండారం బయట పడనేపడింది. కానీ ఆ తప్పుకన్నా నేను వాళ్ల మతం కాకపోవడమే నచ్చలేదట. ‘ఈ పెళ్లి జరగదు. వెధవ్వేషాలన్నీ మానెయ్‌’ ఒక్కముక్కలో తేల్చేశారు. నాకు మాత్రం వాళ్లని ఒప్పిస్తాననే నమ్మకం. కొన్నాళ్లకి తనూ ఫొటో పంపింది. మరీ అందగత్తేం కాదుగానీ బాగానే ఉంది. అంతకన్నా తన మనసు నచ్చింది. అదేమాటంటే ‘నువ్వంటే నాకూ ఇష్టమేగానీ మావాళ్లు ఒప్పుకుంటేనే మన పెళ్లి’ తేల్చేసింది. అయినా చాటింగ్‌లు, మీటింగ్‌లు కొనసాగుతుండేవి.
మా అదృష్టంకొద్దీ తనకొచ్చే సంబంధాలేవీ కుదరలేదు. మరింత ఆలస్యం చేయొద్దని తొందరపెట్టింది బుజ్జి. ఫోన్‌చేసి మీ అమ్మాయ్‌ని ప్రేమిస్తున్నానన్నా. ‘క్రిస్టియన్‌కి తప్ప వేరేవాడికిచ్చి చేయం’ ఖరాఖండిగా చెప్పేశారు వాళ్లు. జ్యోత్స్న నన్ను మతం మార్చుకొమ్మంది. ఆలోచనల్లో పడ్డా. నేనెటూ తేల్చకపోవడంతో తనే వాళ్ల నాన్నతో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లింటికి పిలిచారు. భయంభయంగానే వెళ్లా. ఇంతకుముందు పంపిన ఫొటో పాతది కావడంతో నన్ను పోల్చుకోలేదు. వెళ్లగానే ఎవరు నువ్వు? ఎందుకొచ్చావ్‌? అని ప్రశ్నలు సంధించారు. హీరోలా ఫీలైపోయి ‘మీ అమ్మాయిని ప్రేమించింది నేనే’ అన్నా గర్వంగా. ఆ మాట వినగానే శివాలెత్తిపోయి నాపై చేయి చేసుకున్నారు జ్యోత్స్న నాన్న. ఇతర బంధువులూ దాడికి సిద్ధమవడంతో పరుగందుకున్నా. వాళ్లూ వెంబడించసాగారు. సరాసరి పోలీస్‌స్టేషన్‌లోకి దూరా. ‘మా చెల్లెల్ని వెంట పడి వేధిస్తున్నాడు’ అన్నాడు జ్యోత్స్న అన్నయ్య. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయమన్నారు ఎస్‌.ఐ. ‘మేం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదు’ అని ధైర్యంగా చెప్పి నా ప్రాణం నిలబెట్టింది జ్యోత్స్న. మేం ఒప్పుకుంటే పోలీసు అధికారి మా పెళ్లి చేస్తామన్నారు. ‘మావాళ్లు ఒప్పుకుంటేనే’ అని మళ్లీ మెలికపెట్టింది నా బుజ్జీ.
తర్వాత మేం పెద్దల్ని ఒప్పించడానికి చేయని ప్రయత్నం లేదు. అంతకు రెట్టింపు అడ్డగించారు వాళ్లు. జ్యోత్స్న నాతో వచ్చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారట. భయమో, గౌరవమో నా ప్రేమను కాదని త్యాగశీలిగా నిలిచింది తను. ప్రేమించిన అమ్మాయిని మరవలేక చదువు నిర్లక్ష్యం చేసి నేను దేవదాసునయ్యా. అన్నీ కోల్పోయి అనుక్షణం మేం ఏడుస్తున్నాం. మతం పేరుతో రెండు మనసుల్ని విడదీసిన ఆ పెద్దలు ఏం సాధించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
© Shekharmine

అక్కా అంటూనే ముంచేశాడు!


