Sunday, 29 May 2016

కూతురి మనసు తెలుసుకోవేం నాన్నా!


కూతురు చిటికెనవేలు పట్టుకొని బుడిబుడి అడుగులు వేయిస్తూ మురిసిపోయేది నాన్న. గారాబం చేస్తూనే బాధ్యతలు నెరవేర్చేది నాన్న. కానీ మా నాన్నకి నాన్న లక్షణాలే లేవు.
కన్నతండ్రి గురించి ఓ అమ్మాయి ఇలా చెప్పడం తప్పే. కానీ నాకు తప్పడం లేదు. ఇంట్లో అమ్మానాన్నలకు రోజూ గొడవలే. అమ్మ ఏడుస్తూ తరచూ అమ్మమ్మ వాళ్లింటికెళ్లిపోయేది. మొదట్లో నాకేం తెలిసేది కాదు. తర్వాత నాన్నకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని అర్థమైంది. ఆ విషయం తెలిశాక ఆయనపై ఉన్న కాస్త గౌరవం పోయింది.
నేను చదువులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే. అంతా మెచ్చుకునేవారు. నాన్న తప్ప. పైగా ‘బాగా చదివి ఎవర్ని ఉద్ధరిస్తావటా?’ వెటకారమాడేవారు. ఏడుపొచ్చేది. టెన్త్‌లో మండలం ఫస్ట్‌ వచ్చా. అప్పుడు మాత్రం చాలా సంతోషించారు. ‘నీ కూతురు చదువయ్యేదాకా సర్కారే చదివిస్తుందిక’ ఎవరో చెప్పారట నాన్నతో. అందుకే ఈ ప్రేమ.
ట్రిపుల్‌ఐటీలో ఉచితంగా సీటొచ్చింది. ఏడాది గడిచిందో లేదో ‘మా చెల్లి కొడుకుని పెళ్లి చేస్కో. చదువు సంగతి తర్వాత చూద్దాం’ బలవంతపెట్టారు నాన్న. నాకిప్పుడే పెళ్లి వద్దని ఏడ్చినా వినరే! ఇంటికెళ్లడమే మానేశా. నాపై కోపాన్ని అమ్మపై చూపేవారు. నానా చిత్రహింసలు పెట్టేవాడు. ‘మా గురించి పట్టించుకోకు. నువ్వు చదువుపై దృష్టి పెట్టి పెద్ద ఉద్యోగం సంపాదించాలి’ ప్రోత్సహించేది అమ్మ.
బీటెక్‌ పూర్తైంది. ఇంటికెళ్లడం ఇష్టంలేదు. ఉద్యోగం వెతుక్కునే సాకుతో సిటీకొచ్చాను. అక్కడే పరిచయమయ్యాడు శ్రీధర్‌. మొదట్లో మగాళ్లంతా మా నాన్నలాగే ఉంటారనుకున్నా. శ్రీధర్‌ని చూశాక ఆ అభిప్రాయం మారింది. తను అమ్మాయిలతో ప్రవర్తించే తీరు, చూపించే ఆప్యాయత నన్ను కట్టిపడేసేవి. పైగా అతడిది మా సామాజికవర్గమే అని తెలిశాక అభిమానం స్థానంలో ప్రేమ మొదలైంది. నాలుగైదుసార్లు వాళ్లింటికెళ్లా. శ్రీధర్‌ అమ్మానాన్నలూ నాపై విపరీతమైన అభిమానం చూపించేవారు. శ్రీధర్‌ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిశాక సొంత కోడలిలాగే చూడ్డం మొదలుపెట్టారు. శ్రీధర్‌ కుటుంబం మా కుటుంబానికి పూర్తి వ్యతిరేకం. వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లులా ఉండేది. కొన్నాళ్లకు తన గైడెన్స్‌తోనే నాకు ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
సెలవులకు వూరెళ్లా. నాన్న పాతపాటే పాడారు. మేనత్త కొడుకుని పెళ్లాడమని. ఇంకా నాన్చడం నాకిష్టం లేదు. శ్రీధర్‌తో ప్రేమ విషయం చెప్పా. అతడ్నే పెళ్లాడతానన్నా. ప్రేమ పేరెత్తగానే ఇంతెత్తున లేచారు. కన్నకూతురని చూడకుండా అనరాని మాటలన్నారు. మాటలు పడ్డాను. నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. మౌనవ్రతం చేశా. ప్రేమగా అడిగా. కన్నీరు పెట్టుకున్నా. ఆయనది పాషాణ హృదయం కదా. కరగలేదు. అన్ని మార్గాలూ మూసుకుపోయాక ఆఖరి అస్త్రం ప్రయోగించా. ‘నేను మేజర్‌ని. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతా’ అని బెదిరించా. పరువు గుర్తొచ్చిందేమో! ఇక చేసేదేం లేక చివరికి అయిష్టంగానే ఒప్పుకున్నారు.
మాకు పెళ్లి చేయడం నాన్నకు ఇప్పటికీ ఇష్టం లేదు. అయినా త్వరలోనే శ్రీధర్‌తోనే నా జీవితం ముడిపడబోతోంది. కన్నతండ్రిని విలన్‌ని చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రాలేదు. బాధ్యత మర్చిపోయిన తండ్రులు కనీసం కూతుళ్ల మనసునైనా అర్థం చేసుకోవాలని విన్నవిస్తున్నా.

