‘నేనో అబ్బాయిని ప్రేమిస్తున్నా. పేరు రాజేశ్. తనకీ నేనంటే ఇష్టమే’ మెరిసే కళ్లతో చెప్పిందోరోజు. నా స్నేహితురాలి మనసుకి నచ్చినవాడు దొరికినందుకు నాకూ హ్యాపీనే. కొన్నాళ్లు సాఫీగానే గడిచింది వాళ్ల ప్రేమ ప్రయాణం. తర్వాత అప్పుడప్పుడు మా ఇద్దరికీ గొడవలవుతున్నాయనేది. సర్దిచెప్పేవాణ్ని. కొన్నాళ్లకు మేం పూర్తిగా మాట్లాడుకోవడం లేదంది. వాళ్లను కలపడానికి చాలా ప్రయత్నించా. తను ఏడుస్తుంటే ‘మీరు మళ్లీ కలుస్తారు. అయినా ఏం జరిగినా నీ మంచికే’ అని ఓదార్చేవాణ్ని.
నాకూ సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు ఇంట్లో. అమ్మాయిల ఫొటోలన్నీ నందితకు చూపించేవాణ్ని. తనభిప్రాయం చెప్పేది. అమ్మానాన్నలతోపాటు నాకూ ఓ అమ్మాయి బాగా నచ్చింది. నాల్రోజుల్లో ముహుర్తాలు పెట్టుకోవాలనుకున్నాం. సంతోషంతో ఆ మాట నందిత చెవినేశా. నేనూహించని విధంగా స్పందించింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు లేకుండా ఉండలేను’ అంది. ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. ఆ షాక్ నుంచి తేరుకొని ‘నువ్వు ప్రేమించింది రాజేశ్‌ను కదా. మీ ఇద్దర్ని ఎలాగైనా నేను కలుపుతా’ అన్నా. తను విన్లేదు. ‘నాకు నువ్వే కావాల’ంటూ ఏడుపు. ఆ కన్నీరుకు కరిగిపోయా. ‘అమ్మనాన్న లేని నాకు అన్నీ నువ్వే’ అంటుంటే దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నా.
అమ్మానాన్నలు నిశ్చితార్థం ఏర్పాట్లలో ఉన్నారు. నందితను నేరుగా ఇంటికి తీస్కెళ్లా. ‘ఈమే మీక్కాబోయే కోడలు’ అన్నా. అమ్మానాన్నలు నోరెళ్లబెట్టారు. కష్టపడి వాళ్లని ఒప్పించా. ‘సరే.. నీకు నచ్చిందే చెయ్’ అని వదిలేశారు. నా ప్రియనేస్తం నాలో సగభాగం అవుతుందని వూహల్లో మునిగిపోయా. కొద్దిరోజులు బాగానే గడిచాయి. తర్వాత నందితలో మళ్లీ మార్పు. కారణం.. రాజేశ్ మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. తను మెల్లిమెల్లిగా నాకు దూరం కావడం మొదలుపెట్టింది. తట్టుకోలేకపోయా. ఆ ఎడబాటును తట్టుకోలేక నిలదీశా. ‘రాజేశ్ మళ్లీ వస్తాడనుకోలేదు. అందుకే నిన్ను ప్రేమించా. ఇప్పుడు అతడ్నే పెళ్లాడతా’ అంది. ఎంత స్వార్థం? ఇప్పుడు తను కనీసం నాతో మాట్లాడ్డం లేదు.
తను స్నేహం చేస్తే నేను స్వార్థం లేని అనురాగం కురిపించా. తను వేరొకర్ని ప్రేమించిందని తెలిసినా పెద్దమనసుతో కొత్త జీవితం ఇవ్వాలనుకున్నా. ఆమె కోసం కన్నవాళ్లనీ, ఓ అమ్మాయికీ బాధ పెట్టా. ఇవన్నీ తనకి తెల్సు! అయినా స్వార్థంతో తన దారి తను చూసుకుంది. వగస్తోంది మాత్రం నేనే. నా తొందరపాటు నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నా.
© Shekharmine
No comments:
Post a Comment