Wednesday, 14 October 2015

చూపులు మాట్లాడాయ్.. మనసులు మనువాడాయ్!

మూడేళ్ల ప్రేమలో ముక్క మాట్లాడుకుంది లేదు. ఆపై రెండేళ్ల నిరీక్షణ. అయినా ఇప్పుడు వాళ్లు మూడుముళ్లేసుకున్న జంట. ఇదెలా సాధ్యమైంది అంటే అతడి మాటల్లోనే..


ప్రిన్సిపల్‌ని కలవడానికెళ్తుంటే ఎదురైంది తను. కలువ పూవులాంటి కళ్లు.. చంద్రబింబంలా ముఖం.. గులాబీ రేకుల్లాంటి పెదాలు.. చూడగానే 'వావ్' అనేలా ఉంది.
తనపేరు ప్రియ. అదృష్టంకొద్దీ నా క్లాస్‌మేట్. అదేం చిత్రమో.. మిగతా అమ్మాయిలతో గలగలా మాట్లాడే నాకు తనెదురుపడగానే గొంతు మూగబోయేది. మాట కలపాలని ఆలోచిస్తుండగానే ఏడాది కరిగింది. వేసవి సెలవులొచ్చాయి. నా మనసులో మంట పుట్టింది.

కాలేజీలు తెరిచారు. ఈసారి ప్రియ కనిపిస్తే మనసులో మాట చెప్పాలనే ఆత్రం. ఇంతలోనే 'అమ్మాయిని పోషించలేనివాడికి ప్రేమించే అర్హత లేదు' తాత మాటలు గుర్తొచ్చాయి. అదీ నిజమే! నాకా పైసా సంపాదన లేదు. మనసంతా గందరగోళం. చివరికి మది మాట మనసు దాటి బయటికి రానేలేదు.

ఓసారి క్లాసు గుమ్మం దగ్గర ఎదురైంది ప్రియ. కళ్లలోకి చూశా. తనూ తీక్షణంగా చూసింది. మనసు మనసూ మాట్లాడుకున్నాయి. కాసేపటికి తేరుకొని సిగ్గుల మొగ్త్గె తలొంచుకుంది. నేనంటే తనకూ ఇష్టమేనని అర్ధమైంది. ఆరోజు నుంచి మేం ఎదురుపడితే నా పెదాలపై చిరునవ్వు. ఆమె కళ్లలో మెరుపు. మూడేళ్లూ ఇలాగే గడిచాయి.

ఫేర్‌వెల్ డే. మా చూపులకి ఆఖరిరోజు. గుండెని మెలిపెట్టే బాధ. కాలేజీ మెయిన్ గేటు దగ్గరికొచ్చి నిల్చున్నా. నీళ్లు నిండిన కళ్లతో సమీపించింది ప్రియ. 'ఇప్పుడైనా పలకరించవా?' అన్నట్టుగా ఉన్నాయ్ చూపులు. అయినా నా నోరు పెగల్లేదు. కాసేపు చూపులయ్యాక కళ్లతోనే వీడ్కోలు పలికాం. బయటికొచ్చాక నాపై నాకే అసహ్యమేసింది. ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడలేని పిరికివాణ్నని తిట్టుకున్నా.

ఎంటెక్‌లో జాయినయ్యా. ఓరోజు ప్రియ ఫ్రెండ్ కనిపించింది. ఆతృతగా పలకరించా. 'తను ఎం.ఎస్. చేయడానికి యూకే వెళ్లిందిగా' అంది. నా ఆశల్ని చిదిమేస్తూ.

చదువు పూర్త్తెంది. మొదటిసారి ఇంటర్వూకి వెళ్లబోతున్నా. నా మొబైల్‌కి ్చ్ద్ద ్మ్త్ఠ ్జ్ఠ్బ్మ అనే మెసేజ్. హడావుడిలో ఎవరో తెలుసుకోలేదు. మొదటి ప్రయత్నమే సక్సెస్. ప్రోగ్రాం మేనేజర్‌గా ఎంపికయ్యా. మంచి జీతం. జీవితం సాఫీగానే గడిచిపోయేది. అయినా ప్రియ చెంత లేదనే వెలితి వెంటాడేది.

ఉదయం ఐదింటికే ఫోన్. చిరాకుతో లిఫ్ట్ చేయలేదు. మళ్లీమళ్లీ రింగవుతోంది. తప్పదనుకొని ఎత్తి 'హలో' అన్నా. 'ఎలా ఉన్నావు?' అవతలివైపు అమ్మాయి గొంతు. అది నా గుండెను తట్టింది. అప్రయత్నంగానే 'ప్రియా' అన్నా. అటువైపు ఏడుపు. నాకూ కన్నీళ్లాగలేదు. ఐదేళ్ల ఎడబాటు తర్వాత దక్కిన తొలి పలకరింపు. కాసేపు మౌనమే మాఇద్దరి మధ్యా. తేరుకొని 'నిన్ను చూడాలని ఉందిరా' అన్నా. గుడికి రమ్మంది. గంటకల్లా చేరుకున్నా. ఐదేళ్లు తపస్సు చేస్తే ప్రత్యక్షమైన దేవతలా నా ఎదురుగా ప్రియా. 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' మొదటిమాటే తన నోటినుంచి. 'రెండ్రోజుల్లో నా పెళ్లి. నాకిష్టం లేదు. నువ్వు నాకు కావాలి' మిగతా వివరాలూ చెప్పింది. ఈసారి క్షణం ఆలస్యం చేయలేదు. ఎవరికీ భయపడ్లేదు. ధైర్యంగా ప్రియ చేయందుకున్నా. రెండ్రోజుల్లో మూడుముళ్లతో ఒక్కటయ్యాం.

నిస్వార్థంగా ప్రేమని ప్రేమిస్తే అది తప్పకుండా మనల్ని తిరిగి ప్రేమిస్తుందని మొదట్నుంచీ నా నమ్మకం. నా విషయంలో రుజువైంది. అదే నమ్మకంతో పెద్దల్నీ ఒప్పించే పనిలో ఉన్నాం. మీ ఆశీస్సులు కోరుతున్నాం.
© Shekharmine

వెలుగుల దీపం.. వెలగాలి జీవితం!

వెలుగుల దీపం.. వెలగాలి జీవితం!

గాలిని చీల్చుకుంటూ వెళ్తోంది రైలు. అంతకన్నా వేగంగా నాలో జ్ఞాపకాల దొంతరలు. మనసులో ఒకటే ఆరాటం. ఎప్పుడెప్పుడు దీపని కలుస్తానా అని. సమాజంలో నాకంటూ గుర్తింపు, మంచి జీవితం ఉందంటే అది నా ఫ్రెండ్ చలవే.

స్కూళ్లో చిగురించింది మా స్నేహం. తనంటే టీచర్లకి ప్రత్యేక అభిమానం. కుర్రాళ్లకి హడల్. చదువు, ఆటల్లో తనెప్పుడూ ఫస్టే. నాదేమో వెనక బెంచీ. మొదట్లో తనంటే కుళ్లు. కావాలనే 'బక్కపీచు' అనేదాన్ని. ఓసారి నా పక్కన కూర్చుంది. 'ఏంటి బక్కపీచు అంటున్నావ్? నన్నో ఐదు దెబ్బలు కొట్టు. నిన్ను ఒక్కటే కొడతా. ఎవరి బలమేంటో తెలుస్తుంది' అంది. భలే ఛాన్స్. కసిగా ఐదు దెబ్బలేశా. కిక్కురుమనలేదు. తను ఒక్కటిచ్చేసరికి 'కెవ్'మన్నా. 'ఎవరో విజిల్ వేశారు మేడమ్' అంటూ కవర్ చేసింది. అప్పుడర్థమైంది. తను సన్నగా ఉండే కరెంట్ తీగని.
రాన్రాను మేం క్లోజ్‌ఫ్రెండ్సయ్యాం. దీప పక్కనుంటే పండగే. సందేహాలు తీర్చేది. నోట్స్ ప్రిపేర్ చేసిచ్చేది. నాకే కాదు, క్లాసులో అందరికీ సాయపడేది. అందుకే తనంటే అందరికీ ఇష్టం. అలాంటి అమ్మాయి నాకు క్లోజ్‌ఫ్రెండ్ అయినందుకు గర్వంగా ఉండేది.

కాలేజీ ఫస్టోచ్చిందని దీపకి నగదు బహుమతిచ్చారు. ఆ మొత్తాన్ని ఓ అనాథాశ్రమానికి ఇచ్చిందని తెలిసి అభినందించాం.

పీజీ మధ్యలోనే పెళ్త్లెంది నాకు. 'అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉద్యోగం ట్రై చేయవే' అంది అత్తారింటికెళ్తుంటే. కొన్నాళ్లకి తనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందనే కబురు. ఎప్పట్లాగే జీతంలో కొంత మొత్తం ఛారిటీకి ఇచ్చేది. పెళ్లయ్యాక తనని మిస్ అవుతున్నానని బెంగగా ఉండేది. నేనెప్పుడైనా పుట్టింటికొస్తే పరుగెత్తుకొచ్చేది. కొన్నాళ్లకి దీప కూడా పెళ్లి శుభలేఖ నా చేతిలో పెట్టింది. చాలా సంతోషించా. ఎంతైనా ప్రియసఖి కదా! దగ్గరుండి మరీ పెళ్లిలో హడావుడి చేశా.

నేనూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. ప్చ్.. అన్నీ ఫ్లాప్. 'ఇంట్లో హాయిగా ఉండక ఎందుకీ తిప్పలు' బంధువుల సలహా. దీపకి ఫోన్ కలిపా. 'ఇప్పుడిలా అన్నవారే రేపు నీకుద్యోగం వస్తే మెచ్చుకుంటారు. ప్రయత్నం ఆపక'ంది. ఎలా ప్రిపేర్ కావాలో సూచించింది. ఆ ప్రోత్సాహంతోనే జాబ్ సంపాదించా. కానీ పరాయి రాష్ట్రంలో. 'ఫోన్లున్నాయ్ కదా డియర్. బాధ పడకు' అంటూ సాగనంపింది. నా అదృష్టం. తొందర్లోనే సొంతూరికే ట్రాన్స్‌ఫరైంది. ఇదిగో రైళ్లో ఉండగానే ఈ సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి.

