Tuesday, 6 September 2016

పల్లవించవా...నా గుండెలో!

'ఫేస్‌బుక్‌ ప్రేమలు, స్నేహాలన్నీ అబద్ధం. అదొక ­హా ప్రపంచం. అందులో మంచి కన్నా చెడే ఎక్కువ’...-మొదట్లో నేనూ ఇలాగే అనుకునేవాణ్ని. ఒకమ్మాయి నా అభిప్రాయం మార్చేసింది.
ఓరోజు ఫేస్‌బుక్‌ తెరవగానే పల్లవి పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఓకే చేశా. ‘చదువుకుంటూనే ఓ స్వచ్ఛందసంస్థ తరపున పనిచేస్తున్నా. ఛాటింగ్‌ చేస్తూ విరాళాలు సేకరిస్తుంటా. మీ క్లాస్‌మేట్స్‌లో ఇద్దరు నా ఫ్రెండ్స్‌’ వివరాలందించింది. ‘తనది ఫేక్‌ అకౌంట్‌రా. తీపి మాటలు చెప్పి డబ్బులు గుంజే రకం’ అన్నారు సహాధ్యాయులు. ఎవరి మాట నమ్మాలో తెలీలేదు. ఛాటింగ్‌ మాత్రం కొనసాగేది.
వారం తిరక్కముందే నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. మాటలు వ్యక్తిగతంవైపు మళ్లాయి. ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌. ఐదు సబ్జెక్టులు మిగిలాయన్నా. ‘వ్వాట్‌... ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? కంప్లీట్‌ చేయకపోతే నీతో కట్‌’ అని బెదిరించింది. రోజూ కాలేజీకి వెళ్లు. కష్టపడి చదువు అనేది. పరీక్షలపుడు తెల్లవారుజామునే ఫోన్‌ చేసి నిద్ర లేపేది. పుస్తకం పట్టేదాకా వదిలేది కాదు. తన సొంత విషయాలూ పంచుకునేది.పల్లవి ప్రోద్బలంతో ఫైనలియర్‌తోపాటు సప్పీలు ఒకేసారి పూర్తి చేశా. తను డిగ్రీ పాసైంది. రెణ్నెళ్లు తిరక్కముందే తిరుపతిలో ఉద్యోగం వచ్చిందనే తీపి కబురు చెప్పింది. నేనూ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎక్కడ ఏ ఉద్యోగం ఉన్నా చెప్పేది. కొన్నింటికి తనే స్వయంగా దరఖాస్తు చేసేది. మేం సుదూరాన ఉన్నా మనసులు మాత్రం ఒకేలా ఆలోచించేవి.
తర్వాతేంటి? ఒకర్నొకరం చూసుకోవడం... సరదాలు... షికార్లు... ప్రేమ. ఇవన్నీ ముందే ­హించాం. పరిణతిగా ఆలోచించి ‘మనం అందరిలా కావొద్దు. ఇద్దరం బాగా స్థిరపడ్డాకే కలుద్దాం’ అని ఒట్టేసుకున్నాం.
ఏమైందో తెలియదు సడెన్‌గా తన నెంబర్‌ పనిచేయలేదు. నాలో ఆందోళన ఎక్కువైంది. పదకొండోరోజు ఫోన్‌ చేసి ‘మా పేరెంట్స్‌ యాక్సిడెంట్‌లో పోయారు. నేను అనాథనయ్యా’ ఏడుస్తూ చెప్పింది. నా గుండె తరుక్కుపోయింది. అంత బాధలో పల్లవి పక్కన లేనందుకు కుమిలిపోయా. ‘ఏకాకినయ్యానని బాధగా ఉంది రఫీ. నాకూ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది’ అని ఏడ్చేది. పిరికి మాటలు మాట్లాడొద్దని ధైర్యం చెప్పేవాణ్ని. నాకుద్యోగం రాగానే వచ్చి కలుస్తానని చెప్పా. కానీ ఈలోపే వాళ్ల బాబాయ్‌ సలహాతో బెంగళూరు వెళ్తానంది. జాగ్రత్తలు చెప్పా. తర్వాత మా చెల్లి పెళ్లి కుదిరింది. తనతో చెబితే ఆర్థికసాయం చేస్తానంది. మీ బాబాయి ఒప్పుకుంటేనే వీలైనంత సర్దుబాటు చేయమన్నా. సరేనంది. ఆపై ఏ సమాధానం లేదు. ‘మా బాబాయి నీతో మాట్లాడొద్దు అన్నారు’ కొద్దిరోజుల తర్వాత ఓ మెసేజ్‌ పెట్టింది. పెళ్లి పనుల హడావుడిలో ఉండటంతో తర్వాత మాట్లాడొచ్చులే అనుకున్నా.
చెల్లి పెళ్లిలో నా ఫోన్‌ పోయింది. పల్లవి నెంబర్‌ అందులో మాత్రమే ఉంది. తన ఫేస్‌బుక్‌, మెయిల్‌కి మెసేజ్‌లు పెట్టా. జవాబు లేదు. ఫేస్‌బుక్‌లో మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ని అడిగితే వివరాలేం తెలియవన్నారు. తను చదివానని చెప్పిన కాలేజీకెళ్తే ఆ పేరుతో ఏ అమ్మాయి చదువుకోలేదన్నారు. నాకు షాక్‌. మోసపోయావ్‌ అన్నారు స్నేహితులు. నాకు మాత్రం తనవల్ల జరిగిన మంచే గుర్తొస్తోంది. తన వివరాలు తప్పు చెప్పి ఉండొచ్చుగాక. నా పట్ల చూపిన ప్రేమాభిమానాలు నకిలీవి కాదని ఇప్పటికీ నమ్ముతున్నా. ఆ ప్రేమతోనే ఏడాది దాటినా పల్లవినింకా వెతుకుతూనే ఉన్నా. అన్నట్టు... నేనిపుడు ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో ఉన్నా. తను నా ముందుకొస్తే గుండెలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.

