మూడు సినిమాలు... ఆరు పార్టీలతో జాలీగా గడిపే కుర్రాడు. ఓ అమ్మాయి రాక అతడి జీవితంలో పెనుతుపాను రేపింది. ఇంతకీ ఏమైంది?
ఆఫీసులో ఉండగా జీటాక్‌లో ‘హాయ్’ అనే పలకరింపు. అవతలివైపు అమ్మాయి. నా వేళ్లలో కరెంట్. చకచకా వ్యక్తిగత వివరాల్లోకి దిగా. ‘ఎంటెక్ చేస్తూనే ఉద్యోగం చేస్తున్నా’ బదులిచ్చింది. నేనూ వివరాలిచ్చా. తర్వాత ఎప్పుడోగానీ మామధ్య మాటలు కలవకపోయేవి. నా ఉద్యోగం అలాంటిది మరి. నిమిషం ఖాళీ దొరికినా తనకే కేటాయించేవాణ్ని. ఎలాగో వీలు చేసుకొని కొన్నాళ్లకి తననో మాల్‌లో కలిశా. ఆకర్షణో, అభిప్రాయాలు కలవడమో... ఒకరికొకరం తెగ నచ్చేశాం. ప్రేమ గోదాలో దిగిపోయాం. ఓ మొగుడితో మాత్రమే చెప్పుకునే విషయాలు నాతో పంచుకునేది. బ్యాంకు ఖాతా సహా ఈమెయిల్, ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌లన్నీ ఇచ్చింది. ప్రేమికుల మధ్య ఏ దాపరికాలూ ఉండద్దనేది తన ఫిలాసఫీ. ఇంకేం... పూర్తిగా పడిపోయా.
నాకు వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది. బెంగళూరులో శిక్షణ. వెళ్లేముందు కలిశా. మూడు గంటలు మనసారా మాట్లాడుకున్నాం. బై చెబుతుంటే చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చింది. నాకూ కన్నీళ్లాగలేదు. జీవితంలో తన చేయి వదలొద్దనుకున్నా.
శిక్షణ బాగానే సాగుతోంది. మరోవైపు మా ప్రేమ కూడా. ఫోన్, చాటింగ్, వీడియో కాలింగ్... ఓ నెలదాకా ఏదోరకంగా టచ్‌లో ఉండేవాళ్లం. తర్వాతే మొదలైంది తనలో వూహించని మార్పు. అకస్మాత్తుగా నన్ను దూరం పెట్టసాగింది. పరీక్షల ఒత్తిడి... ఫోన్ ప్రాబ్లెమ్... ఇంట్లో ఇబ్బందులు... ఏదోరకంగా సర్దిచెప్పుకునేవాణ్ని. ఎన్నిరోజులు గడిచినా దేనికీ సమాధానం దొరకదే! పిచ్చెక్కిపోయేది. పాస్‌వర్డ్‌లు గుర్తున్నాయి. ఆఖరిప్రయత్నంగా తన ఖాతాలు తెరిచా. నెలరోజులుగా వాడిన దాఖలాల్లేవు. నాలో భయం మొదలైంది.
నేనీ టెన్షన్‌లో ఉండగా నాకో మెయిల్ వచ్చింది. ‘హాయ్ భయ్యా... ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది? తనకు, నీకు ఏంటి సంబంధం?’ అనేది సారాంశం. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో తెలియక గాబరాగా ఫోన్ కలిపా. ‘మేమిద్దరం క్లాస్‌మేట్స్. ప్రపోజ్ చేశా. ఒప్పుకుంది. ఫిబ్రవరి 14న లంచ్ కూడా చేశాం’ సూటిగా విషయం చెప్పాడు. గుండెలు భగ్గుమన్నాయి. కళ్లలో నీళ్ల సుడులు తిరిగాయి. అప్పుడు తనకి దూరం అవుతున్నానని ఏడ్చా. ఇప్పుడు తను నన్ను దూరం పెడుతోందని ఏడ్చా. ఏ కష్టాలూ తెలియని ఓ కుర్రాడ్ని ఏడిపించే శక్తి ఒక్క అమ్మాయికే ఉందని అర్థమైంది.
నేనందరిలాంటోడ్ని కాదు. ప్రేమ త్యాగం చేసి సైడైపోవడానికి... బాధ మింగలేక ఏ విషమో మింగడానికి. అంతు తేల్చుకోవడానికి తన ముందుకెళ్లా. వాడు చెప్పింది నిజమేనా అని నిలదీశా. ‘హా’ అంది ఏమీ ఎరగనట్టే. బూతులు తిట్టా. ‘హే... నేనెపుడో నీకు బ్రేకప్ చెప్పేశాగా’ అంది. నీకివ్వాల్సిన వంద ఎప్పుడో ఇచ్చేశాగా అన్నంత సింపుల్‌గా. ఏడ్వలేక నవ్వా. పరిచయం పెంచుకుంది. ప్రపోజ్ చేసింది. అడక్కముందే అన్నీ చెప్పింది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టే బ్రేకప్ అంటోంది. అదీ అసలు మా మధ్య ఏ గొడవా లేకుండానే. ఒకమ్మాయిలో ఇన్ని కోణాలా?
బాధ పడ్డా. కానీ దేవదాసు కాలేదు. తనపై పీకల్దాకా కోపమొచ్చింది. కానీ యాసిడ్ దాడి చేయలేదు. నా దృష్టిలో జీవితం అంటే ఓ ప్రయోగశాల. చేసే ప్రతి ఎక్స్‌పరిమెంట్ సఫలం కాదు. నా ప్రేమ విషయంలోనూ అలాగే జరిగింది. తప్పు ప్రేమ ఫార్ములాది కాదు. చేసే విషయంలోనే తేడా జరిగింది. ఈ ఓటమి నాకు చాలా నేర్పింది. ఆఖరికి నేనో రాంగ్ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నానని తేలింది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయను. ప్రేమలో, జీవితంలో... ముందుగా కెరీర్‌లో తప్పకుండా విజయం సాధిస్తా.
Like Our Page: https://www.facebook.com/NaaLoveStory/

No comments:
Post a Comment