Like Our Page: https://www.facebook.com/NaaLoveStory/

ప్రేమలో ఓడా... జీవితాన్ని గెలుస్తా!


మూడు సినిమాలు... ఆరు పార్టీలతో జాలీగా గడిపే కుర్రాడు. ఓ అమ్మాయి రాక అతడి జీవితంలో పెనుతుపాను రేపింది. ఇంతకీ ఏమైంది?
ఆఫీసులో ఉండగా జీటాక్‌లో ‘హాయ్‌’ అనే పలకరింపు. అవతలివైపు అమ్మాయి. నా వేళ్లలో కరెంట్‌. చకచకా వ్యక్తిగత వివరాల్లోకి దిగా. ‘ఎంటెక్‌ చేస్తూనే ఉద్యోగం చేస్తున్నా’ బదులిచ్చింది. నేనూ వివరాలిచ్చా. తర్వాత ఎప్పుడోగానీ మామధ్య మాటలు కలవకపోయేవి. నా ఉద్యోగం అలాంటిది మరి. నిమిషం ఖాళీ దొరికినా తనకే కేటాయించేవాణ్ని. ఎలాగో వీలు చేసుకొని కొన్నాళ్లకి తననో మాల్‌లో కలిశా. ఆకర్షణో, అభిప్రాయాలు కలవడమో... ఒకరికొకరం తెగ నచ్చేశాం. ప్రేమ గోదాలో దిగిపోయాం. ఓ మొగుడితో మాత్రమే చెప్పుకునే విషయాలు నాతో పంచుకునేది. బ్యాంకు ఖాతా సహా ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌లన్నీ ఇచ్చింది. ప్రేమికుల మధ్య ఏ దాపరికాలూ ఉండద్దనేది తన ఫిలాసఫీ. ఇంకేం... పూర్తిగా పడిపోయా.
నాకు వేరే కంపెనీలో ఆఫర్‌ వచ్చింది. బెంగళూరులో శిక్షణ. వెళ్లేముందు కలిశా. మూడు గంటలు మనసారా మాట్లాడుకున్నాం. బై చెబుతుంటే చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చింది. నాకూ కన్నీళ్లాగలేదు. జీవితంలో తన చేయి వదలొద్దనుకున్నా.
శిక్షణ బాగానే సాగుతోంది. మరోవైపు మా ప్రేమ కూడా. ఫోన్‌, చాటింగ్‌, వీడియో కాలింగ్‌... ఓ నెలదాకా ఏదోరకంగా టచ్‌లో ఉండేవాళ్లం. తర్వాతే మొదలైంది తనలో వూహించని మార్పు. అకస్మాత్తుగా నన్ను దూరం పెట్టసాగింది. పరీక్షల ఒత్తిడి... ఫోన్‌ ప్రాబ్లెమ్‌... ఇంట్లో ఇబ్బందులు... ఏదోరకంగా సర్దిచెప్పుకునేవాణ్ని. ఎన్నిరోజులు గడిచినా దేనికీ సమాధానం దొరకదే! పిచ్చెక్కిపోయేది. పాస్‌వర్డ్‌లు గుర్తున్నాయి. ఆఖరిప్రయత్నంగా తన ఖాతాలు తెరిచా. నెలరోజులుగా వాడిన దాఖలాల్లేవు. నాలో భయం మొదలైంది.