హలో నేస్తం... మిగిల్చెను ఖేదం


ఆధునిక ఉపకరణాలు, జీవనశైలిలో వచ్చిన వేగం.. మాటల మాయ చేస్తాయి. మనిషిని చూడకుండానే మనసిచ్చేసి, మనువు దాకా తీసుకెళ్ళే పరిస్థితులను కాల్పిస్తున్నాయ. ఆ వలలో పడకుండా మెలకువ వహించాలి అంటూ తన అనుభవాలను వివరిస్తున్నారు ఓ పాఠకురాలు.
    మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలకు ముగ్గురు పిల్లలం. ఆస్తులు లేవు. బాగా చదివించడమే మంచి భావిష్యత్తునందించడం అనుకునే వారు నాన్న. చిన్నప్పట్నుంచి బిడియంగా పెరిగాన్నేను. నలుగురితో కలిసేదాన్ని కాదు. నిర్మొహమాటంగా ఉండలేను. పదో తరగతి వరకు ఊళ్లోనే చదువుకొన్నా. తరవాత దగ్గర్లో మంచి కళాశాలలు లేక హాస్టల్లో ఉంచి చదివించారు.
    ఇంటర్ సెకండియర్. సంక్రాంతి సెలవులకి ఇంటికొచ్చాను. ఓ రోజు ఇంట్లోని సెల్ కి మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరూ లేకపోవడంతో నేను ఫోనందుకున్నా. అవతల మగ గొంతు. 'సారి రాంగ్ నంబర్' అని పెట్టేశాడు. ఎందుకోగానీ ఆ స్వరం నన్ను బాగా ఆకట్టుకొంది. మళ్ళీ మాట్లాడితే బాగుండుననిపించింది. కాసేపటికి ఓ సంక్షిప్త సందేశం. ఆశ్చర్యం.. ఆ సందేశం మిస్డ్ కాల్ వ్యక్తి నుంచే. 'మీ గొంతు బాగుంది! మీ పేరేంటి? ఏం చదువుతున్నారు?' అన్న ప్రశ్నలకు క్లుప్తంగా బదులిచ్చా. అలా స్పందించినందుకూ అభినందన సందేశం. నలుగురిలూ అంతగా కలవని నాకు ఆ ప్రశంసలు పన్నీటి జల్లులా అనిపించాయి. ఆ తరవాత కూడా హలోలు, హాయ్ లు, పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడు శుభాకాంక్షలు, చదువుల వివరాలతో అటూ ఇటూ మెసేజీలు నడిచాయి. తను ఎంసీఏ చదువుతున్నాడు. ఐటీ, అమెరికా, భవిష్యత్తు గురించి చెప్పేవాడు. మనసులో మాట్లాడాలని ఉన్నా అది ఇంట్లో ఫోను కాబట్టి దయచేసి [ఫోన్లు చేయొద్దని చెప్పేశాను. తను వింటేనా? ఓ రోజు అన్నయ్య మా తీరుని గమనించాడు. నన్ను చెడామడా తిట్టాడు. తనకి ఫోన్ చేసి ఎవరు నువ్వని నిలదీశాడు. భయపడి ఫోను చేయలేదు.
    నాల్రోజులు గడిచాయి. తన మాట వినబదకపోఎసరికి ఉండబట్టలేక నేనే ఫోను కలిపాను. 'అన్నయ్య తిట్టినందుకు సారి, నేను హాస్టల్ కి వెళుతున్నాను' అని చెప్పా.బతిమాలితే హాస్టల్ లో స్నేహితురాలి నంబరిచ్చా. తిరిగి మా మాటలు జోరందుకున్నాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. అమ్మానాన్నలు పంపిన డబ్బులన్నీ రీ ఛార్జీలకే  అయిపోయేవి. అత్తెసరు మార్కులతో ఇంటర్ గట్టెక్కా. అమ్మానాన్నలు అడిగితే ఆరోగ్యం బాగోలేక పరీక్షలు సరిగా రాయలేకపోయానని చెప్పా. 'అయ్యో.. అక్కడ తినీతినకా చదువుతుంటే మరీ చిక్కిపోతావమ్మా.. ఆ డిగ్రీ ఏదో ఇక్కడే ఉండి చదువుకో' అంది అమ్మ. అంత ప్రేమ చూపిస్తుంటే అబద్ధాలతో మోసం చేస్తున్నానని అనిపించినా.. మనసు అతని స్నేహానికే మొగ్గుచూపింది. ఊళ్లోనే చదువంటే తననిక కలవలేను అనుకొని మళ్ళీ పట్నం వెళ్లి తనని కలిశాను. కబుర్లు, సినిమాలు, షికార్లు. నాల్రోజుల తరవాత ఇంటికొచ్చా.
    ఫోనులో పలకరించే మనిషిని నేరుగా చూశానన్న సంతోషం నాది. కాని అది ఎంతో కాలం నిలవలేదు. తిరిగొచ్చాక తనకి ఫోను చేస్తే నిరాశగా మాట్లాడాడు. మర్నాడూ అదే నిరాసక్తత. ఆ పైనా పొడి పొడి మాటలు. ఒక్కోసారి ఫోను కూడా తీసేవాడు కాదు. తీసినా మాటల్లో విసుగు, కసురు. ఇద్దరికీ తగవు. ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాడో ఏమో.. వాళ్ళెవరైనా ఫోను తీస్తే నానా మాటలనేవారు. ఏడుపోచ్చేది. డిగ్రీ మొదటి సంవత్సరం తప్పాను. అక్కయ్య చదువులో సూపర్. నాకు శ్రద్ధ లేదని ఇంట్లో సంబంధాలు చూడ్డం మొదలు పెట్టారు. ఏడుస్తూ విషయం అతనితో చెప్పా. 'వెరీ గుడ్.. ఆలస్యమెందుకు చేసుకో' అన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. ఫోను నంబరూ మార్చేశాడు. తన స్నేహం, ప్రేమతో మోసపోయానని అర్థమయింది. డీలా పడ్డా. దిగులు కమ్ముకొంది. అమ్మ గమనించింది. ఆరా అడిగింది. విషయం చెప్పా. మొదట బాధ పడింది. తరవాత అనునయించింది. 'మనసు వెళ్ళిన ప్రతి చోటుకీ మనం వెళ్ళకూడదు' అంటూ మందలించింది. చదువయ్యేదాకా చెప్పినట్టు విను.. లేదంటే నీ జీవితం గాడి తప్పుతుంది అంటూ హెచ్చరించింది. ఈసారి దగ్గరుండి చదివించింది. 'ప్రతి మార్కూ ముఖ్యమే నీకు' అని చెబుతూ పరీక్షలు రాయించింది. డిగ్రీ ఫస్టు క్లాసులో పాసయ్యాను. అప్పటికే కనువిప్పు పొందిన నేను పీజీలో చేరి దానిని పూర్తి చేశా. ఓ కళాశాలలో ఉన్నతోద్యోగం సాధించా.
    ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు గుడ్డిగా ప్రేమలో పడ్డారని తెలిసినా, ఆన్ లైన్ ప్రేమల గురించి ప్రస్తావన తెచ్చినా గట్టిగా మందలిస్తాను. 'పరీక్ష'లకు నిలిచిన స్నేహాలు, ప్రేమలనే ఆదరించమంటాను. పెద్దలకు తెలిపి ఆమోదం పొందే ఆత్మవిశ్వాసమూ ప్రదర్శించాలని చెబుతాను.

మనసు విప్పలేదు... గుండెకోత తప్పలేదు!