అక్కా అని ఆప్యాయతగా పిలిస్తే అమ్మలా ఆదరించింది. బాగు పడతాడని వెలకట్టలేని సాయం చేసింది. కానీ... ఆ నమ్మకద్రోహి ఏం చేశాడు?
‘ఉషా త్వరగా తయారవ్వు. ఆసుపత్రిలో ఉన్న నా ఫ్రెండ్‌ని చూసొద్దాం’... శ్రీవారి కేకతో కంగారు మొదలైంది. ‘సీరియసేం లేదులే. చిన్న జబ్బే’ నా గాబరా గమనించి ఆయనే చెప్పడంతో వూపిరి పీల్చుకున్నా. నా మనస్తత్వమే అంత. నా అన్నవాళ్లు కష్టాల్లో ఉంటే తట్టుకోలేను. మావారూ అంతే.
పలకరింపులయ్యాయి. పండ్ల సంచి ఆయన చేతిలో పెట్టి లేవబోతుంటే పక్కబెడ్‌ నుంచి ఒక్కసారిగా అరుపులు, కేకలు. ఒళ్లంతా కాలిన ఓ అమ్మాయి దీనంగా అరుస్తోంది. బయటికొస్తుంటే ఆమె తాలూకు బంధువులు కనిపించారు. మనసు కలుక్కుమంది. ఉండబట్టలేక మీ అమ్మాయికేమైందనడిగా. ‘దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంటే ప్రమాదవశాత్తు అంటుకుంది’ ఏడుస్తూనే చెప్పారు ఆమె అన్నావదినలు. అమ్మానాన్నలు లేరట. చాలా పేద కుటుంబం. ఇప్పటికే చికిత్సకు చాలా ఖర్చైందట. చెల్లెలి కోసం ఆ అన్నయ్య పడుతున్న తపన చూసి నా కళ్లు చెమర్చాయి. ఐదువేలు వాళ్ల చేతిలో పెట్టి అక్కణ్నుంచి కదిలాం.
రెణ్నెళ్లైంది. ‘నేనండీ ప్రసాద్‌ని. ఆరోజు మీరు మాకు సాయం చేశారు. మా చెల్లి పూర్తిగా కోలుకుంది. మీ మేలు మర్చిపోలేం. మరోసారి థాంక్స్‌’ అన్నాడు ఫోన్‌ చేసి. తర్వాత అప్పుడప్పుడు పలకరించి యోగక్షేమాలు అడిగేవాడు. అభిమానం కురిపించేవాడు. అతడి మాటల్లో నిజాయతీ కనిపించేది. ఓసారి నేనే ఇంటికి ఆహ్వానించా. తర్వాత రాకపోకలు పెరిగాయి. నన్ను అభిమానంతో ‘అక్కా’ అనేవాడు. పిల్లలు మామయ్యా అంటూ తనచుట్టే తిరిగేవారు. చిన్నచిన్న పనులుంటే క్షణాల్లో చేసిపెట్టేవాడు ప్రసాద్‌. రక్తం పంచుకు పుట్టిన అక్కా తమ్ముడిలా మా బంధం బలపడింది.
ఏడాది గడిచింది. ‘అక్కా నేనో చీటీ పాడా. హామీ సంతకం పెట్టవా?’ అన్నాడోరోజు. ట్రావెల్స్‌ వ్యాపారం పెడతాడట. రెండ్రోజులు ఆలోచించాం. మేం ఆదుకుంటే వాళ్ల కుటుంబం బాగుపడుతుంది. మా చేతి అన్నం తిన్నవాడు మోసం చేయడనే భరోసాతో సంతకం పెట్టా. కొద్దిరోజులకే ఇంకో లారీ కొనాలన్నాడు. ఈసారి మావారి వంతు. ఏడాదిపాటు చీటీ డబ్బులు బాగానే కట్టాడు. ఆ తర్వాతే మొదలైంది మమ్మల్ని నిలువునా ముంచే కార్యక్రమం. రోజూ ఇంటికొచ్చేవాడు వారం రోజులుగా పత్తా లేడు. ఫోన్‌ కూడా చేయలేదు. మనసేదో కీడు శంకించింది. వాళ్లింటికి పరుగెత్తాం. ‘రెండ్రోజుల కిందటే కుటుంబమంతా వేరే వూరెళ్లిపోయారుగా’ పక్కింటివాళ్ల మాటతో మా గుండెలు బద్ధలయ్యాయి.