ఇంటికెళ్తూనే ఆతృతగా దీపని కలిశా. కుశల ప్రశ్నలయ్యాయి. కొత్త కాపురమెలా ఉందంటే సమాధానం దాటవేసింది. మనసేదో కీడు శంకించింది. తర్వాత దీప వాళ్లమ్మని కలిశా. 'పెళ్లి చేసుకున్న భర్త నానా హింసలు పెడుతున్నాడమ్మా' అంది. అంత మంచి అమ్మాయికి ఏంటీ దుస్థితి? పైగా ఆ టార్చర్‌ని తనెందుకు భరించడం? మనసులో వేల సందేహాలు. కోపం ఆగలేదు. 'నీకు టాలెంట్, ఉద్యోగం ఉన్నాయ్. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేస్తావ్. అయినా ఇన్ని కష్టాలెందుకు భరించడం? విడాకులకు ప్రయత్నించు. అండగా నేనుంటా' అన్నా. చిరునవ్వు నవ్వింది. 'కష్టాలొచ్చాయని పారిపోతామా? అయినా నేను ఇంకొకర్ని చేసుకుంటే తనూ అలాగే ఉంటే?' అంది. నా దగ్గర సమాధానం లేదు. మళ్లీ తనే అందుకుంది. 'అలాగని నేను చేతగాని దానిలా కూర్చోను. మావార్ని మార్చుకుంటా. సవాళ్లని ఎదుర్కోవడమంటే నాకిష్టం కదా' అంది నవ్వుతూ. ఆ మాటతో నా దీప తను కరుగుతూ ఇతరులకు వెలుగు పంచే కొవ్వొత్తిలా కనిపించింది. తన వాదనా సబబే. తనెప్పుడూ తెలివిగానే ఆలోచిస్తుంది. ఈ విచక్షణ, ఆలోచన ఉంటే చాలా జీవితాలు విచ్ఛిన్నం కావు. తన సంసారం చక్కబడాలని కోరుకుంటున్నా.
© Shekharmine

రైలు మిస్.. అయ్యింది మిసెస్!

రైలు మిస్.. అయ్యింది మిసెస్! 

'రేయ్ తొందరగా వెళ్లు. ట్రెయిన్‌కి టైమవుతోంది' అమ్మ అరుపుతో బ్యాగందుకున్నా. ఆరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత తాతయ్య-నానమ్మలను కలవబోతున్నా.
సమయానికొచ్చింది కాకతీయ ఎక్స్‌ప్రెస్. రైలుతోపాటే నా ఆలోచనలూ కదిలాయి. నన్ను చూడగానే తాతయ్య-నానమ్మల రియాక్షన్ ఎలా ఉంటుందో.. అసలు గుర్తు పడతారోలేదో.. ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటికి బ్రేక్ వేస్తూ 'హలో.. మిమ్మల్ని టీసీ పిలుస్తున్నారు' అందో స్వరం. ఎదురు సీట్లో అమ్మాయి. పాలరాతి శిల్పంలా ఉంది. 'వినిపించట్లేదా? మిమ్మల్నే' కేకేయడంతో ఈ లోకంలోకొచ్చా. టీసీ వెళ్లిపోగానే తననే కన్నార్పకుండా చూస్తుండిపోయా. నా చూపు మరల్చడానికేమో 'చకినాలు తింటారా?' అంది. సిగ్గు పడుతూ వాటినందుకున్నా. అప్పుడప్పుడు చూపులు కలుసుకోవడం తప్ప మాటలు సాగలేదు మామధ్య. ఇంతకీ తనెవరు? ఎక్కడికెళ్తోంది? ప్రశ్నలు మనసులో గోల పెడుతుండగానే వరంగల్ స్టేషనొచ్చింది. లగేజీ తీసుకుని గేటు దగ్గరికొచ్చేసరికే తను మాయం. ఫోన్ నెంబరైనా అడగని నా చేతగానితనాన్ని తిట్టుకుంటూ బయటికొచ్చా.

రోడ్డుమీద నడుస్తుంటే స్వెట్టర్స్ కనిపించాయి. రెండింటి ధరడిగితే 1500 అన్నాడు షాపతను. పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుంటే 'అంత ధరా? వెయ్యికివ్వు.. లేదంటే వేరే షాపుకెళ్తాం' అంటూ ప్రత్యక్షమైంది ఆ రైలమ్మాయి. ఎక్కణ్నుంచి వూడిపడిందో! తనని చూడగానే ప్రాణం లేచొచ్చింది. పైగా అయిదువందలు మిగిల్చింది అనుకుంటుండగానే నా చేతిలో నోటు లాక్కుంది గడుసుగా. వాటితో రెండు చిన్నసైజు స్వెట్టర్లు కొంది. కొంచెం దూరంలో రోడ్డుమీద అడుక్కుంటున్న అనాథ పిల్లలకిచ్చింది. ఆమె చొరవకి నోరెళ్లబెడితే.. మంచి మనసుకు అభినందించకుండా ఉండలేకపోయా. పేరు, వివరాలు అడుగుతుండగానే తుర్రుమంది.

రెండుగంటల బస్సు ప్రయాణం తర్వాత మా వూళ్లో దిగా. సెంటర్లో నిలబడి బిత్తర చూపులు చూస్తుంటే 'ఏ వూరు పిలగా? ఎవరింటికొచ్చినవ్?' అడిగాడో పెద్దమనిషి. తాత పేరు చెబితే ఆప్యాయంగా పలకరించి, చేతులో చేయేసి తీసుకెళ్లి ఓ ఇల్లు చూపించాడు. ఇరవైఏళ్ల నుంచి హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో ఉంటున్నా ఇలాంటి పలకరింపు ఎరుగను. గేటు తీసి లోపలికెళ్తుంటే పచ్చదనం పరుచుకున్నట్టు పెరట్లో రకరకాల చెట్లు. లోపల అడుగు పెడుతుంటే పరుగులాంటి నడకతో వచ్చి గుండెలకు హత్తుకున్నాడు తాతయ్య. అప్రయత్నంగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నానమ్మ చేసిన హడావుడీ ఎక్కువే. హారతిచ్చి, దగ్గరుండి కాళ్లు కడిగించి మరీ లోపలికి తీస్కెళ్లింది. అమ్మ పంపిన పిండివంటలు, నేను కొన్న స్వెట్టర్స్ వాళ్లకిచ్చా. వందకోట్ల బహుమతి ఇచ్చినట్టు మురిసిపోయారు. ఇక ఇంట్లో గోడల్నిండా నా ఫొటోలే. ఇంతకాలం అంత ప్రేమకు దూరం అయినందుకు ఎంతో ఫీలయ్యా.

సాయంత్రం ఇంటి వెనకాలకెళ్తే ఎవరో అమ్మాయి బట్టలు ఆరేస్తూ కనిపించింది. దగ్గరికెళ్తే ఆశ్చర్యం. తను రైళ్లో కలిసిన అమ్మాయే. ఏం తెలియనట్టే తనెవరని నానమ్మని అడిగా. 'నీ మేనత్త బిడ్డరా' అంది. పాదాలు గాల్లో లేచాయి. వూహలకు రెక్కలొచ్చాయి. నేనే ముదురు అనుకుంటే మరదలు మరీనూ. తనూ ఏం తెలియనట్టే సిగ్గులు చిందించింది. 'ఇంట్లో అంతా బాగున్నారా?', 'చాయ్ తాగుతావా బావా?' అంటూ అమాయకంగా అడిగింది. కొద్దిరోజుల్లోనే మా మనసులు కలిశాయి. పెద్దల ఆమోదమూ దొరికింది. ప్రస్తుతం సిటీకి దూరంగా, ప్రేమాప్యాయతలకు దగ్గరగా ఆ పల్లెటూరిలోనే ఉంటున్నా. చూస్తుండగానే ఏడాది గడిచింది. మా మొదటి పెళ్లిరోజు సందర్భంగా పదిలంగా అల్లుకున్న మా ప్రేమ బంధాన్ని మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకొచ్చా. అన్నట్టు నేను వూరొస్తున్న సంగతి నీకు ముందే తెలుసా అని మరదలిని ఎన్నిసార్లడిగినా 'అదో సీక్రెట్' అందే తప్ప అసలు విషయం చెప్పనేలేదు. ఏదేమైనా పల్లెటూరి వాతావరణంలాగే వాళ్ల మనసులు, ప్రేమలూ స్వచ్ఛమైనవి. ఒక్కసారి రుచి చూస్తే జీవితాంతం వదలాలనిపించదు. అచ్చం నాలాగే.
© Shekharmine

తంబి లేక నేను లేను!

తంబి లేక నేను లేను! 

'తర్వాత క్లాస్ సీనియర్లు తీసుకుంటారట. చచ్చాంపో' క్లాస్‌మేట్ నిట్టూర్పుతో నా గుండెలో రైళ్లు పరుగెత్తాయి. ఓ ఫంక్షన్ విషయమై ముందురోజే వాళ్లతో గొడవపడ్డా. జూనియర్లు నాకు అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లు క్లాస్ తీసుకోవడానికి వస్తున్నారంటే కచ్చితంగా మాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! వాళ్లని తప్పించుకోవాలని గ్రౌండ్‌వైపు అడుగులేస్తున్నా. 'మేడమ్.. అటెళ్లొద్దు. సీనియర్లు అట్నుంచే వస్తున్నారు' కేకేశాడు నారాయణస్వామి. సహాధ్యాయి. 'అయినా జరిగిన దాంట్లో మీ తప్పేం లేదుగా? పదండి ఏం చేస్తారో చూద్దాం' క్లాసులోకి లాక్కెళ్లినంత పని చేశాడు. సీనియర్లు నాపై విరుచుకు పడుతుంటే జూనియర్లందరినీ ఏకం చేసి నన్ను బయటపడేశాడు. ఆరోజు నుంచి అతడిపై అభిమానం మొదలైంది.
నోట్స్ కోసం మా ఇంటికొచ్చాడోరోజు. వెళ్తూవెళ్తూ మీతో ఓ విషయం మాట్లాడాలన్నాడు. లవ్వూగివ్వూ అంటే లాగి చెంపకాయ్ కొట్టాలకున్నా. కానీ తనలా అన్లేదు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని అక్కా అని పిలవొచ్చా' అంటూ మనసు టచ్ చేశాడు. 'నీ ఇష్టం తంబీ' అన్నా. ఆరోజు నుంచి మేం అక్కాతమ్ముళ్లం అయ్యాం.

తెలిసో, తెలియకో వయసు ప్రభావంతో యువత కొన్ని తప్పులు చేస్తుంటారు. మా తరగతిలో కొందరలా చేస్తుంటే తంబి సున్నితంగా మందలించేవాడు. భవిష్యత్తులో ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో విడమరిచి చెప్పేవాడు. చిన్న వయసులో వాడి పెద్దరికం చూసి ముచ్చటేసేది. అప్పుడప్పుడు నాకూ హితబోధ చేసేవాడు. అందులో అజమాయషీ కన్నా అభిమానమే ఉండేది. వాడి సాంగత్యంలో నేనూ చలాకీ పిల్లనయ్యా. యాంకరింగ్‌లు, డ్యాన్స్‌లు.. అబ్బో రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి. డీఎడ్ పూర్తి అయి వీడ్కోలు తీసుకుంటుంటే ఏడుపాగలేదు. 'అక్కా మనం కాలేజీనే వదిలేస్తున్నాం. మన అనుబంధాన్ని కాదు' అని ఓదార్చాడు.

డీఎస్సీ పడింది. తంబి, నేను, ఇంకో క్లాస్‌మేట్ కోచింగ్ కోసం కర్నూలొచ్చాం. బ్యాగులు స్కూళ్లో పెట్టి హాస్టల్ వెతకడానికెళ్లాం. వచ్చేసరికి బ్యాగ్‌లో డబ్బులు మాయం. ఏం చేయాలో తెలీక ఏడుపు మొహం పెడితే 'మై హూ నా' అంటూ హాస్టల్ ఫీజు కట్టేశాడు. అలాగని తనేం బాగా డబ్బున్నవాడు కాదు. అదేమాటంటే 'నీ సొంత తమ్ముడైతే ఇలా చేయడా?' అని నా నోర్మూయించాడు. వాడి దయ, సహకారంతో కోచింగ్ కూడా అయిందనిపించా.