అందుబాటులో ఉన్నపుడే బందాన్ని అందుకోవాలి. అందకుండా పోయాక ఎంత వగస్తే మాత్రం ఏం లాభం?
ఛీ ఛీ...ప్రేమా? గాడిద గుడ్డా? అదో టైం వేస్ట్ వ్యవహారం' స్నేహితులతో ఇలా ఎన్నిసార్లు అనుంటానో లెక్కేలేదు.నాకు నచ్చని ఓకే ఒక పదం ప్రేమ.నేను ఎష్టపడింది కేవలం పుస్తకల్నే. అందుకే ఇంటర్ లో టాపర్ని.ఇంజనీరింగ్ లో కాలేజి ఫస్ట్.నాలుగైదు కంపెనీలు ఆహ్వానం పలికాయి.అందులో నాకు నచ్చిన సంస్థలో చేరిపోయా.
పుణేలో ఉద్యోగం కొత్త చోటు బెరుగ్గా ఆఫీసు లో అడుగు పెట్టా 'హాయ్ నేను శేఖర్.మాది మీ ఉరేనండి' అంటూ మాట కలిపాడో వ్యక్తి. నా బయోడేటా ముందే పట్టేశాదేమో? ఏదేమైనా తనదీ మా ఊరే అనగానే ప్రాణం లేచొచ్చింది.బాస్ కి పరిచయం దగ్గర్నుంచి, హెచ్ ర్ పర్మాలితిస్ దాకా అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆపై సహోద్యోగులతో పరిచయం.బాగా కలిసిపోవడంతో నేనూ వాళ్ల బృందంలో సబ్యురాలినయ్యా.క్యాంటీన్ బాతాఖానీలు, వీకఎండ్ లో సరదా పార్టీలతో జాలిగా గడిచిపోయేది జీవితం.
శేఖర్ కి మొదట్నుంచి నా పై ప్రత్యేక అభిమానం.నాకు నచ్చిన రంగుల చొక్కాలే వేసుకునేవాడు.తనకిష్టం లేకపోయినా నా అభిరుచిల్ని ఆచరించాడు.నేను నిద్రపోయే దాకా తన సందేశాల వెల్లువ నా సెల్ ని  తకుతూనే ఉండేది. నా వ్యక్తిత్వం మేచుకుంటూ 'అమ్మాయంటే ఇలా ఉండాలి' అని కొలీగ్స్ తో చెప్పిన సందర్భాలెన్నో.నేను నేను అనారోగ్యంగా ఉంటే తనకే టెన్షన్.ఇవన్నీ శేఖర్ నా పై పెంచుకున్న ప్రేమకి సంకేతాలని తెలుసుకోలేనంత అమాయకురలినేం కాదు.
ఆ అభిమానం,అప్యాయతకి నేను పడిపోయా.కానీ తనే ముందు ఐ లవ్ చెప్పాలని బెట్టు చేశా. అదెంత తప్పుడు నిర్ణయమో తర్వాత తెల్సింది.
ఆరోజు ఎప్పట్లాగే సహోద్యోగులం కబుర్లలో మునిగాం. మాటల మధ్యలో 'నాకు కుదిరింది'అన్నాడు శేఖర్.ఆట పట్టిస్తునాడనుకున్నా. అమ్మాయి పూర్తీ వివరాలు చెబుతుంటే కన్నీలాగలేదు.మాట మాత్రం చెప్పకుండా ఎందుకిలా చేశాడో అర్ధం కాలేదు.కొలీగ్స్ వెళ్ళాక అతడ్ని పట్టుకొని ఏడ్చేశా.'అవును నేను నిన్ను ప్రాణంలా ప్రేమించా.కాని నీ నుంచి స్పందన లేకపోతే నేనేం చెయనూ?' అన్నాడు.పొరపాటు నాదేనని ఒప్పుకున్నా.'ఇప్పటికైనా పెళ్లి క్యాన్సల్ చేసుకో' అని ప్రదేయపడ్డా. నా చేతుల్లో ఏం లేదంటూ నన్ను దుఖ సాగరంలో ముంచాడు.చెజేతులా మంచి వ్యక్తిని కోల్పోయాననే భాదతో నిద్ర కరువైంది. తిండి తిప్పల్లేవ్.అయినా శేఖర్ పట్టించుకోలేదు.ఒకప్పుడు క్షణం తీరిక దొరికినా నాతో సన్నిహితంగా ఉండాలనుకునేవాడు.ఒంట్లో నలతగా ఉందంటే తల్లడిల్లిపోయేవాడు. ఇప్పుడేమో కాబోయే శ్రిమతికే ప్రాదాన్యం ఇస్తున్నాడు. అస్తమానం ఒకటే ఫోన్లు. తట్టుకోలేకపోతున్నా.ఆఫీసు కెళ్తే నరకానికి వెళ్లినట్లే ఉంది. ఉద్యోగం మానేస్తే ఇంట్లో కష్టం.బెట్టు చేయకుండా ఓ మెట్టు దిగి అతడ్ని ఇష్టపడుతున్నాని చెప్పి ఉంటె ఈ మానసిక క్షోభ తప్పేదే.  

స్నేహమంటే......ప్రేమ కాదోయ్!


ఎల్లలు లేనిది స్నేహం. హడ్డుల్ల్లో ఉండాల్సింది ప్రేమ! అవి రెండూ కలవని సమాంతర రేఖలు.అది మర్చిపోయి స్నేహం పరిధుల్లో ప్రేమ చొరబడితే...
నీ గురించి చెప్పు...' అని ఎవరైనా నన్నడిగితే ముందు నా నోటి నుంచి వచ్చేది పండు, సురేష్ , రవి, వెంకట్ ల పేర్లే.వాళ్ళంతా నా జిగిరి దోస్తులు.మేం  కేర్ మన్న దగ్గర్నుంచి ప్రతి కేరింతలో ఒకరికొకరం తోడున్నాం. సంతోషాన్ని మూకుమ్మడిగా జుర్రుకున్నాం.కష్టాల్ని కలిసి పంచుకున్నాం.అందుకే మా ఉళ్లో మేం స్నేహానికి ప్రతిరూపం .
  అలాంటి స్నేహానికి కుదుపు. పై చదువుల కోసం నేను,పండు నగరానికి వచ్చాం. సురేష్ ఉద్యోగం కోసం వేరే ఉరికెళ్ళాడు. రవి పరీక్షల్లో దింకి కొడితే,వెంకట్ ఉళ్లోనే చదువుతున్నాడు.ఇన్నేళ్ళలో మేం ఎప్పుడు ఇంత దూరం లేము. అందర్లో బాధ. బాగా అలోచించి నేనో ప్రతిపాదన తెచ్చా.'అందరం కలిసి సిటీలో గది అద్దెకు తీసుకుందాం.చదువు,ఉద్యోగం కలిసే కొనసాగిద్దాం'అని.అంతా ఖుషీ.వెంకట్ తప్ప నలుగురం హైదరాబాద్ చేరం కొన్నాళ్లకే 'అన్నయ్యా...చదువుకోవడానికి నేనూ సిటీకోస్తా' అంది పండుగాడి చెల్లెలు.సంతోషంగా ఆహ్వానించాం.మంచి కాలేజీలో చేర్చాం.కానీ తన రాక మా స్నేహానికి పొగ పెడుతుందని ఉహించాలేకపోయాం.
             ఒక రోజు పండు నాతో కోపంగా,'నువ్వు రవిగాడు కలిసి నన్నిత మోసం చేస్తారా?'అని అరిచాడు.నాకర్ధం కాలేదు.'అసలేమైందో చెప్పరా' అన్నా భుజం మీద చెయేస్తూ. ఓ లెటర్ తీసుకొచ్చి నాకిచ్చాడు.అది రవిగాడు పండు చెల్లెలికి రాసిన ప్రేమలేఖ. నా మతిపాయింది. ఏడాదిగా ఈ వ్యవహారం కొనసాగుతోందట. ఇదంతా నాకు తెలిసే జరుగుతోందనుకుంట్టునాడు పండు నాకేం తెలియదంటే నమ్మడే. ఆ వెంటనే గది ఖాలీ చేసి వెళ్లిపోయాడు.అలా మాలో ఒకడు దూరం.
ఏళ్లకేల్లూ సాహసం చేస్తేగానీ మనసుకి నచ్చిన మిత్రుడ్ని పొందలెం. విడిపోవాలంటే మాత్రం క్షణాలు చాలు.అదే మాట చెప్పి 'ఇప్పటికైనా పద్ధతి మార్చుకొమ్మని రవికి సలహా ఇచ్చాం.వాడు పట్టించుకోలేదు.పైగా చదువు వదిలేసి జులాయిలా తిరిగేవాడు. మేం విడిపోయిన సంగతి వాళ్ళమ్మకి తెలిసింది.'మిరున్నారని మవాడ్ని అంత దూరం పంపితే అలా గాలికోదిలేస్తారా? ' అంటూ మమ్మల్ని నిలదీసింది. అసలు విషయం అమెకేం తెలుసు? వాడు బాగుపడాలని అన్ని రకాలుగా ప్రయత్నించి చూశా. చివరికి నచ్చ చెప్పమని నలుగురు ఫ్రెండ్స్ ని పురమాయించా అదే నేను చేసిన తప్పు.మాటా మాటా పెరిగి నా ఫ్రెండ్స్,రవి కొట్టుకున్నారు. 'నీ ఫ్రెండ్స్ తో నన్ను కొట్టిస్తావా? నీ అంతుచూస్తా నంటూ వాడూ నాకు శత్రువయ్యాడు. రెండో వాడూ దూరం. ఆపై ఈ  గొడవలకు దూరంగా ఉండాలని కలిసున్నవల్లము విదిపోయాం.
ఒక్కడి నమ్మకద్రోహం ఇంతమందిని విడదీసింది.కానీ ఒక్కటి మాత్రం నిజం.స్నేహం ముసుగులో సొంత చెల్లెల్ని ప్రేమిస్తునంటే ఏ అన్నయ్యా ఒప్పుకోడు. ముఖ్యంగా చదువు,ఉద్యోగం,క్యారెక్టర్ లేనివాడ్ని. ఆ విషయం ఒకప్పటి నా నేస్తం తెలుసుకోవాలి. మా అనుభవం మాలాంటి స్నేహితులకు పాఠం కావాలి.               