పదిరోజులు ఇంట్లో మౌనవ్రతం. ఏం చేయాలో తెలియలేదు. ప్రసాద్‌ బంధువులిళ్లకెళ్లాం. ‘ప్రసాద్‌ పారిపోయాడా? తనలాంటివాడు కాదే?’ మమ్మల్నే ఎగాదిగా చూశారు. తనే వస్తాడని కొండంత ఆశతో ఎదురుచూశాం. నెలలు, ఏళ్లు గడిచినా రాలేదు. డబ్బులు కట్టమంటూ నోటీసులు మాత్రం వచ్చాయి. అప్పులు చేసి, నగలు తాకట్టు పెట్టి పది లక్షలు చెల్లించాం. ఆ పీడ వదలడానికి నాలుగేళ్లు పట్టింది.
మనిషి కష్టాల్లో ఉంటే సాటి మనిషిగా స్పందించాం. ఆప్యాయత చూపుతున్నాడని ఆదుకోవాలనుకున్నాం. అదే మా కొంప ముంచింది. ఇప్పుడు ఎవరికైనా రూపాయి సాయం చేయాలన్నా మనసొప్పడం లేదు. మంచితనానికైనా హద్దుండాలి అని మా పెద్దలంటుండేవాళ్లు. అప్పుడర్థం కాలేదు. ఇప్పడు అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి ప్రసాద్‌లు కాచుకొని ఉంటారు జాగ్రత్త.
© Shekharmine

ఓ స్నేహితుడే ఉంటే...

ఓ అమ్మాయి.. అబ్బాయి సన్నిహితంగా ఉన్నారంటే అది ప్రేమే కాదు.. అంతకుమించి అనుబంధం ఉండొచ్చు అంటున్న యువతి అంతరంగం.
ట్టల కొట్టులో షాపింగ్‌ చేస్తున్నా. చాలాసేపటి నుంచి నన్నే నమిలేసేలా చూస్తున్నాడో వ్యక్తి. ఒళ్లు మండింది. ‘ఎంటలా చూస్తున్నావ్‌? ఇంతకుముందెపుడూ అమ్మాయిని చూడలేదా?’ వెళ్లి క్లాస్‌ పీకా. ‘నాకు గులాబీ రంగంటే ఇష్టం. ఆ రంగు చీరలో మీరు అందంగా కనిపిస్తున్నారు అందుకే’ తడుముకోకుండా చెప్పాడు. ఏమనాలో అర్థం కాక ఓ చిర్నవ్వు నవ్వా. అదే అదనుగా ‘పక్క వీధిలో ఉంటా. మీరెక్కడ?’ అంటూ మాట కలిపాడు. అరగంటలో ఫోన్‌నెంబర్‌ ఇచ్చేంత కనికట్టు చేశాడు.‘నేను రామూని. బట్టలషాపు పరిచయం’ వారమయ్యాక కాల్‌ చేశాడు. సందేహిస్తూనే మాట్లాడా. ఈ పరిచయం ఎటువైపు వెళ్తుందో అని మనసులో భయం మొదలైంది. పైగా నా పరిస్థితేం బాగా లేదు. రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేశా. గతంలోకి వెళ్లిపోయింది మనసు. మాదో పల్లెటూరు. నేను, చెల్లి, తమ్ముడు. కొడుకుగా పుట్టలేదని నాన్నకు నాపై కోపం. అమ్మకీ నచ్చను. ఐదుతోనే చదువాపించారు. నాకేమో చదువుకోవాలనే ఆరాటం. తీరే దారేది? ఇంటి పనయ్యాక అమ్మమ్మతో చేనుకి వెళ్లేదాన్ని.