నేనీ టెన్షన్‌లో ఉండగా నాకో మెయిల్‌ వచ్చింది. ‘హాయ్‌ భయ్యా... ఆ అమ్మాయి క్యారెక్టర్‌ ఎలాంటిది? తనకు, నీకు ఏంటి సంబంధం?’ అనేది సారాంశం. ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరో తెలియక గాబరాగా ఫోన్‌ కలిపా. ‘మేమిద్దరం క్లాస్‌మేట్స్‌. ప్రపోజ్‌ చేశా. ఒప్పుకుంది. ఫిబ్రవరి 14న లంచ్‌ కూడా చేశాం’ సూటిగా విషయం చెప్పాడు. గుండెలు భగ్గుమన్నాయి. కళ్లలో నీళ్ల సుడులు తిరిగాయి. అప్పుడు తనకి దూరం అవుతున్నానని ఏడ్చా. ఇప్పుడు తను నన్ను దూరం పెడుతోందని ఏడ్చా. ఏ కష్టాలూ తెలియని ఓ కుర్రాడ్ని ఏడిపించే శక్తి ఒక్క అమ్మాయికే ఉందని అర్థమైంది.
నేనందరిలాంటోడ్ని కాదు. ప్రేమ త్యాగం చేసి సైడైపోవడానికి... బాధ మింగలేక ఏ విషమో మింగడానికి. అంతు తేల్చుకోవడానికి తన ముందుకెళ్లా. వాడు చెప్పింది నిజమేనా అని నిలదీశా. ‘హా’ అంది ఏమీ ఎరగనట్టే. బూతులు తిట్టా. ‘హే... నేనెపుడో నీకు బ్రేకప్‌ చెప్పేశాగా’ అంది. నీకివ్వాల్సిన వంద ఎప్పుడో ఇచ్చేశాగా అన్నంత సింపుల్‌గా. ఏడ్వలేక నవ్వా. పరిచయం పెంచుకుంది. ప్రపోజ్‌ చేసింది. అడక్కముందే అన్నీ చెప్పింది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టే బ్రేకప్‌ అంటోంది. అదీ అసలు మా మధ్య ఏ గొడవా లేకుండానే. ఒకమ్మాయిలో ఇన్ని కోణాలా?

బాధ పడ్డా. కానీ దేవదాసు కాలేదు. తనపై పీకల్దాకా కోపమొచ్చింది. కానీ యాసిడ్‌ దాడి చేయలేదు. నా దృష్టిలో జీవితం అంటే ఓ ప్రయోగశాల. చేసే ప్రతి ఎక్స్‌పరిమెంట్‌ సఫలం కాదు. నా ప్రేమ విషయంలోనూ అలాగే జరిగింది. తప్పు ప్రేమ ఫార్ములాది కాదు. చేసే విషయంలోనే తేడా జరిగింది. ఈ ఓటమి నాకు చాలా నేర్పింది. ఆఖరికి నేనో రాంగ్‌ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నానని తేలింది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయను. ప్రేమలో, జీవితంలో... ముందుగా కెరీర్‌లో తప్పకుండా విజయం సాధిస్తా.
Like Our Page: https://www.facebook.com/NaaLoveStory/

Tuesday, 10 May 2016

ప్రపోజ్‌ చేస్తే...పాపను చూపించింది!