మాట విన్లేదు .. మనసు విరిచేసింది!


అర్ధరాత్రైంది. నిద్రరాక సెల్ఫోన్లో అందుకున్నా. డ్రాఫ్ట్ లో ఉన్న ఎసెమ్మెస్ పై చూపు ఆగింది. బిందూకి పంపాలనుకున్న ఆ సందేశం నా గతాన్ని గుర్తుచేస్తోంది.

తొలి పరిచయం.....
    పేరు పండు. టీ, కాఫీలూ చెడ్డ అలవాట్లే అనుకునే నేపథ్యం. కష్టపడి పైకొచ్చిన యువకుడిగా గుర్తింపు.
   ఊరికి దగ్గర్లోనే ఉద్యోగమొచ్చింది. కొత్తగా దిగిన గది శుభ్రం చేస్తున్నా. 'హాయ్.. ఈరోజే వచ్చారా?' పిలుపుతో అటువైపు తిరిగా. సన్నటి ఆకారం.. పొడవైన జడతో ఓ అమ్మాయి. 'నా పేరు బిందు. మీ పక్కింట్లో ఉంటా' అంది చొరవగా. మర్యాదకిగా తలాడిస్తే ఓ చిర్నవ్వు నవ్వింది. ఎంతటివారైన దాసోహం అయ్యేంత అందంగా ఉందా నవ్వు. పరిచయాలయ్యాయి. ఆఫీసులో పెద్దగా పనేం ఉండేది కాదు. రోజూ తనతో మాట్లాడ్డమే నా వ్యాపకమైంది.
   'నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం అందో రోజు బిందు. ఆ మాటతో అదేదో సినిమాలో చెప్పినట్టు నాలోనూ గంట మోగింది. అందుక్కారణం ఆమె అందమే కాదు ఆమె వెనకాల ఉన్న పెద్ద కుటుంబం కూడా. అమ్మానాన్నలది ప్రేమపెళ్లి. అది నచ్చక బంధువులంతా దూరమయ్యారు. ఎప్పుటికైనా పెద్ద కుటుంబంతో బంధుత్వం కలుపుకోవలనేది నా ఆశ. కల తీరబోతుందనుకుంటే 'మావాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం' అంటూ బాంబు పేల్చింది. అలా చేస్తే నా జీవితానికి అర్దమేంటి? 'ముందు మంచి ఉద్యోగాల్లో స్తిరపడదాం. తర్వాత వల్లనేలాగైనా ఒప్పిద్దాం' అని సముదాయించా. సరేనంది. విదేశాలకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడాలనుకున్నాం.
   సాఫీగా సాగుతున్న ప్రేమకి అనుకోని మలుపు. 'పండు.. ఇక్కడ ఆరోగ్యం బాగుండటం లేదు ఊరెల్తా' అంది. తనని చూడకుండా ఉండటం కష్టమే అయినా ఒప్పుకున్నా. దూరమైన మమ్మల్ని దగ్గర చేశాయి సెల్ల్ఫోన్లు. అయితే మేం అనుకున్నట్టు ఇద్దరం ఒకేసారి విదేశాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ముందు తనని పంపాలనుకుని పాస్పోర్టు ప్రయత్నాలు ముదలుపెట్టా. ఒళ్ళు హునమయ్యేది. నా బిందూ కోసమేనని అన్నీ భరించా. తన పాస్పోర్ట వచ్చింది. శుభావార్త చెబుదామని ఫోన్ కలిపా. అవతలివైపు ఎంగేజి. మర్నాడు చేస్తే గంటలుగంటలు అదే పరిస్థితి  మనసులో కలవరం . 'చిన్ననాటి ఫ్రెండ్.. చాన్నాళ్ళు తర్వాత  కలిస్తే మాట్లాడుతున్నా' అంటూ వివరణ ఇచ్చుకోబోయింది. అబ్బాయి  పే రెత్తగానే ఆవేశం ఆపు కోలేక చెడామడ తిట్టేశా. ఏడుస్తూ పెట్టేసింది. వారమయ్యాక చేసింది. నా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ నెలలోనే పెళ్లి' అంటూ గుండెల్లో బాకు దింపింది.     ఎందుకిలా చేశావంటే  'నేనూ నీలాగే ఆలోచించా. నాకు పెద్దలే ముఖ్యం అనిపించి వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినట్టే విన్నా' అంది.
తనకోసం ఎంత చేశ? ఇద్దరి భవిష్యత్తుకోసం ఎంతో కష్టపడ్డా. తను కట్టుకోబోయే పట్టుచీర దగ్గర్నుంచి ఇంట్లో వాడే సామన్లాదాకా ప్రతిదీ  కొన్నా. వాళ్ళు ఇబ్బందులు పడితే దాచుకున్న డబ్బులు పంపించా. అన్నీ   మరిచిపోయి౦ది. నా కలల్నికాలరాచింది. పెద్దల్ని ఒప్పించి  పెళ్ళాడాలను కోవడమే నా తప్పా? వేరే అబ్బాయితో అదేపనిగా మాట్లాడోద్దనడమే నేరమా?  ఈ  బాధతో కుంగిపోయి పదేపదేతప్పులు చేయడంతో ఉన్న ఉద్యోగమూ ఉండింది. 

తుది పరిచయం.....
           పేరు పండు. కుదురుగా ఉండలేక దొరికిన ప్రతి పని చేస్తున్నా.ఇప్పుడు నాకు లేని వ్యసనం లేదు. మంచి పేరు పోగొట్టుకోవడం ఇష్టంలేక  ఊరెల్లడమే మానేశా. 
   ఇంతకీ ఆ మెస్సేజ్ లో ఏంముందంటే నేను ఇప్పుడు వినాలి అనుకునే మాట. తను ఎప్పుడు చెప్పాలి అనుకునే  మాట. "ఈ సందెపూట నీఅందమైన నోటితో ­­­చెప్పెయ్.. నేనెంత ఇష్టమో." మెసేజ్ డిలీట్ అయిపోయింది. టైం  ఒంటిగంట. దాటింది. నా నడక, జీవితo గమ్యంలేని రోడ్డువైపు నడక  సాగిస్తున్నాయి.

Tuesday, 30 August 2016

చెప్పలేదేం తల్లీ? అంత చేదయ్యామా..