ఓసారి చేలో ఉండగా బావ వచ్చాడు. నాలో ఏదో తెలియని పరవశం. ‘హాయ్‌ బావా ఎలా ఉన్నావ్‌?’ అని పలకరించా. కాసేపు నన్నే తదేకంగా చూసి ‘ఇంత అందమైన అమ్మాయి నా మరదలా? నిన్ను తప్ప వేరే వాళ్లను పెళ్లి చేసుకోను’ అన్నాడు. సిగ్గుల మొగ్గై అక్కణ్నుంచి పరుగెత్తా. అమ్మమ్మకీ అదే విషయం చెప్పాడు. పెద్దవాళ్లతో మాట్లాడతానంది. అమ్మమ్మ తప్ప ఎవరూ ఆదరించని నన్ను బావ ఇష్టపడటం గొప్పగా అనిపించేది. ఓసారి బావ వాళ్లింటికెళ్లా. ఉన్న వారం రోజులు అత్తయ్య, మామయ్యలు ప్రేమ కురిపించారు. బావ అయితే చంటిపాపలా అపురూపంగా చూసుకున్నాడు. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులవే. కొన్నాళ్లకి బావ నుంచి ఫోన్‌. ఆనందంగా ‘హలో’ అన్నా. ‘సారీ లతా... నీతో పెళ్లికి మా అమ్మ ఒప్పుకోవట్లేదు. నన్ను క్షమించు’ అని గుండెలో శూలాలు దింపాడు. నా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. కన్నీరుమున్నీరయ్యాను. విషయం ఇంట్లోవాళ్లకు తెలిసి వెంటనే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నా ప్రమేయం లేకుండానే అత్తవారింట్లో అడుగుపెట్టా.పెళ్లితో కొత్త జీవితం మొదలైనా పాత కష్టాలు మాత్రం వదల్లేదు. భర్త తాగుబోతు. చిన్నవిషయానికే చేయి చేసుకోవడం, పరాయి వాళ్లతో మాట్లాడితే అనుమానం. ఈ పరిస్థితుల్లో పరిచయమయ్యాడు రాము. అతడి మాటలు నాకు సాంత్వన ఇచ్చేవి. చిన్నవయసులోనే గంపెడు సంసారాన్ని మోస్తున్నాడనీ, అతడిదీ నాలాంటి పరిస్థితే అని తెలిశాక నాకెంతో సన్నిహితుడు అనిపించింది. ఎవరికే కష్టం వచ్చినా ఒకర్నొకరం ఓదార్చుకునేవాళ్లం. రాము మాటల్లో మర్మం లేదు. చేతల్లో స్వార్థం లేదు. నాకు ఆపదొస్తే తల్లడిల్లేవాడు. ఆమధ్య నేను తరచూ అనారోగ్యం పాలయ్యా. భర్త, కన్నవాళ్లు పట్టించుకోలేదు. అప్పుడు రామూనే నాకు ఆప్తుడయ్యాడు. తన సొంత డబ్బులతో నన్ను బాగు చేయించాడు. అతడు పక్కనుంటే చాలు నా బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేదాన్ని. ఈక్రమంలో నాకు చదువంటే ఇష్టమని తెలుసుకున్నాడు. పట్టుపట్టి నాతో పుస్తకం పట్టించాడు. అనుక్షణం వెన్నంటే ఉండి నేను డిగ్రీ పాసయ్యేలా చేశాడు. చదువుకున్న అమ్మాయిగా, పిల్లలకు చదువు చెప్పే టీచర్‌గా ఇప్పుడు నాకు సమాజంలో మంచి గౌరవం ఉంది. నా సొంతకాళ్లపై నేను నిలబడ్డానంటే అది రాము పెట్టిన భిక్షే. తను నా హితుడు, ఆత్మబంధువు, సర్వం. మా గురించి ఎవరు ఏమైనా అనుకోనీ! రాము తర్వాతే నాకు ఎవరైనా.