దువు లేకున్నా సర్దుకుపోతా... ఆస్తి లేకున్నా అడ్జస్టవుతా... అమ్మాయి మాత్రం అప్సరసలా ఉండాలి. ఇదీ కాబోయే భార్య విషయంలో నా పంతం. ఆ కలల రాణికోసం ఇంటర్‌ నుంచి ఎంటెక్‌ దాకా ఎంతోమంది అమ్మాయిల వెంటపడ్డా. ఛీత్కరింపులు, చిరుగొడవలు, కొన్ని ప్రేమ వరకూ వెళ్లి ఆనక బ్రేకప్‌లు... అన్నీ జరిగాయి. చిటికెనవేలు అందుకునే చిన్నది మాత్రం దొరకలా!
సీన్‌ కట్‌ చేస్తే నేనిప్పుడో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీసులో కనీసం పదిమంది అందగత్తెలైనా ఉంటారు. వాళ్లు అటూఇటూ తిరుగుతుంటే క్యాట్‌వాక్‌ చేస్తున్న మోడళ్లే కనిపించేవారు. అందులో ఎవర్ని ఎంచుకోవాలో తెలీక నేను సతమతమవుతుంటే నా మగ కొలీగ్స్‌ మాత్రం శిరీష పేరు తెగ పలవరించేవారు. ఎవరీ శిరీష అంటే నాకన్నా కొంచెం సీనియర్‌. మరీ అందగత్తేం కాదు. మరి ఎందుకింత ఫాలోయింగ్‌ అని ఆరా తీస్తే చాలా విషయాలే తెలిశాయి. తను కొలీగ్స్‌కి పనిలో సాయం చేస్తుంది. అవసరాల్లో ఉన్నవాళ్లకి డబ్బులిస్తుంది. అన్నింటికీ మించి అందరితో ఇట్టే కలిసిపోతుంది. అందుకే బోయ్‌ నుంచి బాస్‌ దాకా అందరికీ తనంటే ఇష్టం.
కొద్దిరోజుల్లోనే నేనూ శిరీష మంచితనానికి ఫిదా అయ్యా. నా అదృష్టమో మరేంటో, ఆఫీసులో అందరి సీట్లు మార్చడంతో నేను తన పక్కనే చేరా. ఇంకేం... పక్కనే జోష్‌ మిషన్‌. తనతో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదు. రాన్రాను నేనెంతగా మారిపోయానంటే ఆర్నెళ్లలోనే తనే నా డ్రీమ్‌గాళ్‌ అనుకునేంత.