సర్వం అనుకున్న కూతురు ప్రాణం ఉసూరుమనేలా చేసింది. వెలకట్టలేని మమకారం పంచినా ప్రేమ మైకంలో కన్నప్రేమనే ధిక్కరించింది. ఆ సంఘటనతో ఎంతటి క్షోభకి గురయ్యాడో చెబుతున్నాడో తండ్రి!కంగారు.. భయం.. సంతోషం.. అన్నీ కలగలిపి టెన్షన్‌తో అటూఇటూ తిరుగుతున్నా. లోపల పురిటినొప్పులతో నా భార్య. పదినిమిషాలయ్యాక ‘కంగ్రాట్స్‌ మీకు పాప’ంటూ కబురు. మహలక్ష్మి పుట్టిందనుకుంటూ మురిసిపోయా. ఆపై నా ప్రతిరూపాన్ని గర్వంగా గుండెలకు హత్తుకున్నా.
నా బంగారుతల్లి పుట్టిన మహత్యమేమో అన్నీ కలిసొచ్చేవి. తనతో రోజూ పండగే. తను ఏడిస్తే నాకు బాధ. నవ్వితే సంతోషం. తన కోసం గుర్రాన్నయ్యా.. పిల్లిలా అరిచా. అలిగితే కానుకనయ్యా. మంచి సమయం చూసి మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టేశా. రెండున్నరేళ్ల నా నిరీక్షణ ఫలించి నా చిట్టితల్లి ‘నాన్నా’ అంది. నా జీవితంలో అదే బెస్ట్‌ డే.
పేరు లక్ష్మినే కానీ చదువులో సరస్వతి. ఐదులో క్లాస్‌ఫస్ట్‌ వచ్చింది. టీచర్లు తనకిచ్చిన గిఫ్ట్‌ అందుకొని ప్రపంచకప్పు గెలిచినంత సంతోషంగా యాభై మందికి చూపించా. ఏడులో ఆటల పోటీల్లో గెలిస్తే ఓ మెమొంటో ఇచ్చారు. ఆ పూట ఏం తినకుండానే నా కడుపు నిండింది. పదిలో తొంభైశాతం మార్కులొస్తే వూరంతా మిఠాయిలు పంచా. పైచదువులకు బిడ్డ పట్నం వెళ్తుంటే ముఖం పక్కకు తిప్పుకొని వెక్కివెక్కి ఏడ్చా. ‘డాడీ నిన్ను చూడాలనుంది’ అనడమే ఆలస్యం రెక్కలు కట్టుకొని వాలిపోయేవాణ్ని. ఇంటర్‌లో మంచి మార్కులొచ్చాయని బహుమతిగా నేనే ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చా. మా ఇద్దర్ని కలుపుతుందనుకున్న ఆ పాడు వస్తువు మా అనుబంధంలో చిచ్చు పెడుతుందని వూహించలేకపోయా.
రెండో ఏడాది పరీక్షలు రాసి ఇంటికొచ్చింది కూతురు. రాగానే ఎప్పట్లాగే నన్ను హత్తుకోలేదు. మనసారా పలకరించలేదు. అమ్మపైనా ప్రేమ చూపదే! ఎప్పట్లాగే తనని గారాబం చేయబోతుంటే ‘మీవన్నీ పాత పద్ధతులు. కొత్తగా ఆలోచించండీ’ అంటూ చిన్నబుచ్చుకునేది. తన ప్రవర్తన కొత్తగా అనిపించినా తనన్నదే నిజమనుకొని మిన్నకుండిపోయా. ఓరోజు ఫ్రెండ్‌ పెళ్లికెళ్తానంది. ‘తోడురానా తల్లీ’ అనడిగా. ‘వ్వాట్‌ డాడ్‌.. నేనింకా చిన్నపిల్లనా?’ అని కసురుకుంది. నా మొహం చిన్నబోయింది. ఇక రోజులో పద్దెనిమిది గంటలు సెల్‌ఫోన్‌తోనే గడిపేది. అనుమానమొచ్చి స్నేహితురాలిని విచారించా. నా గుండె పగిలే మాట చెప్పిందా అమ్మాయి. నా బంగారం ఒకబ్బాయిని ప్రేమిస్తోందట. తట్టుకోలేక ‘ఇది నిజమేనా తల్లీ?’ అనడిగా. కోపంతో వూగిపోయింది. ‘అబద్ధం. అయినా నీకు అనుమానం వస్తే నన్నడగాలిగానీ నా ఫ్రెండ్‌ని అడుగుతావా?’ అని విరుచుకుపడింది.
ఓరోజు ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లొస్తానంది. సాయంత్రం, రాత్రి అయినా రాదే! గుండెలదిరిపోయాయి. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌. ‘మా ఇంటికి రాలేదంకుల్‌’ అంది ఫ్రెండ్‌. పిచ్చివాళ్లలా అర్థరాత్రుళ్లూ తిరుగుతూనే ఉన్నాం. తెల్లవారుతుండగా ఓ కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌. నా చిట్టితల్లే. ఆతృతగా అడిగాం ఎక్కడున్నావని. ‘నేను పెళ్లి చేసుకున్నా. నన్ను వెతకొద్దు’ అంటూ పెట్టేసింది. ఆ క్షణం నా శ్వాస ఆగిపోతే బాగుణ్ణనిపించింది. నెంబర్‌ పోలీసులకిచ్చి కేసు పెట్టాం. సిటీ నుంచి వచ్చిందన్నారు. ఆరోజే పరుగెత్తుకెళ్లాం. తిరిగితిరిగి కాళ్లు చతికిలబడ్డాయి. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. జాడ మాత్రం లేదు. కొన్నాళ్లయ్యాక చిరునామా తెలిసినా ఏం చేయలేకపోయాం.
పిల్లను అదుపులో పెట్టుకోలేకపోయారన్నారంటూ బంధువులు, చుట్టుపక్కల ఎత్తిపొడుపులు. ఆ బాధతోనే అర్థాంగి మంచం పట్టింది. అయినా మా కష్టం తనకి పట్టలేదు. ఇరవై ఏళ్లు మేం పంచిన మమకారం కన్నా ఏడాదో, రెండేళ్లొ ఆ అబ్బాయి ఇచ్చిన ప్రేమే గొప్పదైంది. కానీ ‘డాడీ! నేను ఆ అబ్బాయిని ప్రేమించా’ అని ఒక్కమాట చెప్పి ఉంటే ఆలోచించేవాణ్ని. నా కూతురికి తగ్గవాడైతే కాళ్లు కడిగేవాణ్ని. కానీ అంతా అయిపోయింది. తను గడప దాటేముందు క్షణం మా గురించి ఆలోచించి ఉంటే ఈ క్షోభ తప్పేదే. అయినా ఇప్పటికీ తను బాగుండాలనే కోరుకుంటున్నాం. ఎంతైనా కన్నవాళ్లం కదా!
- ఓ తండ్రి.

చెలి గేలిచేసింది...జీవితం గెలిచేసింది!