ఇంటికెళ్లగానే అమ్మకి తీవ్ర అనారోగ్యం. ఆసుపత్రికి తీస్కెళ్లాం. ఆపరేషన్ చేయాలన్నారు. నెలరోజులు అక్కడే ఉన్నాం. విషయం తెలిసి పరుగెత్తుకొచ్చాడు. అడక్కుండానే అన్నిరకాల సాయం చేశాడు. బంధువులు ముఖం చాటేస్తున్నవేళ ఆత్మబంధువయ్యాడు. ఇవన్నీ తలచుకొని ఏడుస్తుంటే 'నేనుండగా నీ కళ్లలో కన్నీరు రాకూడదక్కా' అని సముదాయించాడు. 'ఇంకో మూడునెలల్లో మనకు ఉద్యోగాలొస్తాయి. కష్టాలన్నీ తీరతాయి' అని తను చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తే.

కట్ చేస్తే.. తంబీ మాటే నిజమైంది. ఇప్పుడు వాడూ, నేనూ టీచర్స్. అమ్మ ఆరోగ్యం బాగైంది. కష్టాలు తీరాయి. ఈరోజు నేనింత సంతోషంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ తంబీదే. కాలేజీ అనుభవాల గని. కొందరికి మంచి స్నేహితులు దొరుకుతారు. ఇంకొందరికి ప్రేమ. నాకు నా తంబీనిచ్చింది. నా కష్టసుఖాల్లో, బాధ్యతలో, కుటుంబంలో ఒకడై నిస్వార్థ ప్రేమ కురిపించిన తంబీ.. నేను నీకు ఏమివ్వగలను.. 'ఐలవ్యూ తంబీ' అనే మాట తప్ప!
© Shekharmine

ఆదుకున్నాను.. ఆడుకున్నాడు!

ఆమె అవసరాల్లో ఆదుకుంది. అతడు జీవితంతో ఆడుకున్నాడు. తమ బంధాన్ని ప్రేమనుకుందా అమ్మాయి. ఆ బలహీనతను క్యాష్ చేసుకున్నాడు అబ్బాయి. దగా పడ్డ చిన్నది చెబుతోందా దీనగాథ.

నాపేరు స్వీటీ. అసలు పేరు కాదు.. తను ముద్దుగా పెట్టుకుంది. అతడలా పిలుస్తుంటే నా మనసు గాల్లో తేలిపోయేది.
బీఎడ్ సహాధ్యాయి తను. 'మాది నల్గొండ. ఇక్కడే గది అద్దెకు తీసుకొని ఉంటున్నా' ఎవరితోనో చెబుతుంటే విన్నా. మాదీ నల్గొండే. ఉత్సుకతతో వెళ్లి పలకరించా.

మర్నాడు క్లాస్‌లో 'హాయ్' చెప్పాడు. నేనూ 'హలో' అన్నా. మాటలు ప్రారంభం. ఓ సాయంత్రం రోడ్డుమీద కనపడ్డాడు. కలిసి నడక మొదలుపెట్టాం. వ్యక్తిగత వివరాల్లోకి వెళ్లాం. 'మాది చాలా పేద కుటుంబం. నన్ను చదివించడానికి అమ్మానాన్నలు పస్తులుంటున్నారు' అంటుంటే మనసు చివుక్కుమంది. ఆ కష్టాల్ని గట్టెక్కించడానికి తనెంతో కష్టపడి చదివేవాడు. పైగా కలివిడి మనస్తత్వం. ఇవన్నీ తెలిశాక అతడిపై మనసు పారేసుకోకుండా ఉండలేకపోయా. అభిమానం చొరవై.. చొరవ చనువై.. కొన్నాళ్లకది ప్రేమబాట పట్టింది.

తను లేకుండా నేనుండలేని స్థితి. తనేం అడిగినా కాదనలేని పరిస్థితి. 'కోర్సు పూర్తయ్యాక ఎలాగూ పెళ్లి చేసుకుంటాం. ఈలోపు కలిసుంటే తప్పేంటి?' అన్నాడోసారి. నేనూ అడ్డు చెప్పలేదు. ఇద్దరం ఒకే గదికి మారాం. పదినెలలు పెళ్త్లెన భార్యాభర్తల్లాగే మెలిగాం. ఇక అతడి ఖర్చులన్నీ నావే. గది అద్దె.. పాకెట్‌మనీ.. ఫీజులు.. సెల్ రీఛార్జ్‌తో సహా.

'స్వీటీ... అమ్మకేం బాగోలేదు. ఆసుపత్రిలో చూపిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు' అన్నాడోరోజు ఏడుస్తూ. కొత్త దుస్తులు కొందామని దాచుకున్న ఐదువేలు చేతిలో పెట్టా. కాబోయే అత్తయ్యకి ఆమాత్రం చేయడం నా బాధ్యతనిపించింది. కొన్నాళ్లకి తను కోలుకుంది. మాకు ఆల్ హ్యాపీస్.

బీఎడ్ పరీక్షలయ్యాయి. 'డీఎస్సీ ఇప్పట్లో ఉండదట. కానిస్టేబుల్ ట్రెయినింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నా. కానీ...' అతడి మాట నాకర్థమైంది. అదే రోజు బంగారు చైన్ అమ్మి పదివేలు ఇచ్చా. 'నాకోసం ఎన్నో చేస్తున్నావ్. పెళ్లయ్యాక నిన్ను బంగారంలా చూసుకుంటా బంగారూ' అన్నాడు చేతిలో చెయ్యేస్తూ. ఆ మాటకే పొంగిపోయా. ఆల్ ది బెస్ట్ చెప్పా.

ఫలితాలొచ్చాయి. తను కానిస్టేబుల్‌గా ఎంపికైన శుభవార్త. ఆనందంతో అందరికీ స్వీట్లు పంచా. కానీ అదే నా జీవితంలో ఆఖరి సంతోషం అని గుర్తించలేకపోయా. ఉద్యోగమొచ్చిందిగా పెళ్లెపుడు చేసుకుందాం అంటే 'మీ పేరెంట్స్‌ని వచ్చి మాట్లాడమను' అన్నాడు. పన్నీటి జల్లులు.. సన్నాయి మేళాల్ని వూహించుకుంటూ వూహల్లో తేలా. కానీ నవ్వుతూ వెళ్లిన అమ్మానాన్నలు రుసరుసలాడుతూ తిరిగొస్తుంటే మనసేదో కీడు శంకించింది. 'మన తాహతు మించి కట్నం అడుగుతున్నారు. అతడ్ని మర్చిపో ఇక' అంటుంటే కన్నీళ్లాగలేదు. వెంటనే ఫోన్ అందుకున్నా. 'ఔను.. నాకు లక్షలు ఇవ్వడానికి చాలామంది క్యూలో ఉన్నారు. నాది సర్కారీ కొలువు కదా' అతడి మాటలో వెటకారం. 'అయినా మీకేం తక్కువ. ఓ ఇరవై అయినా ఇవ్వొచ్చు. పైగా నీకు ఉద్యోగం కూడా లేదాయే'. ఆ మాటల్లో ప్రాణంలా ప్రేమించిన ప్రియుడు లేడు. అచ్చం పశువుల సంతలో బేరమాడే బ్రోకరే కనిపించాడు. 'నేను అడిగిన కట్నం ఇప్పించు. లేదా వేరొకడ్ని చూస్కో' చివరి మాటతో నా ప్రేమ మైకం పూర్తిగా దిగిపోయింది. ఛీ.. ఇలాంటి వాడినా ప్రేమించింది అనిపించింది. ఫోన్ పక్కన పడేసి వెక్కివెక్కి ఏడ్చా.

నన్ను కాదనుకున్నా ఎప్పుడైనా నేను చేసిన సాయం గుర్తొచ్చి తిరిగొస్తాడనే చిన్న ఆశ ఉండేది. అదీ అత్యాశేనని తొందర్లోనే అర్థమైంది. తనకి నిశ్చితార్థం జరిగింది. అదీ నా క్లాస్‌మేట్‌తోనే. నిలదీస్తే అబ్బే అదేం లేదని బుకాయించాడు. తర్వాత సెల్‌నెంబరే మార్చేశాడు. ఆమె నెంబర్ కూడా స్విచ్ఛాఫ్. చిరునామా తెలియదు. ఇప్పుడు నాకు మిగిలింది ఏడుపొక్కటే. నా అతి ప్రేమ.. అతడిపై అతి నమ్మకం నన్ను పాతాళంలోకి తోసింది.
© Shekharmine

మన్నించాలి నేస్తం.. వీడాలి మౌనం!

పదో తరగతి క్లాసు. 'మే ఐ కమిన్ సర్..' ఓ అమ్మాయి పిలుపుతో గుమ్మం వైపు తలెత్తాం. లేట్ అడ్మిషనంటూ వచ్చింది. పేరు రమ్యట. అందరిలాగే తనతోనూ మాట కలిపా. నాలో ఏం నచ్చిందో.. మూణ్నెళ్లు తిరక్కముందే 'నువ్వంటే ఇష్టం' అంది. మనసులో గందరగోళం. ఎలా స్పందించాలో తెలియదు. మాట దాటేశా. ఈలోపే నేను వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నానని మోసేశాడు ఓ క్లాస్‌మేట్. 'అదా విషయం.. అందుకేనా నన్ను దూరం పెడుతున్నావ్?' అంటూ గొడవకి దిగింది. నేనూ తగ్గలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాం.

ఇంటర్లో అమ్మాయిలకు దూరంగా ఉన్నా. రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. మళ్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ రోజు కనిపించింది రమ్య. నన్ను చూడగానే తన మొహం వేయి వాట్ల బల్బులా వెలిగిపోయింది. నాకేమో తను తిట్టిన తిట్లే గుర్తొచ్చాయి. మొహం తిప్పేసుకొని అక్కణ్నుంచి కదిలా.

ఇంజినీరింగ్. పెద్దోడినైపోయానన్న ఫీలింగ్. అక్కడే పరిచయమైంది ప్రియ. నా భావాలకు క్లోనింగ్‌లా, నా కంటికి ప్రేమదేవతలా కనిపించింది. పైగా ఇద్దరం ఒకే బ్రాంచ్. తనని చూస్తూ నాలుగేళ్లు నాలుగు క్షణాల్లా గడిపేయొచ్చనుకున్నా. ఆశ ఆచరణలోకి రాకముందే నా సంతోషానికి బ్రేక్. సెక్షన్లు వేరు చేసి మమ్మల్ని తలా ఓ క్లాసులో పడేశారు. బ్రేక్‌టైంలో కళ్లప్పగిస్తూ, కావాలని మాట కలుపుతూ మహదానంద పడిపోయేవాణ్ని. మరోవైపు ఫస్టియర్ పూర్తయ్యేసరికి 'రామ్ మంచి కుర్రాడు. బాగా చదువుతాడు' అనే ట్యాగ్ తగిలించారంతా. ఈ టైంలో నేను ప్రేమంటే చెడ్డ పేరొస్తుందనే భయం. 'మూడేళ్లు ఇక్కడే ఉంటుందిగా. సమయం చూసి విషయం చెప్పొచ్చులే' అని వెనక్కి తగ్గా. కానీ నేను తనని ఫాలో అవ్వడం, మాట్లాడుతూ మెలికలు తిరిగిపోవడం ఫ్రెండ్స్ గమనించారు. నాకూ, ప్రియకి డ్యాష్ డ్యాష్ అని కాలేజీ అంతా చాటింపు వేశారు. ఇక ఆగలేకపోయా. ఏదైతే అదైందని ఓరోజు 'ఐ లవ్యూ' చెప్పేశా. తను 'ఐ టూ' అన్లేదు. లాగి కొట్టలేదుగానీ చిన్నసైజు లెక్చరిచ్చింది. భవిష్యత్తులో నీ ప్రేమ ఒప్పుకుంటా అనే సంకేతాలు కనపడ్డాయి. ఆరోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.

