ఓ అమ్మాయి.. అబ్బాయి సన్నిహితంగా ఉన్నారంటే అది ప్రేమే కాదు.. అంతకుమించి అనుబంధం ఉండొచ్చు అంటున్న యువతి అంతరంగం.
బట్టల కొట్టులో షాపింగ్ చేస్తున్నా. చాలాసేపటి నుంచి నన్నే నమిలేసేలా చూస్తున్నాడో వ్యక్తి. ఒళ్లు మండింది. ‘ఎంటలా చూస్తున్నావ్? ఇంతకుముందెపుడూ అమ్మాయిని చూడలేదా?’ వెళ్లి క్లాస్ పీకా. ‘నాకు గులాబీ రంగంటే ఇష్టం. ఆ రంగు చీరలో మీరు అందంగా కనిపిస్తున్నారు అందుకే’ తడుముకోకుండా చెప్పాడు. ఏమనాలో అర్థం కాక ఓ చిర్నవ్వు నవ్వా. అదే అదనుగా ‘పక్క వీధిలో ఉంటా. మీరెక్కడ?’ అంటూ మాట కలిపాడు. అరగంటలో ఫోన్‌నెంబర్ ఇచ్చేంత కనికట్టు చేశాడు.‘నేను రామూని. బట్టలషాపు పరిచయం’ వారమయ్యాక కాల్ చేశాడు. సందేహిస్తూనే మాట్లాడా. ఈ పరిచయం ఎటువైపు వెళ్తుందో అని మనసులో భయం మొదలైంది. పైగా నా పరిస్థితేం బాగా లేదు. రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేశా. గతంలోకి వెళ్లిపోయింది మనసు. మాదో పల్లెటూరు. నేను, చెల్లి, తమ్ముడు. కొడుకుగా పుట్టలేదని నాన్నకు నాపై కోపం. అమ్మకీ నచ్చను. ఐదుతోనే చదువాపించారు. నాకేమో చదువుకోవాలనే ఆరాటం. తీరే దారేది? ఇంటి పనయ్యాక అమ్మమ్మతో చేనుకి వెళ్లేదాన్ని.
పెళ్లితో కొత్త జీవితం మొదలైనా పాత కష్టాలు మాత్రం వదల్లేదు. భర్త తాగుబోతు. చిన్నవిషయానికే చేయి చేసుకోవడం, పరాయి వాళ్లతో మాట్లాడితే అనుమానం. ఈ పరిస్థితుల్లో పరిచయమయ్యాడు రాము. అతడి మాటలు నాకు సాంత్వన ఇచ్చేవి. చిన్నవయసులోనే గంపెడు సంసారాన్ని మోస్తున్నాడనీ, అతడిదీ నాలాంటి పరిస్థితే అని తెలిశాక నాకెంతో సన్నిహితుడు అనిపించింది. ఎవరికే కష్టం వచ్చినా ఒకర్నొకరం ఓదార్చుకునేవాళ్లం. రాము మాటల్లో మర్మం లేదు. చేతల్లో స్వార్థం లేదు. నాకు ఆపదొస్తే తల్లడిల్లేవాడు. ఆమధ్య నేను తరచూ అనారోగ్యం పాలయ్యా. భర్త, కన్నవాళ్లు పట్టించుకోలేదు. అప్పుడు రామూనే నాకు ఆప్తుడయ్యాడు. తన సొంత డబ్బులతో నన్ను బాగు చేయించాడు. అతడు పక్కనుంటే చాలు నా బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేదాన్ని. ఈక్రమంలో నాకు చదువంటే ఇష్టమని తెలుసుకున్నాడు. పట్టుపట్టి నాతో పుస్తకం పట్టించాడు. అనుక్షణం వెన్నంటే ఉండి నేను డిగ్రీ పాసయ్యేలా చేశాడు. చదువుకున్న అమ్మాయిగా, పిల్లలకు చదువు చెప్పే టీచర్‌గా ఇప్పుడు నాకు సమాజంలో మంచి గౌరవం ఉంది. నా సొంతకాళ్లపై నేను నిలబడ్డానంటే అది రాము పెట్టిన భిక్షే. తను నా హితుడు, ఆత్మబంధువు, సర్వం. మా గురించి ఎవరు ఏమైనా అనుకోనీ! రాము తర్వాతే నాకు ఎవరైనా.
© Shekharmine