మనసుపడ్డ అమ్మాయికో ముద్దుపేరు పెట్టుకున్నాడు. కొన్నాళ్లు చాట్లాటలయ్యాక ఐలవ్యూ చెప్పాడు. అప్పటిదాకా బాగానే స్పందించిన అమ్మాయి ఖఠాఠ్‌... నీకేం అర్హతలున్నాయని ప్రేమించాలి?’ అంది. ఆ మాటను ఛాలెంజ్‌గా తీసుకున్న కుర్రాడు ప్రభుత్వోద్యోగం సంపాదించాడు. తర్వాతేంటి?
మ్మా, నేను... జీవితం సాగిపోవడానికో చిన్న ఉద్యోగం. ఇదీ నా ప్రపంచం. జాలీగా గడిచిపోతున్న సమయంలో తన పరిచయం వూహించని మలుపులకు కారణమైంది. ఫేస్‌బుక్‌ ద్వారా నా జీవితంలోకి వచ్చింది ఆమె. వరుసకు బంధువులమ్మాయే. ముద్దుగా ఖస్టార్‌’ అని పిలిచేవాణ్ని.
ఖహాయ్‌ ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌?’ అంటూ ఓరోజు తెలియని నెంబర్‌ నుంచి మెసేజ్‌. కొద్దిరోజుల దాగుడుమూతలయ్యాక ఖనేను నీ స్టార్‌ని’ అంది. తనపై మొగ్గలా ఉన్న ప్రేమ పువ్వులా వికసించింది. ఉదయం నాలుగుతో మొదలై అర్ధరాత్రైనా మామధ్య సందేశాల వరద పోటెత్తుతూనే ఉండేది. ఖనా గురించి అసలు ఏమనుకుంటున్నావ్‌?’ ఉరుములేని పిడుగులా అడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్‌. ఖనువ్వుంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అనేశా. మౌనమే తన సమాధానం. ఆపై ఎఫ్‌బీ చాటింగ్‌, మెసేజ్‌లు అన్నీ బంద్‌. ఆమె మనసులో నాకు స్థానం లేదని అర్థమైంది.
 ఒకరు వద్దంటే వదిలే రకం కాదు నేను! రోజూ తన కాలేజీ చుట్టూ చక్కర్లు కొట్టేవాణ్ని. పిలుపొస్తుందనే ఆశతో. కొన్నాళ్లయ్యాక వచ్చింది. కానీ వాళ్ల అమ్మనుంచి. ఖమా అమ్మాయిని సతాయిస్తున్నావట. ఇంకోసారలా చేస్తే బాగుండదు’ అని బెదిరిస్తూ. కోపం, కసి పెరిగాయి. ఖనేనంటే ఎందుకిష్టం లేదు? అసలు నాలో ఏం తక్కువ?’ ఓసారి నేరుగా అడిగా. దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఖచదువు, ఉద్యోగం, ఆర్థికపరిస్థితి ఎందులో నువ్వు నాకంటే ఎక్కువ? అసలు నీలో ప్రేమించడానికి ఏం ఉంది?’ అని. బాగా ఆలోచిస్తే తను చెప్పిందే నిజమనిపించింది.
పోటుగాడిలా పోటీ పరీక్షల పుస్తకం అందుకున్నా. ఏడాది బాగానే కష్టపడ్డా. అవతలి వాళ్లు నాకన్నా ఎక్కువ చదివారేమో! ఫలితాల్లో నా పేరు లేదు. కాళ్లావేళ్లాపడి పాత కొలువులోనే చేరా. కానీ ప్రతిక్షణం గుర్తొచ్చేది. తను అన్నమాటలే మనసుని ఈటెల్లా గుచ్చేవి. ఆ బాధ, నేనేం సాధించలేననే అపనమ్మకం... వెరసి విఫల ఆత్మహత్యా యత్నం చేశా. అప్పుడే కుటుంబసభ్యులు నాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమైంది. ఖనువ్వు ఉద్యోగం చేయకపోయినా ఫర్వాలేదు. ఇలాంటి పిచ్చిపనులు చేయొద్ద’ని ఏడ్చారు. తప్పు చేశాననిపించింది.
తర్వాతేంటి? నేను ఎదగాలి! కానీ... మళ్లీ ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నాల్లో పడిపోయా. సీతారాముల్ని కలిపిన ఆ ఆంజనేయుడి కాయిన్‌ను నా ప్రేమ గుర్తుగా పంపా. లంకాదహనం మా ఇంట్లో జరిగింది. ఖఇంకోసారి ఇలాంటి పిచ్చివేశాలేస్తే జైళ్లొ ఉంటావ్‌’ ఉరిమింది వాళ్లమ్మ. గొడవ పెద్దది కాకుండా అక్క రాయబారం నడిపింది. ఖపాపం అమ్మాయి... వదిలెయ్‌రా. ముందు తను కోరుకున్నట్టు నిన్ను నీవు నిరూపించుకో’ అంది. దగ్గరుండి ప్రోత్సహించింది. కోచింగ్‌కి సాయం చేసింది. ఈసారి కచ్చితంగా ఏదో సాధించి తీరాలనే కసి నా మనసులోకి ప్రవేశించింది.
మావాళ్ల ఆశీర్వాదం... నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఏడాదయ్యాక నాకు ప్రభుత్వోద్యోగం దక్కింది. నేను గెలిచాను అని తనకి చెప్పాలనుకున్నా. ఒక కొత్త సిమ్‌ కొని నాపేరు చెప్పకుండా ఖనాకు ఉద్యోగం వచ్చింది’ అని మెసేజ్‌ పంపా. తను పసిగట్టేసింది. ఖఆల్‌ ది బెస్ట్‌. నేనూ అమెరికన్‌ కంపెనీలో చేరా’ అని రిప్లై ఇచ్చింది. ఇదే అదనుగా మళ్లీ తన వెంటపడాలని మాత్రం ప్రయత్నించలేదు. తనకు తానుగా నా చేయి అందుకోవాలని కోరిక.
తెలిసో తెలియకో తనకి స్టార్‌ అని పేరు పెట్టుకున్నా. ఆకాశంలో మెరిసే నక్షత్రంలా ఉంటుందని. కానీ ఆ స్టార్‌ని ఎప్పటికీ చేరలేనని చాన్నాళ్ల తర్వాత అర్థమైంది. ఏదేమైనా నన్ను మార్చిన తనకి ధన్యవాదాలు.

వంచన నాదే... వగచేదీ నేనే!

ఇంటర్లో మొదలయ్యాయి నాలో ప్రేమ వూసులు. అందుక్కారణం చంద్ర. నా క్లాస్‌మేట్‌. అందంగా, అణకువగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. క్లాసులో తనెక్కడున్నా నా కళ్లు వెతికేవి. మనసు మూగగాఆరాధించేది. ‘ఈరోజైనా అతడితో నా ప్రేమ విషయం చెప్పాలి’ ఇలా రోజూ అనుకునేదాన్ని. ఆగిపోయేదాన్ని. ఎందుకంటే తను ‘నో’ అంటే తట్టుకోలేను!
ఓ సబ్జెక్టులో సందేహం ఇద్దర్నీ కలిపింది. తర్వాతే అర్థమైంది నేననుకున్నట్టు తను మరీ నెమ్మదేం కాదు! నోరు విప్పితే వసపిట్ట. కొత్త విషయాలెన్నో చెబుతుండేవాడు. చూస్తుండగానే కాలేజీ ముగింపుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయదల్చుకోలేదు నేను. ఓ శుభసమయాన ఆ మూడక్షరాల పదం పలికేశా. ‘నువ్వంటే నాకూ ఇష్టమే. కానీ మన ప్రేమ, పెళ్లి జరిగే పరిస్థితుల్లేవు’ ఒక్కమాటలో తేల్చేశాడు. ఏడుపాగలేదు. అయినా నేనేంటే ఇష్టమే అన్నాడుగా... ఎలాగైనా తను నా సొంతమవుతాడంది మనసు.
డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. మూడేళ్లలో ఒక్కరోజు విడిచి ఉండలేదు. కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడున్నాం. పెళ్లికాని భార్యాభర్తల్లా మెలిగాం. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగవేటలో పడిపోయాం. ఈలోపు అక్క పెళ్లి కుదిరింది. తనని పిలిచి ఇంట్లోవాళ్లకి పరిచయం చేద్దామనుకున్నా. కానీ ఎందుకో భయమేసి ఆగిపోయా.
నాకుద్యోగం వచ్చింది. తనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను కొలువులో చేరాక నాకో కొత్త ప్రపంచం కనపడింది. నాలాగే నలుగురైదుగురు కొలీగ్స్‌ ప్రేమలో ఉన్నారు. తర్వాత పెళ్లాడింది మాత్రం వేరే అబ్బాయిల్ని. తల్లిదండ్రుల్ని కష్టపెట్టలేమని.. కులం అడ్డొచ్చిందని.. అబ్బాయిది మంచి హోదా అని రకరకాల కారణాలు చెప్పారు. ఆ మాటలు నాపై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. చంద్రకి నాకు మధ్య చాలా అడ్డుగోడలు. వాట్ని నేను బద్ధలు కొడతానేమోగానీ పెద్దల అంగీకారం ఉండదేమో అనిపించింది. స్వార్థమో, భయమో నేనూ సహోద్యోగుల బాటలో వెళ్లాలనుకున్నా.
ఒకప్పుడు చంద్ర మాట కోసం తపించే నేను మీటింగ్‌, పని ఒత్తిడంటూ రకరకాల అబద్ధాలు చెప్పి తననుంచి తప్పించుకునేదాన్ని. అయితే ఓరోజు విడవకుండా ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. చిరాకుతో ఫోన్‌ ఎత్తా. ‘నాకుద్యోగం వచ్చింది. వెంటనే మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతా’ అన్నాడు సంతోషంగా. నా గుండెలదిరాయి. ఆ పూటకి ఏదోలా మేనేజ్‌ చేశా. తర్వాత ఏడాదిపాటు ఇదే తంతు. ఆఖరికి నువ్వంటే ప్రాణం అన్న నోటితోనే ‘నువ్వు నాకు నచ్చలేదు. మన పెళ్లి జరగద’ని తెగేసి చెప్పా.
కన్నవాళ్లు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి మంచి కూతురనిపించుకున్నా. మంచి భార్యగా సమాజం గౌరవిస్తోంది. కానీ నా మనసు సంద్రంలో రోజూ చెలరేగుతన్న లక్షల భావోద్వేగాలు నన్ను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త ప్రేమ చూపించినప్పుడల్లా చంద్ర గుర్తొచ్చి మనసు కకావికలమవుతోంది. భర్తనీ, ప్రియుడ్నీ మోసం చేశాననే అపరాధభావం అనుక్షణం వేధిస్తోంది. పైగా చంద్ర నాపై చూపిన పెద్దమనసు ముందు నేనెంత అల్పురాలినో తలచుకొని కుంగిపోతున్నా. ఆఖరిసారి తనకి ఫోన్‌ చేసినపుడు మరోసారి ఆలోచించమని కన్నీళ్లతో అర్థించాడేగానీ నాపై కోపం చూపించలేదు. మేం సన్నిహితంగా దిగిన ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయలేదు. ఇప్పటికీ తను నాపై అంతే ప్రేమతో ఉంటాడని తెలుసు.
తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డా. నిర్ణయం తీసుకోవాల్సిన వయసులో పెద్దవాళ్లు గుర్తొచ్చారు. ఇప్పుడు నన్ను నేనే మోసం చేసుకున్నాననే భావనలో కొట్టుమిట్టాతున్నా. అందుకే పెద్దల్ని ఒప్పించే ధైర్యం ఉంటేనే ప్రేమలో పడండి. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో అయితే జీవితాంతం నాలాగే నటించాల్సి ఉంటుంది.