నాది లవ్వే. మరి తనదేంటి? ఆ మాటే అడిగి పెళ్లాడతానన్నా. ‘ప్రపోజల్‌ నెంబర్‌ ఎయిట్‌’ అంది. హో... పోటీ తీవ్రంగానే ఉందని అర్థమైంది. అయినా సిన్సియర్‌గా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇంకో ఆర్నెళ్లు గడిచాయి. ఓరోజు తన ఫోన్‌. ‘రేపు సాయంత్రం మనం ఫలానా రెస్టరెంట్‌లో కలుద్దాం’ అని. ‘యాహూ’ ఉన్న చోటే గెంతేశా. చక్కగా ముస్తాబై తను చెప్పినచోటికి పల్సర్‌ బైక్‌పై వెళ్లా. ఐదు నిమిషాలయ్యాక వచ్చింది. ఓ పాపతో సహా. నా క్వశ్చన్‌మార్క్‌ మొహం చూసి తనే నోరు విప్పింది. ‘ఈ పాప నా కూతురు. నువ్వు నాకు భర్తవి కావాలంటే ముందు తనకి తండ్రివి కాగలవా? అంత దమ్ముందా?’ అంది. నాకంతా అయోమయం. ‘నువ్వు విన్నది కరెక్టే. నేను నా భర్తతో విడిపోయా’ అనడంతో సీన్‌ పూర్తిగా అర్థమైంది. కాస్త టైమివ్వు అని బయటికి నడిచా.
‘ఇంటర్‌ అయ్యాక బావతో పెళ్లైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత పాత లవర్‌తో సంబంధం కొనసాగించేవాడు. పద్ధతి మార్చుకొమ్మన్నా విన్లేదు. నీకిష్టంలేకపోతే నువ్వెళ్లిపోవచ్చని ఆఫరిచ్చాడు. పుట్టింటికొచ్చేశా. తర్వాతే పాప. చదువూ కొనసాగించా’ రాత్రి ఫోన్‌చేసి క్లుప్తంగా వివరాలన్నీ చెప్పింది. నా కళ్లు చెమర్చాయి. ఎప్పుడూ చలాకీగా ఉండే తన జీవితంలో ఇంత విషాదమా అని ఆశ్చర్యమేసింది. జీవితంలో మొదటిసారి ఒకమ్మాయి అందం గురించి కాకుండా మనసు, పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టా. దాదాపు వారం రోజుల తర్వాత ఓ నిర్ణయానికొచ్చా.
నాన్న నా బెస్ట్‌ఫ్రెండ్‌. సలహా అడిగా. ‘చాలా రిస్కు తీసుకుంటున్నావ్‌. మరోసారి ఆలోచించు. కానీ నువ్వే నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు’ అన్నారు. అమ్మ ముందు వద్దన్నా కష్టపడి ఒప్పించాను. తర్వాత శిరీష చెప్పినట్టే మేం సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నాం. ‘మా పాప’ సాక్షిగా. ఇప్పుడు నన్నంతా ‘నిజమైన హీరో’ అంటున్నారు. నాకు మాత్రం నా డ్రీమ్‌గాళ్‌ దొరికింది. ప్లస్‌ అందమైన మనసుతో సహా. అమ్మానాన్నలకు అణకువైన కోడలు కూడా.

ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది!