© Shekharmine

మనసు గాయం మానలేదింకా!

ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. ఇది తెలియని కుర్రాడు రెండు ప్రేమల్లో ఒక్కదాన్నీ గెల్చుకోలేకపోయాడు. అదెలా అంటే..
దో ఆలోచిస్తూ క్యాంపస్‌లో పరధ్యానంగా నడుస్తున్నా. ‘హాయ్‌ శ్రీను.. ఒక్క క్షణం’ వెనకనుంచి బిందు. ‘ఎల్లుండే కదా నీ పుట్టినరోజు. అడ్వాన్స్డ్‌ హ్యాపీ బర్త్‌డే టూ యూ’ చేయందుకుంటూ చెప్పింది. ఆ విషయం నాకే గుర్తులేదు. నీకెలా తెలుసని అడిగా. ‘కావాల్సినోడివి. ఆమాత్రం తెల్సుకోలేనా?’ నవ్వింది. అర్థంకాక తెల్లమొహమేశా. ‘ముసుగులో గుద్దులాటలెందుకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా’ తనే మనసు విప్పింది. వేరొకరైతే ఎగిరి గెంతేసేవారే. తను అందగత్తె, చదువరి. అంతకుమించి సహృదయురాలు. అయినా నేను నో చెప్పడానికి కారణం రాణి. రెండేళ్లుగా తనే నా సర్వస్వం.
నా పుట్టినరోజు. నాకిష్టమైన డిక్షనరీ చేతిలో పెట్టాడు ఫ్రెండ్‌ హరి. ప్రేమకు చిహ్నమైన రాధాకృష్ణుల బొమ్మను కానుకగా ఇచ్చింది రాణి. మర్నాడే బిందు నాకు ప్రపోజ్‌ చేసిన విషయం రాణితో చెప్పా. విపరీతంగా ఏడ్చేసింది. ఇంకోసారి వేరే అమ్మాయివైపు కన్నెత్తి చూడొద్దనీ, తననే పెళ్లాడాలని ఒట్టేయించుకుంది. తన కౌగిలిలో ఒదిగిపోయా. మేం ప్రేమపక్షులమనే విషయం కాలేజీ అంతటికీ తెలిసింది. ఎలాగూ మేం పెళ్లి చేసుకుంటాం అనే భరోసాతో దాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు.