సినిమా కల..జీవితం విలవిల

తొలి ప్రేమ. నాకు సినిమాలపై ప్రేమ పుట్టించిన తొలి సినిమా. తెరపై ఆడే బొమ్మలు మనసునీ ఆడిస్తాయని అప్పుడే అర్థమైంది.
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు మాది. చదువులో చురుకైన విద్యార్థిని. మొదట్లో థియేటర్‌కెళ్లడం తక్కువ. తొలిప్రేమ తర్వాత మాత్రం ఏ సినిమానీ వదల్లేదు. ప్రతి డైలాగ్‌, ప్రతి సీన్‌ కంఠతా వచ్చేసేది. ‘ఫలానా స్టార్‌ డైరెక్టర్‌ది మన పక్క వూరే’, ‘ఆ హీరో ఇక్కడివాడే’ ఇలాంటి మాటలతో నా రోమాలు నిక్కబొడుచుకునేవి. వాళ్లలా జనం నా గురించి గొప్పగా చెప్పుకోవాలనిపించేది.
మూడేళ్లు గడిచాయి. ఆరా తీస్తే మా బంధువొకాయన ఇండస్ట్రీలో ఉన్నాడని తెలిసింది. ఆ భరోసాతో ఫిల్మ్‌నగర్‌లో వాలిపోయా. బీటెక్‌ ఫైనలియర్‌ పరీక్షలు వదిలేసి మరీ. ఇంట్లోవాళ్లు ఎంతమొత్తుకున్నా విన్లేదు. హీరో అవుతానంటే ‘ముందు ఏదో ఒక డైరెక్టర్‌ దగ్గర పెట్టిస్తా. పరిచయాలయ్యాక హీరోగా ప్రయత్నిద్దువులే’ అన్నారు బంధువు. వారంలోపే ఓ దర్శకుడి దగ్గర చేర్పించారు. కెమేరాలు మోయడం, హీరోహీరోయిన్లు ఏ సీన్‌లో ఏ డ్రెస్‌లు వేసుకున్నారో గుర్తుపెట్టుకోవడం, కప్పులు కడగడం ఇదీ నా పని. రెండునెలలకే తెచ్చుకున్న ఇరవైవేలు కరిగిపోయాయి. నాన్నే నెలనెలా ఖాతాలో డబ్బులేసేవారు.ఆర్నెళ్ల పురిటినొప్పులు పూర్తై సినిమా విడుదలైంది. అట్టర్‌ఫ్లాప్‌ టాక్‌. తెరపై నా పేరూ పడ్డా నాకు తప్ప వేరొకరికి గుర్తులేదు. ఇంకోచోట ప్రయత్నం మొదలుపెట్టా. ‘ఖాళీల్లేవ్‌’ బోర్డులు వెక్కిరించేవి. కొందరు దగ్గరికే రానిచ్చేవారు కాదు. కష్టాల డోసు పెరిగింది. ఇంట్లోంచి డబ్బులు రావడమూ తగ్గాయి. ఓ పూట తినడం, మరోపూట పస్తులు. అయినా ప్రయత్నాలు ఆపలేదు.
అన్నట్టు నాకో లవ్‌స్టోరీ ఉంది. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సిటీకెళ్తుంటే ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది తను. తర్వాత ‘ఎందుకీ కష్టాలు. వదిలేసి వచ్చెయ్‌. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుందువుగానీ’ అనేది. విన్లేదు. ఐదారునెలలకి మరో చోట చేరా. అసిస్టెంట్‌గానే. పెద్ద బ్యానర్‌, స్టార్‌హీరోతో క్లాప్‌ కొట్టాం. ఈ దెబ్బతో దశ తిరిగిందనుకున్నా. నా దురదృష్టం.. ఏవో కారణాలతో ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. మెల్లిగా నాపై నాకు నమ్మకం సడలసాగింది. లవర్‌ చెప్పింది విని కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. చేతిలో డిగ్రీ కూడా లేదు. అటెండర్‌కి తప్ప దేనికీ పనికిరానన్నారు. మళ్లీ సినిమా వేట మొదలైంది. ఆరేళ్లలో ముగ్గురు దర్శకుల దగ్గర పనిచేశా. అసిస్టెంట్‌ నుంచి అసోసియేట్‌కు ఎదిగా. సొంతంగా కథలు రాసుకొని హీరోలు, నిర్మాతల చుట్టూ తిరిగా. కొందరు కథ బాగున్నా డేట్స్‌ లేవన్నారు. ఓ యువహీరో తప్పకుండా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. తర్వాత ఆయన రెండు సినిమాలూ ఆడకపోవడంతో తనకే అవకాశాల్లేకుండా పోయాయి. వీటన్నింటికన్నా ఓ నిర్మాత మాటలు నన్ను బాగా బాధించాయి. ‘చాన్నాళ్లుగా నిన్ను గమనిస్తున్నా. నీలో ఫైర్‌ లేదయ్యా. అందరితో కలిసిపోలేవు. ఇండస్ట్రీకి సూట్‌ కావు’ అన్నారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ కష్టానికి తోడు పుండుమీద కారం చల్లినట్టు ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్లైందని తెలిసింది. తను మాత్రం ఎన్నాళ్లని నాకోసం ఎదురుచూస్తుంది?
సినిమా ఆశలు ఆవిరయ్యాయి. ఇంటికెళ్లడానికి మొహం చెల్లలేదు. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ కూడా లేదు. అప్పుడే ఓ మిత్రుడు దేవుడిలా ఆదుకున్నాడు. ఆర్థికసాయం చేసి వెబ్‌డిజైనింగ్‌ కోర్సులో చేర్పించాడు. శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరా. సినిమాలపై ప్రేమ చావక అప్పుడప్పుడు ఘోస్ట్‌ రైటర్‌గానూ పనిచేస్తున్నా. ప్రస్తుతం సినిమా కష్టాలేం లేవు. కానీ వయసు మీరింది. పెళ్లాడ్డానికి ఏ అమ్మాయి ముందుకు రావట్లేదు. అనుభవంతో చెబుతున్నా. కలలు కన్న ప్రతి ఒక్కడూ హీరో కాలేడు. అలా కాకపోయినా బతకగలిగే ఓ ప్రత్యామ్నాయం కూడా ఆలోచించుకోవాలి. ఈ పరాజితుడి నుంచి కూడా పాఠాలు నేర్వొచ్చనే మీ ముందుకొచ్చా.