ప్రతి మనిషికీ అహముంటుంది. ఎప్పుడోగానీ దాన్ని బయటికి తీయొద్దు. మనసుపడ్డవాళ్ల ముందు అసలు చూపించొద్దు. అది తెలీక ఓసారి ప్రియ ముందు ఆధిపత్యం చెలాయించాలని చూశా. తనకది నచ్చక గొడవైంది. తను బాగా బాధ పడినట్టుంది. అప్పుడైనా మెట్టు దిగాల్సింది! నేనలా చేయలేదు. నాతో మాటలు కట్ చేసింది. నరకం ఎలా ఉంటుందో అర్థమైంది. తట్టుకోలేక తనని ప్రసన్నం చేసుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నా. నా అదృష్టంకొద్దీ ఆ అవకాశం తొందర్లోనే వచ్చింది. వేరే కాలేజీలో జరిగే ఫెస్ట్‌కి వెళ్లే మా బృందంలో తను చేరింది. ఫెస్ట్ ముగిసేలోగా తన మనసు గెల్చుకోవాలనుకున్నా.

జీవితంలో కొన్ని మలుపులు మనం ఊహించనంత దారుణంగా ఉంటాయ్. మేం వెళ్లిన కాలేజీలోనే రమ్య చదువుతోంది. నా కారణంగా రెండుసార్లు బాధ పడ్డ అమ్మాయి. పాపం అనిపించి పలకరించా. 'నన్నింకా క్షోభ పెట్టడానికొచ్చావా? ఇంకేమైనా అనాల్సిన మాటలున్నాయా?' అంటూ తిట్టేసింది. నిర్ఘాంతపోయా. క్షమించమంటూ లెటర్ పంపా. మర్నాడే పరుగెత్తుకొచ్చింది. అందరిముందే నా చేయి పట్టుకొని బోరున ఏడ్చేసింది. 'ఇడియట్.. నిన్నింకా ప్రేమిస్తూనే ఉన్నా' అన్నట్టుగా ఉన్నాయ్ ఆమె చూపులు. ఆలస్యం చేస్తే ప్రమాదమని ప్రియతో నా ప్రేమ విషయం చెప్పా. కళ్లతోనే కాల్చేసేలా చూస్తూ నోటికొచ్చిన బూతులు తిడుతూ వెళ్లిపోయింది.

ఫెస్ట్ ముగిసింది. కొత్త సమస్య మొదలైంది. రమ్యని కలవడం ప్రియ చూసిందేమో! ఇప్పుడు అసలు మాట్లాడ్డమే మానేసింది. నన్ను ఇష్టపడ్డ అమ్మాయిని నేను వద్దనుకున్నా. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదంటోంది. అనుమానాలు, అపార్థాలు.. కారణేమేదో తెలియదు. ఇది చదివాకైనా ఆ ఇద్దరూ క్షమిస్తారని ఆశిస్తున్నా.
© Shekharmine

పదిరోజుల ప్రేమ.. చూడకుండానే విడిపోయా..!!

రాంగ్‌కాల్ పరిచయం ఇద్దర్ని ప్రేమికులుగా మార్చింది. వూసులాడుకున్నారు. పెళ్లి బాసలు చేసుకున్నారు. రేపు కలవబోతుంటే ఈరోజే బ్రేకప్ చెప్పేసుకున్నారు. మధ్యలో ఏమైంది? అమ్మాయి మాటల్లో.


పొద్దునే కొత్త నెంబర్ నుంచి మిస్‌కాల్. ఆరా తీస్తే అటువైపు అబ్బాయి. 'సారీ.. ఫ్రెండ్‌కి ఫోన్ చేయబోయి పొరపాటున మీకు చేశా. ఏమనుకోకండి' సంజాయషీ ఇచ్చుకున్నాడు. సర్లే అని పెట్టేస్తుంటే 'ఇఫ్ యూ డోన్ట్ మైన్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా?' అని అభ్యర్థన. మాటలో వినయం.. అడిగే తీరూ నచ్చింది. వివరాలు చెప్పా. చినుకులా మొదలయ్యాయి మాటలు.. వరదలా మారి రాత్రంతా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కొంచెం అమాయకత్వం.. మరింత చిలిపితనం కలగలిపి అతడి మాటలు భలే గమ్మత్తుగా ఉండేవి. ఏం చెప్పినా చెవులొగ్గాలనిపించేది. ఓసారలాగే మాట్లాడుతూ 'ఇద్దరమ్మాయిలు నన్ను ప్రేమ పేరుతో మోసం చేశారు' అన్నాడు. 'అయ్యో పాపం' అనిపించింది. 'వాళ్లు నన్నొదిలేసినా నేను నిన్నొదలను. ఐలవ్యూ' అన్నాడు. నాకు షాక్. మాట కలిపిన రెండోరోజే ఈ ప్రపోజల్. నేనూ కాదనలేకపోయా. కానీ మా ఇద్దరి కులాలు వేరు. అదే అంటే 'మనసులు కలిశాయి. కులాలతో పనేంటి?' అన్నాడు. తన దూకుడు చూస్తుంటే మా పెళ్లికి పెద్దల్ని ఒప్పిస్తాడనే నమ్మకం కుదిరింది. ఎక్కడున్నావ్.. వేళకి భోంచేస్తున్నావా? కంటి నిండా నిద్రపోతున్నావా.. లేచింది మొదలు నా నామస్మరణే. గారంగా 'బుజ్జీ' అని పిలిచేవాడు. ఒకమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి? రాన్రాను అతడిపై ప్రేమ పెరుగుతూనే ఉండేది. పరిచయమైన ఎనిమిదోరోజు మేం కలుసుకోవడానికి ముహుర్తం పెట్టుకున్నాం.ఈలోపు అతడి వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం. ఉద్యోగం ఎక్కడంటే ఓ కంపెనీ పేరు చెప్పాడు. అదృష్టంకొద్దీ అందులోనే ఓ ఫ్రెండ్ పనిచేసేవాడు. వెంటనే తనకి ఫోన్ కలిపా. ఆతృతతో కాబోయేవాడి గురించి చెప్పమన్నా. దారుణమైన విషయాలు తెలిశాయి. అతడి వయసు.. ఉద్యోగ హోదా.. ఇతర వివరాలన్నీ అబద్ధాలే. గుండె బద్ధలైంది. ఎందుకిలా చేశావని నిలదీశా. ఇక జీవితంలో తన గొంతు వినొద్దనుకున్నా. ప్చ్.. ప్రాణంగా ప్రేమించా కదా! ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు. వ్యక్తిగత వివరాలు అబద్ధం చెప్పినా అతడి ప్రేమలో కల్మషం లేదనుకున్నా. అదీ తప్పేనని తర్వాతే అర్థమైంది.తన మోసపు చేష్టలు తప్పు కాదట. అతడి వివరాలు నేను తెలుసుకోవడమే ఘోరమట. అకారణంగా నాపై విరుచుకుపడ్డాడు. విచక్షణ మర్చిపోయి నా ఫ్రెండ్‌తో నాకు సంబంధం అంటగట్టాడు. వివరాలిచ్చాడని ఆఫీసులో అతడ్ని చెడ్డవాడిగా చిత్రీకరించాడు. 'నీ ప్రేమ నాటకం. నువ్వు నాతో ఆడుకున్నావ్' అంటూ కపట ఏడుపుతో నన్నే దోషిని చేశాడు. సెల్‌ఫోన్ పరిచయం.. ప్రేమ.. ఇలాంటివన్నీ ట్రాష్ అని స్నేహితులు చాలాసార్లు హెచ్చరించారు. నేనే పెడచెవిన పెట్టా. చదువుపై ధ్యాస పెట్టలేక, అతడ్ని మర్చిపోలేక ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నా. నాకీ శాస్తి జరగాల్సిందే.
© Shekharmine

ప్రేమ పంచి.. మదిలో బాకులు దించి!

నా పేరు స్టుపిడ్. అవున్నిజమే. నాకిష్టమైన, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి ప్రేమగా పిలిచేదలా.

మొదట్లో నేను జులాయి. కన్నవాళ్లపై పడి బతికేయడం.. జల్సాలు.. సరదా కోసం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్‌లు.. జాలీగా గడిచిపోయేది. అనుభవించు రాజా.. అన్నది నా సిద్ధాంతం. తన పరిచయం నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పట్నుంచే ప్రేమ, పెళ్లి.. ఈ అమ్మాయితోనే అని ఫిక్సయ్యా.

ఆస్తి, అందంలోనే కాదు పంచే ప్రేమలోనూ తనదే పైచేయి. పండగొస్తే నాకే మొదట విష్ చేసేది. బయటికెళ్తే నా చేయి వదిలేది కాదు. నాకు కష్టమొస్తే తనకి కన్నీళ్లొచ్చేవి. అంత మంచి అమ్మాయి దొరికినందుకు నా అంత లక్కీఫెలో లేడనుకున్నా. పెద్ద ఉద్యోగం సంపాదించి ఆమె హోదాకి ఎదగాలనుకున్నా. రెండేళ్లు పుస్తకం వదల్లేదు. ప్రయత్నించని ఉద్యోగం లేదు. ప్చ్.. నా ప్రయత్న లోపమో, విధిరాతో ఏ కొలువూ దక్కలేదు. 'బాధ పడకు నేస్తం.. ఇది కాకపోతే మరోటి నీకు తోడుగా నేనున్నా కదా' అని భరోసా ఇస్తుందనుకున్నా. నేను అనుకున్నది జరగలేదు. ఆశించని మార్పొచ్చింది తనలో.

కొంతకాలం నేనే తనకి కావాలి. ఒక్కోసారి 'నీ నీడ కూడ భరించలేను' అనేది. కలవడం, విడిపోవడం రెండూ ఆమె ఇష్టప్రకారమే. ఇష్టమైన వ్యక్తిని కలవడంలో ఉండే సంతోషాన్ని మాత్రమే తనకిచ్చా. విడిపోవడంలో ఉండే బాధ నేనొక్కడినే అనుభవించా. ఒక్కసారైనా నేను తనని దూరం చేసుంటే నా బాధ తనకీ తెలిసేది. బాధ అనుభవిస్తూ తనని మర్చిపోయే సమయానికి ప్రేమగా దగ్గరయ్యేది. పిచ్చిగా ఆమె వెంట పరుగెత్తేవాణ్ని. అంతలోనే అసహ్యించుకునేది.. చులకనగా చూసేది. అయినా మరోసారి ప్రేమగా పలకరిస్తే అన్నీ మర్చిపోయేవాణ్ని.