పరిచయానికి ఫేస్‌బుక్‌... బాతాఖానీకి వాట్సాప్‌... బయట కలుసుకోవడానికి పార్కులు, రెస్టరెంట్లు... నేటి కుర్ర స్నేహాలకు కొలమానం ఇది! కానీ ఈ హైటెక్‌ యుగంలోనూ ఉత్తరాలతో చెలిమి చేసేవారుంటారా? కానీ మా స్నేహం అలాంటిదే. - శ్రీనివాస్‌
గాయత్రి... ఈ పేరు వింటేనే నాకు గొప్ప ఆప్యాయత గుర్తొస్తుంది. మా అక్క వాళ్లింటిదగ్గరే తనుండేది. ‘ఆ అమ్మాయి చాలా పద్ధతైన పిల్లరా. పెద్దలంటే గౌరవం’ అడక్క ముందే ఆమె గురించి చాలా సార్లు చెప్పేది అక్క. ఆ మాటల ప్రభావమేమో గాయత్రిని చూడకుండానే అభిమానం పెంచుకున్నా.
నచ్చిన అమ్మాయికి దగ్గరవ్వాలనుకోవడం సహజమే కదా! అక్కాబావలకు తెలియకుండా గాయత్రి కాలేజీకి వెళ్లా. దొంగచాటుగా తనని గమనించా. ఫర్వాలేదు అందగత్తే. నన్ను నేను పరిచయం చేసుకోవడమెలా? ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, తన స్నేహితులు... చాలా దారులే కనిపించాయి. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. భాషపై నాక్కొంచెం అభిమానం ఎక్కువ. పుస్తకాలు బాగా చదువుతా. అందుకే తనతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నానో వివరిస్తూ ఉత్తరం రాశా. ఒకటి.. రెండు.. ఐదు.. నా అంతరంగ భావాల్ని అక్షరాలుగా పేర్చి లేఖలు పంపా. అవతలివైపు నుంచి సమాధానం లేదు. అయినా నా నమ్మకం సడలలేదు. నా ఆలోచనలు తనకు కచ్చితంగా నచ్చుతాయనిపించింది. కాస్త ఆలస్యంగానైనా నా అంచనా నిజమైంది. ‘మీరెవరో నాకు తెలియదు. కానీ మీ అక్షరంలో నిజాయతీ ఉంది. మీ ఆలోచనలు నాలాగే ఉన్నాయి’ అంటూ జవాబిచ్చింది. ఉత్తర ప్రత్యుత్తరాల వేగం పెరిగింది.
చేతి రాతల్ని నోటిమాటలుగా మార్చాలనిపించింది. కలుద్దాం అంటే 'ఓస్‌... దానికేం భాగ్యం’ అంది. గాయత్రిని కలిసి మాట్లాడాక తనకన్నా తన ఆలోచనలు, భావాలు మరింత అందంగా ఉన్నాయనిపించింది. ఖాళీ సమయాల్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతా. స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తా’ అంటుంటే ఇలాంటి అమ్మాయి నా ఫ్రెండ్‌ అని చెప్పుకోవడం గర్వంగా ఉండేది. మేం తరచూ కలిసేవాళ్లం. చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. అందులో వ్యక్తిగత విషయాలకన్నా సమాజ ప్రస్తావనే ఎక్కువ. బాధలు, కష్టాల్లో ఉన్నపుడు ఒకరికొకరం ఓదార్చుకునేవాళ్లం.
మాది కేవలం స్నేహమే. అందులోనే అనిర్వచనీయమైన ఆనందాన్ని వెతుక్కునేవాళ్లం. కానీ మా సాన్నిహిత్యాన్ని ఈ సమాజం మరోలా అర్థం చేసుకుంది. సన్నిహితులే మమ్మల్ని ‘ప్రేమ పక్షులు’ అన్నారు. స్నేహం పేరుతో రొమాన్స్‌ చేస్తున్నారని ఎగతాళి చేశారు. మేమేంటో మాకు తెలుసు. ఎవర్నీ పట్టించుకోలేదు. రాన్రాను అపార్థం చేసుకున్నవాళ్లే నిజం తెలుసుకున్నారు.
కొన్నాళ్లకు నాకింకో అమ్మాయి పరిచయమైంది. పరిచయం త్వరలోనే ప్రేమ బాట పట్టింది.‘నీతో జీవితం పంచుకోవాలనుంది’ నా మనసులో మాట తను చెప్పింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేవ్‌. ఇక ఆమెతోనే నా జీవితం అనుకున్నా. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నా. ‘నాకు ఇంకో అబ్బాయి దొరికాడు. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో’ ఓరోజు బాంబు పేల్చింది. నా గుండె పగిలింది. బాధతో దాదాపు పిచ్చివాడినయ్యా. అప్పుడు గాయత్రే నాకు తోడుగా నిలిచింది. తన చల్లని మాటలతో కుంగుబాటు నుంచి బయటికి తీసుకొచ్చింది.
జీవితాంతం తోడుంటానన్న ప్రేమ అర్థాంతరంగా నన్నొదిలి వెళ్లింది. మధ్యలో పరిచయమైన స్నేహం మాత్రం కడదాకా తోడుంటానంటోంది. అందుకే నా దృష్టిలో ప్రేమకన్నా స్నేహమే గొప్పది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ స్నేహాన్ని వదలొద్దు.