Wednesday, 13 January 2016

ఓ స్నేహితుడే ఉంటే...

ఓ అమ్మాయి.. అబ్బాయి సన్నిహితంగా ఉన్నారంటే అది ప్రేమే కాదు.. అంతకుమించి అనుబంధం ఉండొచ్చు అంటున్న యువతి అంతరంగం.
ట్టల కొట్టులో షాపింగ్‌ చేస్తున్నా. చాలాసేపటి నుంచి నన్నే నమిలేసేలా చూస్తున్నాడో వ్యక్తి. ఒళ్లు మండింది. ‘ఎంటలా చూస్తున్నావ్‌? ఇంతకుముందెపుడూ అమ్మాయిని చూడలేదా?’ వెళ్లి క్లాస్‌ పీకా. ‘నాకు గులాబీ రంగంటే ఇష్టం. ఆ రంగు చీరలో మీరు అందంగా కనిపిస్తున్నారు అందుకే’ తడుముకోకుండా చెప్పాడు. ఏమనాలో అర్థం కాక ఓ చిర్నవ్వు నవ్వా. అదే అదనుగా ‘పక్క వీధిలో ఉంటా. మీరెక్కడ?’ అంటూ మాట కలిపాడు. అరగంటలో ఫోన్‌నెంబర్‌ ఇచ్చేంత కనికట్టు చేశాడు.
‘నేను రామూని. బట్టలషాపు పరిచయం’ వారమయ్యాక కాల్‌ చేశాడు. సందేహిస్తూనే మాట్లాడా. ఈ పరిచయం ఎటువైపు వెళ్తుందో అని మనసులో భయం మొదలైంది. పైగా నా పరిస్థితేం బాగా లేదు. రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేశా. గతంలోకి వెళ్లిపోయింది మనసు. మాదో పల్లెటూరు. నేను, చెల్లి, తమ్ముడు. కొడుకుగా పుట్టలేదని నాన్నకు నాపై కోపం. అమ్మకీ నచ్చను. ఐదుతోనే చదువాపించారు. నాకేమో చదువుకోవాలనే ఆరాటం. తీరే దారేది? ఇంటి పనయ్యాక అమ్మమ్మతో చేనుకి వెళ్లేదాన్ని.
ఓసారి చేలో ఉండగా బావ వచ్చాడు. నాలో ఏదో తెలియని పరవశం. ‘హాయ్‌ బావా ఎలా ఉన్నావ్‌?’ అని పలకరించా. కాసేపు నన్నే తదేకంగా చూసి ‘ఇంత అందమైన అమ్మాయి నా మరదలా? నిన్ను తప్ప వేరే వాళ్లను పెళ్లి చేసుకోను’ అన్నాడు. సిగ్గుల మొగ్గై అక్కణ్నుంచి పరుగెత్తా. అమ్మమ్మకీ అదే విషయం చెప్పాడు. పెద్దవాళ్లతో మాట్లాడతానంది. అమ్మమ్మ తప్ప ఎవరూ ఆదరించని నన్ను బావ ఇష్టపడటం గొప్పగా అనిపించేది. ఓసారి బావ వాళ్లింటికెళ్లా. ఉన్న వారం రోజులు అత్తయ్య, మామయ్యలు ప్రేమ కురిపించారు. బావ అయితే చంటిపాపలా అపురూపంగా చూసుకున్నాడు. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులవే. కొన్నాళ్లకి బావ నుంచి ఫోన్‌. ఆనందంగా ‘హలో’ అన్నా. ‘సారీ లతా... నీతో పెళ్లికి మా అమ్మ ఒప్పుకోవట్లేదు. నన్ను క్షమించు’ అని గుండెలో శూలాలు దింపాడు. నా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. కన్నీరుమున్నీరయ్యాను. విషయం ఇంట్లోవాళ్లకు తెలిసి వెంటనే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నా ప్రమేయం లేకుండానే అత్తవారింట్లో అడుగుపెట్టా.
పెళ్లితో కొత్త జీవితం మొదలైనా పాత కష్టాలు మాత్రం వదల్లేదు. భర్త తాగుబోతు. చిన్నవిషయానికే చేయి చేసుకోవడం, పరాయి వాళ్లతో మాట్లాడితే అనుమానం. ఈ పరిస్థితుల్లో పరిచయమయ్యాడు రాము. అతడి మాటలు నాకు సాంత్వన ఇచ్చేవి. చిన్నవయసులోనే గంపెడు సంసారాన్ని మోస్తున్నాడనీ, అతడిదీ నాలాంటి పరిస్థితే అని తెలిశాక నాకెంతో సన్నిహితుడు అనిపించింది. ఎవరికే కష్టం వచ్చినా ఒకర్నొకరం ఓదార్చుకునేవాళ్లం. రాము మాటల్లో మర్మం లేదు. చేతల్లో స్వార్థం లేదు. నాకు ఆపదొస్తే తల్లడిల్లేవాడు. ఆమధ్య నేను తరచూ అనారోగ్యం పాలయ్యా. భర్త, కన్నవాళ్లు పట్టించుకోలేదు. అప్పుడు రామూనే నాకు ఆప్తుడయ్యాడు. తన సొంత డబ్బులతో నన్ను బాగు చేయించాడు. అతడు పక్కనుంటే చాలు నా బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేదాన్ని. ఈక్రమంలో నాకు చదువంటే ఇష్టమని తెలుసుకున్నాడు. పట్టుపట్టి నాతో పుస్తకం పట్టించాడు. అనుక్షణం వెన్నంటే ఉండి నేను డిగ్రీ పాసయ్యేలా చేశాడు. చదువుకున్న అమ్మాయిగా, పిల్లలకు చదువు చెప్పే టీచర్‌గా ఇప్పుడు నాకు సమాజంలో మంచి గౌరవం ఉంది. నా సొంతకాళ్లపై నేను నిలబడ్డానంటే అది రాము పెట్టిన భిక్షే. తను నా హితుడు, ఆత్మబంధువు, సర్వం. మా గురించి ఎవరు ఏమైనా అనుకోనీ! రాము తర్వాతే నాకు ఎవరైనా.
© Shekharmine

No comments:

Post a Comment