ఎందుకిలా చేస్తుందో అర్థంకాక చాన్నాళ్లు గింజుకున్నా. ఆఖరికి నా ఆలోచనల అంతర్మథనానికి తనే తెర దించింది. 'నా కుటుంబం కోసమే నిన్ను దూరం పెడుతున్నా'నంది. 'నీ వల్లే నా భవిష్యత్తు నాశనమైంద'ని ఏడ్చింది. అప్పుడైతే నాకు బాధ కలగలేదస్సలు. కుటుంబానికి అంత విలువిచ్చే అమ్మాయిని ఇష్టపడినందుకు.. ప్రేమించబడినందుకు కొంచెం సంతోషంగా, ఎంతో గర్వంగా అనిపించింది. కానీ అంత మంచి అమ్మాయి కూడా ఓ తప్పు చేసింది. తను ప్రేమించింది కూడా ఓ మనిషినే అనీ.. తనకీ ఆశలు, అభిప్రాయాలు, ఇష్టాలు, మనసు ఉంటాయని గ్రహించలేకపోయింది. అతడికీ కొంచెం విలువ ఇవ్వాలనే విషయమే మర్చిపోయింది. నేనూ తిట్టుకున్నాను. ఇన్నేళ్ల ప్రేమలో ఎలాంటి విషయమైనా పంచుకునే చనువు, నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేకపోయానని.

తప్పెవరిదో ఇప్పటికీ అంతుపట్టదు. ఇప్పుడు నా సమస్య పెళ్లి. దానిమీద ఎలాంటి నమ్మకాలు, ఆశలు లేవు. ఎందుకంటే ఒకమ్మాయి జీవితాంతం నాతో సంతోషంగా ఉంటుందనే నమ్మకం పోయింది. నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. ఏదో ఒకరోజు బయటపడతానని భయంగా ఉంది. సమాజం కోసం, నావాళ్ల కోసం ఆనందంగా ఉన్నట్టు నటించడం నావల్ల కావడం లేదు. నా బాధ అర్ధం చేసుకొని తను కనీసం 'నేను ప్రేమికురాల్ని కాదు..స్నేహితురాల్ని' అనైనా చెబుతుందని ఆశగా ఎదురుచూస్తున్నా. ఫ్రెండ్స్.. ప్రేమంటే కమిట్‌మెంట్ కాదు. ఒక బాధ్యత. సక్రమంగా నిర్వర్తించే సత్తా ఉంటేనే ప్రేమించండి. కన్నవాళ్లను ఒప్పించగలిగితేనే ప్రేమించండి. ప్రేమలో ఉన్నప్పుడు పేరెంట్స్‌ని, పేరెంట్స్ గుర్తొచ్చినపుడు ప్రేమని వదిలేయకండి. అవతలి వ్యక్తి గుండెల్లో బాకులు దింపి అంతులేని పాపాన్ని మూటకట్టుకోకండి.
© Shekharmine

ఇద్దరు అమ్మాయిల మధ్య...ఏకాకి!

మామిడి తోరణాలు.. బంధువుల హడావుడి.. ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లారితే మరదలితో పెళ్లి. కళ్ల ముందు మెదులుతున్న కలర్‌ఫుల్ జీవితాన్ని వూహించుకుంటున్నా. ఇంతలో అనుకోని ఉపద్రవం. పెళ్లి పనుల్లో ఉండాల్సిన మామయ్య తన కూతుర్ని కిడ్నాప్ చేశానంటూ ఇంటి మీదకు గొడవకొచ్చాడు. నాకేం అర్థం కాలేదు. నాక్కాబోయే భార్యని నేనెందుకు కిడ్నాప్ చేస్తా? అదే అడిగా. 'నువ్వూ.. నీ గర్ల్‌ఫ్రెండ్ కలిసి చేశారీపని' మరో మాట తూలాడు. వెంటనే స్రవంతికి ఫోన్ కలిపా. లౌడ్‌స్పీకర్ ఆన్ చేశా. 'నీ మరదలెవరు? తనతో నాకేం పని? ఇలా అడగడానికి నీకేమైనా బుద్ధుందా' తిట్టి మరీ ఫోన్ పెట్టేసింది. ఆఖరికి తెలిసిందేంటంటే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని నా మరదలే ఓ ఫ్రెండ్ ఇంట్లో దాక్కుందట. ఇది తెలియగానే నేను షాక్. అసలిదంతా ఎందుకు జరిగిందంటే నా కథంతా మీకు తెలియాల్సిందే.

మరదలు పుట్టగానే నాకు పెళ్లాం పుట్టిందన్నారు పెద్దవాళ్లు. అచ్చం సినిమాల్లోలాగే. వాళ్ల అభీష్టాన్నే మా ప్రేమగా మార్చుకున్నాం. అలకలు.. గిల్లికజ్జాలు.. ఒకరిపై ఒకరికి చచ్చేంత అభిమానం.. బాల్యం నుంచి యవ్వనం దాకా మా మధ్య ముడిపడ్డ ముచ్చట్లెన్నో. అంతలా.. ప్రాణంలా ప్రేమించిన అమ్మాయిలో ఒక్కసారిగా వూహించని మార్పు. ఉద్యోగం కోసం తను పుణె వెళ్లొచ్చింది. నాకు టార్చర్ మొదలైంది. 'బావా.. నిన్ను పెళ్లి చేసుకున్నవాళ్లెవరూ రెణ్నెళ్ల కంటే ఎక్కువ రోజులు కాపురం చేయలేరు' అందోపూట. వేళాకోళమనుకున్నా. ఆపై దగ్గరికెళ్తే మొహం తిప్పుకునేది. పలకరిస్తే కళ్లెర్రజేసేది. మరదలి తీరు చిరాకు తెప్పించేది. తిరిగెళ్లాక కూడా అదేవరుస. ఫోన్ చేయదు. చేస్తే తీయదు. విసిగిస్తున్నానని ఫోన్ నెంబరే మార్చేసింది. తన మాట నా చెవిన పడక దాదాపు పిచ్చివాణ్నయ్యా.

మోడు వారుతున్న జీవితంలోకి వసంతంలా వచ్చింది స్రవంతి. గాయపడ్డ మనసుకి మంచి మాటలతో మందేసింది. దగాపడ్డ మనిషికి ప్రేమ పంచింది. 'తన కోసం నువ్వెందుకు వెంపర్లాడటం.. నిన్ను కాదన్నందుకు తనేడవాలిగానీ' అంటూ వూరడించింది. నా గతం తెలిసీ ప్రపోజ్ చేసింది. రెండేళ్లు మేం లవర్స్ అన్న విషయం ఎవరికీ తెలియనంత పద్ధతిగా ప్రేమించుకున్నాం.

ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యా. మరదలితో పెళ్లికి రాయబారం పంపాడు మామయ్య. నేనంటే తనకిష్టం లేదు.. ఈ పెళ్లెలాగూ జరగదనుకుంటూ వాయిదాలు వేశా. సమయం చూసి స్రవంతితో నా ప్రేమ విషయం చెప్పాలనేది ప్లాన్. అయితే అనూహ్యంగా మరదలు పెళ్లికి ఒప్పుకుంది. 'నువ్వూ ఒప్పుకోకపోతే మేం ఆత్మహత్య చేసుకుంటాం' బెదిరించారు కన్నవాళ్లు. నా ప్రమేయం లేకుండానే ముహుర్తం పెట్టేశారు.

ఉద్యోగంలో చేరడానికి చెన్నై వెళ్లా. మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా నాన్చితే నష్టమని జరిగిందంతా స్రవంతికి చెప్పా. నీదే నిర్ణయమన్నా. నేనూహించని మాట చెప్పింది. 'ముహుర్తాలు పెట్టుకున్నారుగా.. ఇక స్నేహితుల్లా విడిపోదాం' అంది. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే మరదలి మెసేజ్. 'స్రవంతి ఎవరు? తనకూ నీకూ సంబంధమేంట'ని. కోపంతో మా లవ్‌స్టోరీ చెప్పేశా. నన్నిష్టపడనిదానివి నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీశా. తప్పు చేశానంది. అన్నీ మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకుందామంది. చేసేదేం లేక నేనూ రాజీకొచ్చా. కానీ నావల్ల స్రవంతి నష్టపోయిందనే అపరాధభావం కుంగదీసేది. తన కోసమే హైదరాబాద్ వచ్చేశా. కెరీర్ పరంగా, ఆర్థికంగా తోడు నిలిచా. పరోక్షంగా తనకో మంచి సంబంధం కుదిర్చా. ముగ్గురికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవితం మొదలు కాబోతోందనే భరోసా కలిగింది నాలో.

అంతా ఓకే అనుకుంటుంటే ఇదిగో ఈ పెళ్లికూతురు జంప్. నా లవర్‌ని పెళ్లాడటానికి నువ్వెవరని స్రవంతి అడగటంతోనే అలా చేశానంది మరదలు. సామరస్యంగా విడిపోదామన్న మాజీ ప్రేయసి ఇలా చేస్తుందనుకోలేదు. ఏదేమైనా నా పెళ్లి పెటాకులైంది. పరువు గంగ పాలైంది. నేనే అందరిలో చెడ్డవాడిగా మిగిలిపోయా. ఇద్దరమ్మాయిల్ని ప్రేమించి, ఒక్కరితో జీవితం పంచుకోవాలనుకున్నా ఆ ఇద్దరి చంచల మనస్తత్వంతో ఏకాకిగా మిగిలిపోయా.
© Shekharmine

Monday, 12 October 2015

ఆన్‌లైన్ ప్రేమ.. ఆశయాన్ని చిదిమేసింది.

బాగా చదవాలి.. మంచి జాబ్ కొట్టాలి.. ఇదీ నా లక్ష్యం. మొదట్నుంచీ సరదాలు, ప్రేమలకు దూరంగా ఉన్నా. ఫలితం.. బీటెక్‌లో ప్రాంగణ నియామకానికి ఎంపికయ్యా. చేరడమే తరువాయి. కలకు అడుగు దూరంలో నేను.

ఖాళీగా ఉన్నానని ఓరోజు ఫేస్‌బుక్ తెరిచా. ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం. బుద్ధిమంతుడనుకొని ఓకే చేశా. 'హాయ్.. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు' మర్నాడే సందేశం. నేనూ స్పందించా. పలకరించే తీరు, మాటల్లో మర్యాద నన్నాకట్టుకున్నాయి. ఎప్పుడూ ఏ కుర్రాడ్నీ పట్టించుకోని నేను తన మెసేజ్ కోసం ఎదురుచూసే స్థాయికి చేరా.

చాటింగ్ మాటల్లోకి మారింది. తన గొంతు వినకపోతే ప్రాణం పోయేది. తనూ అంతే ఆపేక్ష చూపేవాడు. ఇదిలా కొనసాగుతుండగానే 'నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా' అన్నారు నాన్న. ఆలస్యం చేయలేదు. మనోహర్‌తో పరిచయం, ప్రేమ అన్నీ చెప్పేశా. ఒకర్నొకరు నేరుగా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రేమేంటని ఆశ్చర్యపోయారు. అమ్మతో ప్రతీది పంచుకునేదాన్ని. ప్రేమ విషయం దాచినందుకు చాలా నొచ్చుకుంది. అయినా వాళ్లేం నాపై అరవ లేదు. బంధించలేదు. వాళ్లకి నేనంటే ప్రాణం. 'సరే.. తను, తన కుటుంబం మంచిదైతే పెళ్లికి ఒప్పుకుంటాం' అన్నారు. అంతా అనుకూలంగా ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో.