కాలం గిర్రున తిరిగింది. ఓరోజు రాణి కాలేజీకి రాలేదు. సమాచారం కూడా లేదు. తట్టుకోలేక ఫోన్‌ చేశా. స్విచ్ఛాఫ్‌. మర్నాడు, ఆపై వారం రోజులూ అంతే. నాలో భయం పట్టుకుంది. ‘మీ లవర్‌ రావట్లేదేంటి?’ ,ునీకు చెప్పకుండా ఎటెళ్తుంది?’ క్లాసంతా అడిగేవారు. ఏం సమాధానం చెప్పాలో తెలియదు. వాళ్లింటికె’ళ్లాలనుకున్నా. ఇంతలో తన ఫోన్‌. నాలో పట్టరాని సంతోషం. ‘ఎక్కడున్నావ్‌?, ఏమైపోయావ్‌?’ ప్రశ్నలు సంధించా. ‘నీకు చెప్పాల్సిన పన్లేదు’ వూహించని సమాధానంతో మ్రాన్పడిపోయా. ‘మాట్లాడుతోంది నా రాణినేనా?’ బేలగా అడిగా. ‘ఔను.. నేనే. కానీ నీ రాణిని కాదు. నాకు వేరొకరితో పెళ్లి కుదిరింది. స్నేహితుల బలవంతంతో నీకు చెబుతున్నా’ ఈటెల్లాంటి తన మాటలు నా గుండెను చీల్చాయి. ‘నన్నే పెళ్లాడాలని ఒట్టేయించుకున్నావ్‌గా?’ అంటే ఏదో మూడ్‌లో అలా మాట్లాడా. గతంగతః వదిలెయ్‌ అంది. నా మెదడు మొద్దుబారిపోయింది.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నన్ను ఓదార్చాలని చాలా ప్రయత్నించింది బిందు. పట్టించుకోలేదు. ‘మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వేరొకర్ని పెళ్లాడ్డం నాకిష్టం లేదు. నువ్వు ఓకే అంటే మావాళ్లతో మాట్లాడతా’ నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిందోసారి. అసలే నా ప్రేమ విఫలమైన బాధలో ఉన్నా. అందుకు బిందు కూడా ఓ కారణం కావొచ్చనే అనుమానం నాది. ఆ కోపంలో విచక్షణ మర్చిపోయి నోటికొచ్చిన మాటలన్నా. ఏడుస్తూ వెళ్లిపోయింది.
చాన్నాళ్లదాకా బిందు కనిపించలేదు. ఓరోజు ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి ‘బిందు ఆత్మహత్య చేసుకుంది. చూడ్డానికెళ్తున్నా. నువ్వొస్తావా?’ అనే పిడుగులాంటి వార్త చెప్పాడు. అది వినగానే నా గుండె క్షణకాలం కొట్టుకోవడం ఆగింది. నేను తనని తిరస్కరించినందుకే అలా చేసిందా? లేక వేరే కారణమా? నెలలు గడిచినా నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఈ అనుమానం నా మనసును ఇంకా తొలుస్తూనే ఉంది.
ప్రేమించిన అమ్మాయి దక్కలేదు. నన్ను ఇష్టపడ్డ అమ్మాయి ఈ లోకంలో లేదు. ఇది తల్చుకొని బాధ పడని రోజు లేదు. ఈమధ్యే ఇంకో నిజం తెలిసింది. నాకిష్టమైన డిక్షనరీ బిందునే కొని నా ఫ్రెండ్‌తో ఇప్పించిందట. అది నా దగ్గర భద్రంగా ఉంది. రాణి ఇచ్చిన రాధాకృష్ణుల బొమ్మ పొరపాటున కిందపడి ముక్కలైంది. తన ప్రేమలాగే.

© Shekharmine

నేరం అతడిది.. శిక్ష నాకా?


బ్బాయిది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. ఒక్కడే కొడుకు. మంచి కుటుంబం. మరోసారి ఆలోచించండి’ మధ్యవర్తి మాటతో అమ్మానాన్నలు కరిగిపోయారు. ఎదురింటి ఆంటీ నన్ను కోడలుగా చేసుకోవాలని అడిగించడం ఇది మూడోసారి. కన్నవాళ్లు నా అభిప్రాయమడిగారు. అబ్బాయి బాగుంటాడు. మంచి ఉద్యోగం. నేనూ అభ్యంతరం చెప్పలేదు.ముహుర్తం పెట్టుకున్నాం. పెళ్లికింకా మూణ్నెళ్లుంది. నేనూ అందరిలాంటి అమ్మాయినేగా! కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలనీ.. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకోవాలని తెగ ఉబలాటంగా ఉండేది. కానీ తను పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. ఆగలేక నేనే ఓసారి ఫోన్‌ చేశా. ‘కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నా సంజూ.. పెళ్లయ్యాక నువ్వు చెప్పినట్టే వింటాగా’ అంటూ నా వూహలకు రెక్కలు తొడిగాడు.పెళ్లి ఘనంగా జరిగింది. మొదటిరాత్రి. ‘ముందు మనం స్నేహితుల్లా ఉందాం. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాక నిన్ను భార్యగా అంగీకరిస్తా’ అని చిత్రమైన ప్రతిపాదన తెచ్చాడు తను. ఒప్పుకున్నా. కొన్నాళ్లు గడిచాయి. ఇద్దరి మధ్య కావాల్సినంత ఏకాంతం. అయినా ఆయన కొత్త పెళ్లాన్ని పక్కనపెట్టి ఎప్పుడూ ఫోన్‌తోనే గడిపేవాడు. గంటలకొద్దీ చాటింగ్‌, ఎవరితోనో మాట్లాడ్డం. బాత్రూమ్‌కెళ్లినా ఫోన్‌ వదలడు. మొదట్లో వింతగా అనిపించేది. తర్వాత చిరాకేసేది. నేనే చొరవ చేసి మాట్లాడితే మొహం చిట్లించేవాడు. పొరపాటున నా చేయి తగిలితే విసుక్కునేవాడు.

