Wednesday, 30 December 2015

మనసు గాయం మానలేదింకా!

ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. ఇది తెలియని కుర్రాడు రెండు ప్రేమల్లో ఒక్కదాన్నీ గెల్చుకోలేకపోయాడు. అదెలా అంటే..
దో ఆలోచిస్తూ క్యాంపస్‌లో పరధ్యానంగా నడుస్తున్నా. ‘హాయ్‌ శ్రీను.. ఒక్క క్షణం’ వెనకనుంచి బిందు. ‘ఎల్లుండే కదా నీ పుట్టినరోజు. అడ్వాన్స్డ్‌ హ్యాపీ బర్త్‌డే టూ యూ’ చేయందుకుంటూ చెప్పింది. ఆ విషయం నాకే గుర్తులేదు. నీకెలా తెలుసని అడిగా. ‘కావాల్సినోడివి. ఆమాత్రం తెల్సుకోలేనా?’ నవ్వింది. అర్థంకాక తెల్లమొహమేశా. ‘ముసుగులో గుద్దులాటలెందుకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా’ తనే మనసు విప్పింది. వేరొకరైతే ఎగిరి గెంతేసేవారే. తను అందగత్తె, చదువరి. అంతకుమించి సహృదయురాలు. అయినా నేను నో చెప్పడానికి కారణం రాణి. రెండేళ్లుగా తనే నా సర్వస్వం.
నా పుట్టినరోజు. నాకిష్టమైన డిక్షనరీ చేతిలో పెట్టాడు ఫ్రెండ్‌ హరి. ప్రేమకు చిహ్నమైన రాధాకృష్ణుల బొమ్మను కానుకగా ఇచ్చింది రాణి. మర్నాడే బిందు నాకు ప్రపోజ్‌ చేసిన విషయం రాణితో చెప్పా. విపరీతంగా ఏడ్చేసింది. ఇంకోసారి వేరే అమ్మాయివైపు కన్నెత్తి చూడొద్దనీ, తననే పెళ్లాడాలని ఒట్టేయించుకుంది. తన కౌగిలిలో ఒదిగిపోయా. మేం ప్రేమపక్షులమనే విషయం కాలేజీ అంతటికీ తెలిసింది. ఎలాగూ మేం పెళ్లి చేసుకుంటాం అనే భరోసాతో దాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు.
కాలం గిర్రున తిరిగింది. ఓరోజు రాణి కాలేజీకి రాలేదు. సమాచారం కూడా లేదు. తట్టుకోలేక ఫోన్‌ చేశా. స్విచ్ఛాఫ్‌. మర్నాడు, ఆపై వారం రోజులూ అంతే. నాలో భయం పట్టుకుంది. ‘మీ లవర్‌ రావట్లేదేంటి?’ ,ునీకు చెప్పకుండా ఎటెళ్తుంది?’ క్లాసంతా అడిగేవారు. ఏం సమాధానం చెప్పాలో తెలియదు. వాళ్లింటికె’ళ్లాలనుకున్నా. ఇంతలో తన ఫోన్‌. నాలో పట్టరాని సంతోషం. ‘ఎక్కడున్నావ్‌?, ఏమైపోయావ్‌?’ ప్రశ్నలు సంధించా. ‘నీకు చెప్పాల్సిన పన్లేదు’ వూహించని సమాధానంతో మ్రాన్పడిపోయా. ‘మాట్లాడుతోంది నా రాణినేనా?’ బేలగా అడిగా. ‘ఔను.. నేనే. కానీ నీ రాణిని కాదు. నాకు వేరొకరితో పెళ్లి కుదిరింది. స్నేహితుల బలవంతంతో నీకు చెబుతున్నా’ ఈటెల్లాంటి తన మాటలు నా గుండెను చీల్చాయి. ‘నన్నే పెళ్లాడాలని ఒట్టేయించుకున్నావ్‌గా?’ అంటే ఏదో మూడ్‌లో అలా మాట్లాడా. గతంగతః వదిలెయ్‌ అంది. నా మెదడు మొద్దుబారిపోయింది.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నన్ను ఓదార్చాలని చాలా ప్రయత్నించింది బిందు. పట్టించుకోలేదు. ‘మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. వేరొకర్ని పెళ్లాడ్డం నాకిష్టం లేదు. నువ్వు ఓకే అంటే మావాళ్లతో మాట్లాడతా’ నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిందోసారి. అసలే నా ప్రేమ విఫలమైన బాధలో ఉన్నా. అందుకు బిందు కూడా ఓ కారణం కావొచ్చనే అనుమానం నాది. ఆ కోపంలో విచక్షణ మర్చిపోయి నోటికొచ్చిన మాటలన్నా. ఏడుస్తూ వెళ్లిపోయింది.
చాన్నాళ్లదాకా బిందు కనిపించలేదు. ఓరోజు ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి ‘బిందు ఆత్మహత్య చేసుకుంది. చూడ్డానికెళ్తున్నా. నువ్వొస్తావా?’ అనే పిడుగులాంటి వార్త చెప్పాడు. అది వినగానే నా గుండె క్షణకాలం కొట్టుకోవడం ఆగింది. నేను తనని తిరస్కరించినందుకే అలా చేసిందా? లేక వేరే కారణమా? నెలలు గడిచినా నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఈ అనుమానం నా మనసును ఇంకా తొలుస్తూనే ఉంది.
ప్రేమించిన అమ్మాయి దక్కలేదు. నన్ను ఇష్టపడ్డ అమ్మాయి ఈ లోకంలో లేదు. ఇది తల్చుకొని బాధ పడని రోజు లేదు. ఈమధ్యే ఇంకో నిజం తెలిసింది. నాకిష్టమైన డిక్షనరీ బిందునే కొని నా ఫ్రెండ్‌తో ఇప్పించిందట. అది నా దగ్గర భద్రంగా ఉంది. రాణి ఇచ్చిన రాధాకృష్ణుల బొమ్మ పొరపాటున కిందపడి ముక్కలైంది. తన ప్రేమలాగే.

© Shekharmine

No comments:

Post a Comment