వారమయ్యాక ప్రేమ ఫలితాలొచ్చాయి. నాకు ప్రతికూలంగా. 'అబ్బాయి ఓకే. అతడి కుటుంబ వివరాలే బాగా లేవు' అన్నారు నాన్న. ఆధారాలూ చూపారు. నా నోట మాట లేదు. 'నాక్కొంచెం సమయం ఇవ్వండి. ఏది మంచో, ఏది చెడో తెలుస్తుంది' అంటే ఒప్పుకున్నారు. జరిగిందంతా మనోహర్‌కి వివరించా. నాకోసం పోరాడుతున్నావ్. నువ్ నా పాలిట ప్రేమదేవతవన్నాడు. అతడిపై ప్రేమ రెట్టింపైంది. కానీ ఎన్నిరోజులు గడిచినా మావాళ్లు కోరినట్టు అతడి కుటుంబం గురించి మంచి ఆధారం చూపలేకపోయా.

అన్నీ అనుకూలంగా ఉంటే అమ్మానాన్నలు మా ప్రేమను ఆశీర్వదించేవాళ్లే. నాకాదృష్టం లేదు. నేనూ కన్నవాళ్లని గౌరవించాల్సిందే! 'మనోహర్.. నన్ను మర్చిపో. నేను నీ జీవితంలోకి రాలేదనుకో' అని మెయిల్ పెట్టా. బాధ దిగమింగుకుంటూనే. ఈ సమయంలోనే శిక్షణకు రావాలంటూ కంపెనీ నుంచి పిలుపు. వెళ్లా. 'ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు' అంటూ తన నుంచి వరుస మెసేజ్‌లు, మెయిళ్లు. బాధతో పనిపై దృష్టిపెట్టలేకపోయా. అయినా ఏం చేయలేని దుస్థితి. ఈలోపు ఓ విదేశీ సంబంధం వచ్చింది. నాలోనూ స్వార్ధం ప్రవేశించింది. ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పా. ముహుర్తాలు పెట్టుకునే సమయానికి ఎక్కువ కట్నం ఇస్తున్నారని అతడు మరో అమ్మాయికి తాళి కట్టాడు. చాలా ఫీలయ్యా. ఆ బాధ చాలదా అన్నట్టు శిక్షణలో పరీక్షలు క్లియర్ చేయలేదని ఆఫీసు నుంచి వెనక్కి పంపారు. ఈసారి దుఃఖం ఆగలేదు. ఈ బాధ నుంచి తేరుకోకముందే అమ్మానాన్నలు మరో సంబంధం తెచ్చి పెళ్లి చేశారు.

చదువయ్యేదాకా నా జీవితం నా చేతుల్లోనే ఉండేది. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌కి అతుక్కుపోయానో అప్పట్నుంచే వూహించని మలుపులు తిరిగింది. ఏదేమైనా నావల్ల ఒకరు నష్టపోయారనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే అతడ్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. 'మనోహర్.. ప్రేమించడానికి రెండు మనసులు చాలు. ఆ ప్రేమ ఫలించి ఇద్దరు ఒక్కటవ్వాలంటే మాత్రం రెండు కుటుంబాలూ కలవాల్సిందే. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్లు ఏడిస్తే నేను సుఖంగా ఉండలేను. అందుకే అలా చేయాల్సి వచ్చింది'.

ఫ్రెండ్స్.. empty mind is devils workshop అంటారు. ఫలిస్తుందో, లేదో తెలియని ఆన్‌లైన్ ప్రేమ కోసం కెరీర్‌ని పణంగా పెట్టకండి. ఉన్న సమయాన్ని ప్రతిభ పెంచుకోవడానికి ఉపయోగించండి. నేనలా చేసి ఉంటే నా స్వప్నం నెరవేరేదే. నా మాట వింటారని ఆశిస్తున్నా.

© Shekharmine

అనురాగంలో అపశృతి!

ఇద్దరక్కలు, పెద్దబావ, వాళ్ల బావలతో ఇల్లంతా సందడిగా ఉంది. 'రారా పెళ్లికొడకా' అన్నారు బావకి బావ నేనింట్లో అడుగు పెడుతుంటే. విషయం అర్థమైంది. కొద్దిరోజులుగా నన్నో ఇంటివాడ్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్లు. ఇప్పుడేదో సంబంధం తెచ్చినట్టున్నారు. 'అమ్మాయిని చూడాల్సిన పన్లేదు. మీరే అన్నీ మాట్లాడేయండి' అన్నా నవ్వుతూ. మనస్ఫూర్తిగా నా మంచి కోరే బంధువులపై నమ్మకంతో.

నా విషయానికొస్తే బీఈడీ పూర్త్తెంది. ప్రైవేటు స్కూళ్లో ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఎమ్మెస్సీ చదువుతున్నా. నేను ఓకే అన్నా నన్ను చూడాలన్నారు వాళ్లు. వెళ్లాం. అమ్మాయి సిగ్గులమొగ్త్గెంది. అన్నీ కుదిరి ముహుర్తం పెట్టేసుకున్నాం. నేనైతే ప్రత్యేకంగా తనకో ముత్యాలహారం ఇచ్చా. ఆపై ఫోన్లో కబుర్లు, బైక్‌పై షికార్లు. ముద్దూముచ్చట్లకు కొదవేలేదు. వారంలో పెళ్లనగా అమ్మాయి మేనత్త పిలిచింది. 'బాబూ ఓసారి నీ సర్టిఫికెట్స్ తీసికొచ్చి చూపించు' అంది ఆర్డరేస్తున్నట్టు. అడిగిన పద్ధతేం బాగోలేదు. పీకల్దాకా కోపమొచ్చినా, గొడవొద్దని ఆమె చెప్పినట్టే చేశా.

పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతలవేళ అందరమ్మాయిల్లా ఏడవకుండా నవ్వుతూనే ఉంది నా భార్య. మేళం వాళ్లతో సహా అంతా వింతగా చూశారు. 'కొందరైతే మీది లవ్ మ్యారేజీనా' అనడిగారు. నాపై ప్రేమతో అలా ప్రవర్తిస్తుందనుకున్నా. రెండోరోజు మరో ట్విస్టు ఇచ్చింది. ప్రతి మగాడు తన జీవితంలో ఉత్కంఠగా ఎదురుచూసే రోజది. కానీ నా తొలిరాత్రి కాస్తా కాళరాత్రిలా మారింది. ప్రేమగా దగ్గరికెళ్తే విసురుగా తోసింది. మురిపెంగా మాట్లాడితే కసురుతూ మొహం తిప్పుకుంది. మూడ్రోజులూ అదే తంతు. చిన్నపిల్లని సర్దుకుపోయా. వారాలు మారినా సీన్ మారలేదు. ఓరోజు గట్టిగా నిలదీశా. 'మా మేనత్త ఇలాగే చేయమంది' అనేసరికి నిర్ఘాంతపోయా. రాన్రాను నాలో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. అది చూసైనా మారాలిగా! వూహూ.. పైగా 'నువ్వేమైనా అంటే అత్త దగ్గరికెళ్తా' అని బెదిరించేది. ఓసారి అదే నిజం చేసింది. చిన్న మాటన్నానని గడప దాటబోయింది. ఆపడానికి ప్రయత్నిస్తే నాపైనే చేయి చేసుకుంది.

సంబంధం కుదిర్చిన అన్నయ్యని తీస్కొని వెళ్లా. 'ఇష్టం లేని పెళ్లి చేశారు. తను రాదు' నిర్లక్ష్యంగా చెప్పింది వాళ్లత్త. ఎవరు బలవంతం చేశారు? ఎందుకు చేశారు? మరి పెళ్లి కాకముందు నాతో సంతోషంగా ఉన్న రోజుల మాటేంటి? దేనికీ సమాధానం లేదు. ఓపిక నశించి కొన్నాళ్లకి పంచాయతీ పెట్టించాం. 'తాగొచ్చి కొడుతున్నాడు. అందుకే వెళ్లను' అంటూ అడ్డంగా అబద్ధం ఆడేసింది నా పెళ్లాం. టీ, కూల్‌డ్రింక్ అలవాటు లేని నన్ను అందరిముందూ తాగుబోతుని చేసింది. అయినా పట్టించుకోకుండా రమ్మని బతిమాలా. విన్లేదు. నెల్లాళ్ల నిరీక్షణ ఫలించలేదు. విడాకులు తీస్కొమ్మన్నారు సన్నిహితులు. కానీ మనిషిగా ఆలోచించా. నా బాధంతా తన, తనవాళ్ల గురించే. మామయ్య అత్తమ్మని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. బామ్మర్ది చిన్నప్పుడే చదువాపేసి టీకొట్టు పెట్టుకొని డబ్బులు కూడబెట్టి అక్క పెళ్లి చేశాడు. దూరపు బంధువని మా బావ వాళ్ల బావ కూడా ఆర్థికసాయం చేశాడు. ఇప్పుడు మేం విడిపోతే వాళ్లందరి పరిస్థితేంటి? ఇవేం ఆలోచించదే! దీనంతటికీ కారణం వాళ్ల మేనత్తే. మా పెళ్లపుడు పసుపుకుంకుమల కింద ఇస్తానన్న భూమి ఇవ్వలేదని కక్ష కట్టి అలా చేయిస్తోందట. ఆమె చెప్పుడు మాటలలతో నా భార్య ఆడించినట్టల్లా ఆడుతోంది. ఈ మనసులో మాట చదివాకైనా తను మారుతుందనీ, నా చెంతకొస్తుందని ఆశిస్తున్నా.
© Shekharmine

వెంటపడి పెళ్లాడా... జీవితాన్ని గెలిపించింది!

అందం మేనిరంగులో ఉండదు. అర్ధం చేసుకునే మనసులో ఉంటుంది. అలాంటి అమ్మాయి దొరికితే జీవితంలో అన్నీ విజయాలే అంటున్న యువకుడి అనుభవం. మొదటి పెళ్లిచూపులు...