నేనంటే తనకిష్టం లేదని అర్థమైంది. అలాంటపుడు నన్నెందుకు పెళ్లాడ్డం? అదే అడిగా. ‘శర్వాణిని ప్రేమించా. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మావాళ్ల బలవంతంతో నిన్ను పెళ్లాడా’ అంటూ నా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. ఆపై మరీ ఘోరంగా తయారైంది నా పరిస్థితి. పూలు పెట్టుకున్నా, కాళ్లకు పట్టీలు వేసుకున్నా ఒప్పుకునేవాడు కాదు. ఎన్నో ఆశలతో.. అందమైన జీవితం వూహించుకున్న నాకు నిద్రలేని రాత్రులే దిక్కయ్యాయి.నెలలు గడిచినా తనలో మార్పు లేకపోయేసరికి వాళ్ల అమ్మ, అక్కలకి విషయం చెప్పా. నా ముందే అతడ్ని కడిగేశారు. ‘నువ్వేం భయపడకమ్మా. వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లైంది. తనే మారతాడులే’ అని ధైర్యం చెప్పారు. కానీ అదీ జరగలేదు. అమ్మానాన్నలతో గోడు వెళ్లబోసుకున్నా. ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. అయినా తను పట్టించుకుంటేగా!నేనే స్వయంగా రంగంలోకి దిగా. మా ఆయన ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకున్నా. ఎందుకిలా చేస్తున్నావని నిలదీశా. 
నేను కలలో కూడా ్చహించని విషయాలు చెప్పింది తను. ఆమెకి డబ్బులిచ్చి మరీ మాట్లాడించుకుంటున్నాడట మా ఆయన. అసలు మీ ఆయన సంసారానికే పనికి రాడు అందామె. చదువుకునే రోజుల్లో జూనియర్‌ అబ్బాయిలను లైంగికంగా వేధించేవాడట. ఇవన్నీ వింటుంటే నా నోట మాట రాలేదు. డాక్టరు దగ్గరికెళ్దాం రమ్మన్నాను. రాలేదు. నాకేం సమస్య లేదు. కావాలంటే నీకు విడాకులు ఇస్తాగానీ నువ్వు చెప్పినట్టు చేయనన్నాడు. విషయం తేటతెల్లమైంది. నా బతుకు బుగ్గిపాలైంది. ఈ మధ్యే మేం విడాకులు తీసుకున్నాం.అతడి గురించి వాళ్లింట్లో ముందే తెలుసు. తెలిసీ ఇలా చేశారు. తమ అబ్బాయి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే పెద్దవాళ్లు కులం, గుణం, మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ల గురించి వెతుకుతారు. అలాగే ఎదుటివాళ్ల పరిస్థితేంటి? అని ఒక్కసారి ఆలోచిస్తే నాలా ఎవరికీ అన్యాయం జరగదు.

© Shekharmine