అమ్మాయి బాగుంటుందా? తననేం అడగాలి? మనసులో అలజడి. ఘల్లుఘల్లుమన్న పట్టీల చప్పుడు నా ఆలోచనలకు బ్రేక్ వేసింది. పట్టు పరికిణీ, పొడవాటి జడ, జడలో తురుముకున్న కనకాంబరాలు... తెలుగుతనం పోతపోసినట్టు ఉన్న తను నా ముందుకొచ్చింది. నన్ను చూసి చిన్నగా నవ్వింది. బుగ్గల్లో సొట్టపడి ఆ అందం రెట్టింపైంది. వివరాలు ఇచ్చిపుచ్చుకున్నాం. 'అన్నీ కుదిరాయి. ముహుర్తం పెట్టుకోవచ్చు' అంది పిన్ని. మధ్యవర్తి. నాకూ నచ్చింది. మాతో వచ్చిన వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి అభిప్రాయం చెప్పమన్నా. 'అమ్మాయి నల్లగా ఉందిరా. నీకు సరిపోదు' తేల్చేశాడు. అమ్మానాన్నలదీ అదేమాట. 'ఏ విషయమైనా ఫోన్ చేసి చెబుతాం' అంటూ బయల్దేరాం. 'నీది మంచి ఉద్యోగం. అందగాడివి. అమ్మాయేమో నల్లగా ఉంది. పైగా ఆస్తిపరులు కాదు' అంటూ నా నోరు నొక్కేశారు ముగ్గురూ. మావాళ్లన్నట్టు తను మరీ నలుపేం కాదన్నా వినరే!
పెళ్లిచూపుల పేరుతో ఏ అమ్మాయినీ బాధ పెట్టొద్దు అన్నది నా పాలసీ. ఫొటో పంపమంటే అమ్మాయి బాగుందని లాక్కెళ్లింది పిన్ని. చివరికిలా జరిగింది. బాగా ఆలోచించాక తనని కలిసి సారీ చెప్పాలనుకున్నా. నేరుగా వాళ్లాఫీసుకెళ్లా. గేటు బయటే ఆపేశాడు సెక్యూరిటీ. మీరెవరు? ఎందుకొచ్చారు? ఏం మాట్లాడతారు? ప్రశ్నలు సంధించాడు. బాధ పడ్లేక అసలు విషయం చెప్పా. ఆపై అతడు చెప్పిన మాటలతో నా మతి పోయింది. స్వాతి చాలామంచి అమ్మాయనీ, ముగ్గురి పని ఒక్కతే చేస్తుందనీ, తనంటే అందరికీ అభిమానమనీ చెప్పాడు. ఆఖర్లో తను సెలవులో ఉందని, ఆమెని చేస్కోకపోవడం నా దురదృష్టమని జాలి పడ్డాడు. ఒక్కసారి మాట్లాడమని చెప్పమని నెంబర్ ఇచ్చి వచ్చా.

మూడ్రోజుల ఎదురుచూపులు ఫలించాయి. 'పెళ్లిచూపుల్లో నచ్చని అమ్మాయితో మళ్లీ మాట్లాడాలనుకోవడం పద్ధతి కాదు. దయచేసి ఇంకోసారలా చేయొద్దు' కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెట్టేసింది స్వాతి. ఆ మాటతో తను మరింత నచ్చేసింది. సరాసరి వాళ్లింటికెళ్లిపోయా. 'మీరెన్ని షరతులు పెట్టినా సరే. మీ అమ్మాయినే చేస్కుంటా' అన్నా వాళ్ల నాన్నతో. మొదట్లో కుదరదన్నారు నాన్నాకూతుళ్లు. పిన్ని రాయబారంతో కరిగారు. పెళ్లి ఘనంగా జరిగింది. ఆపై తను నాకు దక్కడం ఎంత లక్కీనో అర్ధమైంది. మూణ్నెళ్లలో అమ్మానాన్న, అక్క అందరి నోట్లో స్వాతినే. అంత కలుపుగోలుగా ఉండేది. ఎంత పనైనా నవ్వుతూ చేసేది.

హాయిగా సాగిపోతున్న సంసారంలో కష్టాల పిడుగు. పరిస్థితేం బాగోలేదని పింక్‌స్లిప్ చేతిలో పెట్టింది కంపెనీ. అప్పటికే స్వాతి ఉద్యోగం మానేసింది. ఖర్చులకు గడవనంత పరిస్థితేం లేదుగానీ భవిష్యత్తుపై బెంగ మొదలైంది. అదిగో అప్పుడే నా స్వాతి అర్ధాంగికి అర్ధం చెప్పింది. 'మనం దుస్తుల వ్యాపారం చేద్దాం' అంది. ఏసీ గదులు.. కంప్యూటర్‌కి పరిమితమైనవాడ్ని వ్యాపారంలోకి దిగడమంటే మాటలా? నావల్ల కాదన్నా. తనే ధైర్యం చెప్పింది. వాళ్ల మామయ్య సహకారం కోరింది. తమ్ముడ్ని ఇంట్లో ఉండి చదువుకుంటూ సాయపడమంది. మూడున్నర లక్షలతో షాపు తెరిచాం. తన మంచితనం, మాటకారితనంతో గిరాకీ ఊపందుకుంది.

ఎనిమిదేళ్లు గడిచాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆపై మేం పట్టిందల్లా బంగారమైంది. ఊహించనంత సాధించాం. గతంలో నా జీతానికంటే నాలుగైదు రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నా. ఏడుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇదంతా నా బెటర్‌హాఫ్ చలవే. ఆరోజు తన వెంటపడి నా అదృష్టాన్ని దక్కించుకున్న ఫలితమే.
© Shekharmine

ఎంతపని చేశావ్ ప్రేమా?

అమ్మానాన్నలున్నారు. మొహం చూపించలేడు! పెళ్లాం పిల్లలున్నా తనవారు కాదు! ఎందుకిలా? అంటే 'ప్రేమే'నన్నది సమాధానం. ఏం జరిగిందో అతడి మాటల్లోనే.

యూనివర్సిటీ బస్టాపు. సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలతో కళకళలాడుతోంది. ఇంతలో బూడిద రంగు పంజాబీ డ్రెస్, తెల్ల చున్నీ వేసుకున్న ఓ ఏంజెల్ నాముందు నుంచి నడిచెళ్లింది. 'మన క్లాసే మామా. వూరు ఖమ్మం' వివరాలందించి నన్నీలోకంలోకి లాగాడు ఫ్రెండ్. పట్టుబట్టి పరిచయం చేసుకున్నా. మూణ్నెళ్లలో బాగా దగ్గరయ్యాం.

దసరా సెలవులిచ్చారు. పదిరోజులు నరకం కనపడింది. రాగానే మనసు విప్పా. నువ్వులేక నేను లేనన్నా. వారం వూరించి పచ్చజెండా వూపింది. ఓరోజు మీ పేరెంట్స్‌ని తీసుకొచ్చి మాట్లాడమంది. అమ్మానాన్నలు వద్దంటున్నా ఆతృతగా బయల్దేరా. అక్కడ దారుణ అవమానం. కనీసం ఇంట్లోకి కూడా పిలవలేదు. బయటే నిల్చోబెట్టి మాట్లాడి 'విషయం తర్వాత చెబుతాం' అన్నారు. భారంగా తిరిగొచ్చా. పన్నెండురోజుల్లో నా బ్యాంకు పరీక్ష. అదే జీవితం అనుకొని ప్రిపేరవుతున్నా. ఇంతలో తన లేఖ. 'మావాళ్ల హింస తట్టుకోలేకపోతున్నా. చచ్చిపోవాలనుంది. వెంటనే వచ్చెయ్'మని సారాంశం. ఫ్రెండ్స్‌ని వెంటబెట్టుకొని కారులో బయల్దేరా. పోలీసులతో బెదిరించారు. తిరిగొచ్చాం. ఖర్చు మోపడైంది. పరీక్ష పోయింది. దేవదాసునయ్యా. ఇక తను దక్కదనుకున్నా.

'గ్రూప్‌వన్ మెయిన్‌కి ఎంపికయ్యా. వైజాగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా' సడెన్‌గా ఓరోజు తన ఫోన్. రెక్కలు కట్టుకొని వాలిపోయా. రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవాళ్లం. మళ్లీ ఏమైందో! ఒక్కసారిగా మాట్లాడ్డం మానేసింది. 'నువ్వెవరో అమ్మాయ్‌తో తిరుగుతున్నావట. నా ఫ్రెండ్ చెప్పింది' అదీ సాకు. ఎంత చెప్పినా వినదే. ఉండేచోటు, నెంబర్ మార్చేసింది. పిచ్చివాణ్నైపోయా. ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో మళ్లీ ప్రత్యక్షమైంది. 'మీకు ఎవరూ దొరకలేదా? నా బోయ్‌ఫ్రెండే కావాలా?' అని నా స్నేహితురాళ్లు అందర్నీ తిట్టింది. నామీద ప్రేమనుకుకొని నవ్వుకున్నా.
ఖమ్మంలో టీచరుద్యోగం వచ్చింది తనకి. నన్ను వదిలి వెళ్లనంది. బుజ్జగించా. తర్వాత పెద్దల్ని కాదని చర్చిలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాం. నెలకు రెండుసార్లు వెళ్లొచ్చేవాడిని. మా ప్రేమకు ప్రతిరూపంగా ఏడాది తిరక్కముందే పాప. ఇక అక్కణ్నుంచి తనలోని రాక్షసత్వం విజృంభించింది. రోజూ గొడవ. నాకు వేరే సంబంధాలున్నాయనేది. ఓపిక పడితే 'తప్పు చేస్తున్నావ్ గనకే నోరు తెరవట్లేదు' అనేది. కోపంతో చేయి చేసుకునేవాడిని. నా బ్యాగ్ బయట విసిరేసేది. హాస్టల్‌కొచ్చేవాణ్ని. పాపని, తనని చూడాలని ప్రాణం కొట్టుకునేది. వెళ్తే మళ్లీ అదే తంతు. మూడేళ్లు గడిచాయి.

మా గొడవలతో తన అమ్మానాన్నలకి దగ్గరైంది. వాళ్లు మరింత రెచ్చగొట్టేవాళ్లు. ఈలోపు బాబు పుట్టాడు. నేను చేస్తున్న ప్రైవేటుద్యోగం మానేసి పీహెచ్‌డీలో చేరి ఫెలోషిప్‌కి ఎంపికయ్యా. బాబును చూసుకుంటూనే రీసెర్చ్ చేసుకుందామనుకున్నా. రోజూ సాధించేది. రీసెర్చ్ పనిమీద సిటీకెళ్తే 'లవర్‌ని కలవడానికా?' అనేది. ఎప్పటికైనా మారుతుందిలే అని ఓపిక పట్టా. కానీ తను మారలేదు సరికదా ఓ భార్య గురించి భర్త వినకూడని మాట నా చెవి న పడింది. నిట్టనిలువునా కుప్పకూలిపోయా.

గొడవలు ముదిరాయి. వరకట్న వేధింపు కేసు పెట్టింది నాపై. తన బాగోతం పోలీసుల ముందుంచా. నన్నొదిలేశారు. ఇంటికి తాళమేసి పేరెంట్స్ దగ్గరికెళ్లింది. ఒంటిరినయ్యా. వూరెళ్లి ముసలి తల్లిదండ్రులకు మొహం చూపించలేను. ప్రేమ మోజులో ఆరోజు వాళ్ల మాట విన్లేదు. పెళ్లీడుకొచ్చిన చెల్లెళ్లతో ఛీకొట్టించుకోలేను. ఇంతకుముందు నాకో కుటుంబం, పిల్లలు ఉన్నారనే తృప్తి ఉండేది. ఇప్పుడదీ లేదు. నా నేపథ్యం, బాధ్యతలు అన్నీ మర్చిపోయి ప్రేమ మైకంలో మునిగిపోయినందుకు నాకు దక్కిన ఫలితం ఇది.
© Shekharmine

Thursday, 8 October 2015

చేశాను నేరం... మన్నించు నేస్తం!

వేసిన అడుగు.. జారిన మాట.. చేసిన తప్పు.. వెనక్కి తీసుకోలేం. ఒక్కోసారి వాటి ఫలితాలు దారుణంగా ఉంటాయ్. అలా చేసిన పొరపాటుకు మిత్రుడి జీవితం నాశనం అయ్యిందంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడో యువకుడు.


డిగ్రీ ఆఖరి పరీక్షలు. హిస్టరీ పేపర్. చరిత్రంటే ఆసక్తేగానీ రాజవంశాలు, చారిత్రక సంఘటనలు గుర్తుండేవి కావు. ఆ కొరుకుడు పడని సంఘటనల్ని కాగితంపై పెట్టి హాల్లోకి వెళ్లా. కాపీ కొట్టడం తప్పని మనసు గోల పెడుతున్నా తప్పింది కాదు. 'ముందే చెబుతున్నా. నకలు కొట్టడం, పక్కవాడి దాంట్లో చూసి రాయడం కుదరదు. ఏవైనా చిట్టీలుంటే బయట పడేసి రండి' ఆఖరి అవకాశం ఇచ్చారు రాములు సర్. నలుగురైదుగురు ఆయన చెప్పినట్టే విన్నారు. కాసేపు వూగిసలాడి మిన్నకుండిపోయా నేను.
పరీక్ష మొదలై అరగంటైంది. మంచినీళ్లు తాగడానికి బయటికెళ్లారు మాస్టారు. చొక్కా పట్టీలో మడిచిన కాగితం తీసి రాయడం మొదలెట్టా. కొద్దిసేపటికే వెనక నుంచి నన్ను సమీపిస్తున్న అడుగుల చప్పుడు. కాగితం దాచే సమయం లేదు. కింద పడేసి ఏమీ ఎరగనట్టే జవాబుపత్రంలో తలదూర్చా. సరాసరి నా దగ్గరికొచ్చారు సర్. 'కిందపడ్డ చిట్టీ తీసి ఇది నీ పనేనా?' అన్నారు. గుండె వేగం రెట్టింపైంది. పెదాలు తడారిపోయాయి. 'నాకేం తెలియదు సర్. ముందున్న శ్రీనుదేమో' వెనకాముందు ఆలోచించకుండా అబద్ధమాడేశా. నా మాటతో వాడు చివాల్న లేశాడు. తనకసలే కోపమెక్కువ. 'ఏంట్రా పిచ్చిపిచ్చిగా ఉందా? నా పేరెందుకు లాగుతున్నావ్్?' అంటూ మీదికొచ్చాడు. ఏదైతే అదైందని 'వీడు జేబులోంచి తీయడం చూశా'నన్నా. దాదాపు నన్ను కొట్టినంత పన్జేశాడు. ఇద్దర్ని విడదీసి చేతిరాత పోల్చి చూశారు సర్. ముందే ఈ సీన్ వూహించి మా పక్కింటి కుర్రాడితో రాయించడంతో బతికిపోయా. అయితే శ్రీను రాతకి కొంచెం దగ్గరగా ఉండటంతో వాడిదేనని తేల్చేశారు సర్. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పమన్నారు. చేయని తప్పునకు నేనెందుకు సారీ చెప్పాలంటూ వాదించాడు. అప్పుడే స్క్వాడ్ రావడం.. ఆయనతోనూ వాడు వాదించడంతో పేపరు లాక్కొని 'వన్ ఇయర్ డిబార్' అని రాశారు. తేలు కుట్టిన దొంగలా నేను గప్‌చుప్.

నా తప్పు వాడి జీవితాన్ని ముంచేస్తుందని వూహించలేకపోయా. ఉన్న అరెకరానికి మరో ఎకరం కౌలుకు తీసుకొని వ్యవసాయంలోకి దిగాడు శ్రీను. అది కలిసి రాక అప్పులు రెట్టింపయ్యాయి. అవి తీర్చడానికి హమాలీగా మారాడు. మళ్లీ పుస్తకం పట్టలేని పరిస్థితి. ఇది తెలుసుకొని వాడి దగ్గరికెళ్లి క్షమించమని చేతులు పట్టుకున్నా. ముందు నాపై చాలా కోపంగా ఉండేవాడు. ఆపై 'నా తలరాత ఇలా ఉంటే నువ్వేం చేస్తావులే' అనేవాడు.

మరోవైపు నేను డిగ్రీ పాసై బీఈడీలో చేరా. అది పూర్తికాగానే లక్కీగా వేల ఖాళీలతో డీఎస్సీ విడుదలైంది. బాగా కష్టపడటంతో కొలువు దక్కింది. ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నా. ప్రస్తుతం నలభైవేల జీతం, సమాజంలో గౌరవం నా సొంతం. శ్రీను మాత్రం హమాలిగానే కొనసాగుతున్నాడు. దానిక్కారణం నేనే. అది గుర్తొచ్చినప్పుడల్లా అపరాధభావం వెంటాడుతోంది. ఆరోజు నేను వెంటనే తప్పు ఒప్పుకొని ఉంటే విషయం ఇంతదాకా వచ్చేదే కాదు. పైగా మొదట్నుంచీ వాడిదీ టీచర్ కావాలనే కోరికే. నాకన్నా బాగా చదివేవాడు. క్లాసులో మొదటి పదిమందిలో ఉండేవాడు. ఆరోజలా జరిగి ఉండకపోతే కచ్చితంగా లక్ష్యం అందుకునేవాడే.
మనం చేసేది తప్పా? ఒప్పా? అని మనకు కచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అది ఇతరుల జీవితాలతో ముడిపడిందైతే చిన్న పొరపాటుకు కూడా తావీయొద్దు. లేదంటే.. మనం ఎంత ఎదిగినా మానసిక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది.
Like Our Facebook Fan Page: NaaLoveStory

© Shekharmine

ప్రేమించిన మనసును... ముక్కలు చేశాడు!

ఏడేళ్లక్రితం పరిచయమయ్యాడు శంకర్. మా ఇంటి పక్కనుండే వాళ్లక్క ఇంటికొచ్చినపుడు. ఇద్దరిదీ కౌమారం. కానీ తన ఆలోచనల్లో ఎంతో పరిణితి. చదువు, కెరీర్, సమాజం.. ప్రతిదానిపై ఎంతో అవగాహన ఉండేది. ఆ తీరే నన్ను అతడి ప్రేమలో పడేసింది. అలాగని అదేపనిగా పార్కులో కలుసుకోవడాలు, ముద్దూముచ్చట్లు, గంటలకొద్దీ ఫోన్ కబుర్లేం లేవు మామధ్య. నేను హాస్టళ్లో ఉంటూ చదువుకునేదాన్ని. అడుగు బయటపెడితే చాలామంది కుర్రాళ్ల చూపులు నన్ను తాకేవి. నా ఎదురుచూపులు మాత్రం శంకర్ కోసమే.

ఇంటర్ ఆఖర్లో మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. మావాళ్లకి శంకర్ కులం నచ్చలేదు. 'కాలు బయట పెడితే విరగ్గొడతాం' అన్నారు. 'వాడితో మాట్లాడితే చంపేస్తాం' అని బెదిరించారు. తనకి నేనేంటే ఎంత ప్రేమో, తనెంత యోగ్యుడో చెప్పినా వినరే! ఆఖరి మాటగా 'చావైనా బతుకైనా శంకర్‌తోనే. వేరేవాడ్ని చేసుకోను' తేల్చేశా. కన్నవాళ్లు నాకన్నా మొండి. ఇంట్లోనే బందీ చేశారు. బలవంతంగా పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ఎలాగోలా తనకి సమాచారం అందించా. ఊరి సెంటర్‌కి రమ్మన్నా.

వెనకద్వారం నుంచి జారుకుంటుంటే 'ఎక్కడికెళ్తున్నావ్?' అని తమ్ముడి హుంకరింపు. కాసేపు నీళ్లు నమిలాక 'పెళ్లి చూపులకొస్తున్న అబ్బాయి నన్ను సెంటర్లో కలుస్తానన్నాడు' అని నోటికొచ్చిన అబద్ధం చెప్పా. 'అలాగా? అయితే మాట్లాడు' అంటూ తనకి ఫోన్ కలిపి ఇచ్చాడు. మరింత ఇరుక్కుపోయా. ఇప్పుడేం చేయాలి? గుండె వేగం రెట్టింపైంది. అవతల తను ఫోన్ లిఫ్ట్ చేయగానే 'నాతో పర్సనల్‌గా మాట్లాడతా అన్నారుగా. త్వరగా రండి' అని పెట్టేశా. పదినిమిషాల్లో నాముందు ఉన్నాడు తను.
ఒక్క అబద్ధం దాచడానికి ఇంకెన్ని అబద్ధాలాడాలి? చివరికో నిర్ణయానికొచ్చా. మా ప్రేమ విషయం చెప్పి అతడ్ని సాయం అడగాలనుకున్నా. ఎవరూ లేనిచోటికి తీసుకెళ్లాలని అతడి బైక్ ఎక్కా. అదే నా కొంప ముంచింది. మేం కలిసి వెళ్లడం శంకర్ చూశాడు. అప్పుడైనా నేను బండి దిగి విషయం చెప్పాల్సింది. అర్థం చేసుకుంటాడనే అతి నమ్మకంతో అలాగే వెళ్లా. ఊరి బయటికెళ్లాక అతడికి మా ప్రేమ సంగతి చెప్పా. మమ్మల్ని అర్థం చేసుకొని మీ అమ్మాయి నాకు నచ్చలేదంటూ అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాడు. గాల్లో తేలిపోతూ ఇంటివైపు అడుగులేశా.

నావల్లే పెళ్లిచూపులు చెడిపోయాయని అమ్మ పసిగట్టేసింది. శంకర్‌ని కలవొద్దని నన్ను బంధువులింటికి పంపేసింది. అక్కడా నన్ను గడప దాటనీయలేదు. అతికష్టమ్మీద ఓ వ్యక్తి సాయంతో శంకర్‌కి ఫోన్ చేశా. కలుద్దాం రమ్మన్నాడు. నీకు నేనున్నా అన్నాడు. బంధువుల కళ్లుగప్పి కొండంత ఆశతో వెళ్తే ముఖం చాటేశాడు. ఏడుస్తూ ఫోన్ చేశా. 'ఇష్టం ఉంటేనే కదా అతడి బైక్ ఎక్కావ్? అప్పుడే నిన్ను నా మనసులోంచి తొలగించా' అని నిర్దయగా మాట్లాడాడు. మనసుని రంపంలా కోసేసిందా మాట. గొప్పవాడు అనుకున్న తను ఇంత సంకుచితంగా ఆలోచిస్తాడనుకోలేదు. ఇంటికి తిరిగెళ్లా. కొన్నాళ్లకు అమ్మ మాటకే తలొగ్గా. మనసు చంపుకొని వేరే వ్యక్తితో తాళి కట్టించుకున్నా. నేను నిస్వార్ధమైన ప్రేమనిస్తే తను ఒక్క సంఘటన సాకుగా చూపి నన్ను కాదనుకున్నాడు. చివరగా.. గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన గొప్ప ప్రేమికుడు అనిపించుకోడు. నమ్మినవాళ్లకి అన్ని సమయాల్లో అండగా ఉన్నవాడే అమ్మాయి మనసు గెల్చుకోగలడు.
© Shekharmine