Saturday, 27 August 2016

ప్రేమ కాదు గురూ!

నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ.. సౌభాగ్య... ఈ పేరు వినగానే మనసుకు రెక్కలొచ్చేవి. పాదాలు స్టెప్పులేసేవి. గుండె లవ్‌లవ్‌ అని కొట్టుకునేది. అది ఒకప్పుడు. ప్రస్తుతం ఆ పేరు వింటేనే కంపరం, బాధ... అన్నింటికి మించి కోపం. ఎందుకిలా అంటే నా గాథ వినాల్సిందే. 
‘అన్నయ్యా! మన పక్క వూరిలో ఉండే ప్రవీణ్‌ నన్ను సతాయిస్తున్నాడు. కాలేజీ నుంచి వస్తుంటే రోజూ ఫాలో అవుతున్నాడు’ చెల్లి ఫిర్యాదుతో కోపం నషాళానికంటింది. వార్నింగ్‌ ఇవ్వాలని వాడింటికి పరుగెత్తా. గుమ్మంలోనే ఓ అమ్మాయి ఎదురొచ్చింది. ఏంజెల్లా ఉన్న తనను చూసి మెలికలు తిరిగిపోయా. ‘హలో ఎవరు కావాలి? విషయమేంటి?’ తను గద్దించేసరికి నా కర్తవ్యం గుర్తొచ్చింది. ప్రవీణ్‌ గురించి అడిగా. తమ్ముడంది. ‘మీవాడు మా చెల్లి వెంట పడుతున్నాడట. అదుపులో పెట్టుకో. తీరు మారకపోతే ఎముకలిరుగుతాయ్‌’ గెట్టిగానే చెప్పా. తమ్ముడికి చీవాట్లు పెడుతుందనుకుంటే తనేమో రివర్స్‌లో వచ్చింది. ‘మీ చెల్లి నచ్చిందేమో? ప్రేమించడం నేరమా’ అంది. తన సమాధానంతో నాకు ఆశ్చర్యంతోపాటు చిరాకేసింది. ‘అయితే నువ్వూ అందంగానే ఉన్నావ్‌. నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే వూర్కుంటావా?’ అన్నా. ‘పడూ... నచ్చితే నేనూ ప్రేమిస్తా. లేదంటే నో చెబుతా’ అంతే వేగంగా దూసుకొచ్చింది సమాధానం. ఇంకేం మాట్లాడలేక అక్కణ్నుంచి కదిలా.
తన మాటలు నన్ను కవ్వించాయ్‌. ప్రేమలో పడమని ప్రేరేపించాయ్‌. ఏదో పని కల్పించుకొని తన చుట్టూ తిరిగా. ఆకాశరామన్నలా సందేశాలు పంపా. ‘ఎందుకీ డొంక తిరుగుడు ప్రయత్నాలు... విషయమేంటో సూటిగా చెప్పు’ అందోసారి. క్షణం ఆలస్యం చేయకుండా ‘నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా’ అన్నా. నాకు మంచి ఉద్యోగం ఉంది. బాగానే ఉంటాననే నమ్మకం. పైగా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో కాదనదు అనే నమ్మకం. నాల్రోజుల్లో చెబుతానంది. అన్నట్టుగానే ‘నీ లవ్‌లో నిజాయతీ కనిపిస్తోంది. ఐ టూ లవ్యూ రా’ అంది. ఇక నా ఆనందానికి అడ్డేముంది? సౌభాగ్య అమ్మమ్మది మా వూరే. కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని వచ్చింది. మాకిక అడ్డంకి లేకుండా పోయింది. చెరుకు మడులు, మామిడి తోటలు, పంట చేలు మా ప్రేమకు వేదికలయ్యేవి. ‘రేయ్‌ మామా తను చాలా ఫాస్ట్‌రా... నీకు సరిపోదేమో’ నా ఫ్రెండ్స్‌ సందేహించేవాళ్లు. నేను పట్టించుకుంటేగా!
నెలలు గడిచాయి. మంచి రోజులొచ్చాయని పెళ్లి మాటెత్తారు అమ్మానాన్నలు. సౌభాగ్యని అడిగా. ‘పెళ్లా? చేస్కుందాం. కానీ మనిద్దరం కాదు. వేరేవాళ్లని’ అనేసరికి నా గుండె బేజారైంది. ‘నువ్వు విన్నది నిజమే. సిటీలో చదువుకున్నపుడు నీలాగే ఇంకో అబ్బాయి నన్ను ప్రేమించాడు. ఇప్పుడు తను నీకంటే మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అతడ్నే చేస్కోవడం కరెక్ట్‌ కదా!’ అనేసరికి నాకు ఏడుపొక్కటే తక్కువ. మరి మన ప్రేమ, కలిసి తిరగడం సంగతేంటి అంటే ‘టేకీటీజీ యార్‌... లైట్‌ తీస్కో’ అంది. ‘అన్నట్టు ఏ ప్రియుడైనా తన లవర్‌ సంతోషం కోరుకుంటాడట. ఇంకోసారి నువ్వు నా జీవితంలోకి రావనుకుంటున్నా’ అభ్యర్థనో, ఆజ్ఞో అర్థంకాని విధంగా ఓ మాట చెప్పింది. తను ఏ విషయమైనా సూటిగా మాట్లాడుతుందని తెలుసుగానీ ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుందనుకోలేదు.
తన మోసం నన్ను చాలా బాధించింది. కొన్నాళ్లు దేవదాసునయ్యా. కానీ ముందూవెనకా ఆలోచించేవాణ్ని కావడంతో తొందర్లోనే తేరుకున్నా. వయసులో ఉన్నపుడు అమ్మాయి, అబ్బాయిలు ఏవో కొన్ని మాటలకు ఆకర్షితులవడం... కలిసి తిరగడం... దాన్నే ప్రేమని పొరపడటం... తీరా ఎవరో ఒకరు హ్యాండివ్వగానే ఏడవడం. అనుభవపూర్వకంగా చెబుతున్నా ఇది ప్రేమకాదు కేవలం ఆకర్షణే. నిజం తెలుసుకోండి. విలువైన సమయం వృథా కానీవ్వకండి.

Tuesday, 23 August 2016

దూరమైంది ప్రియనేస్తం.. చేరువైంది విజయం


‘ప్రేమలో గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే పెళ్లవుతుంది. ఓడిపోతే... ఏదో సాధించి చూపించాలనే కసి పుడుతుంది’ అంటున్నాడో కుర్రాడు.
2014లో డిగ్రీ పూర్తైంది. కన్నవాళ్లకు ఇంకా భారంగా ఉండటం నాకిష్టం లేదు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఓ శిక్షణాసంస్థలో చేరా. గ్రూప్స్‌, బ్యాంకు, రైల్వే ఉద్యోగాలతోపాటు పలు ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చేవారక్కడ. క్లాసులో కొత్తగా చేరిన ఒకమ్మాయిని చూడగానే నా గుండె లయ తప్పింది. చాలాసార్లు మాట కలపాలని ప్రయత్నించినా ధైర్యం చాల్లేదు. ఓరోజు అనుకోకుండా ఎదురుపడితే ‘హాయ్‌’ చెప్పా. కనీసం మొహం చూడకుండానే వెళ్లిపోయింది. అవమానంగా ఫీలయ్యా. ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్‌ చేయాలనే పంతం పెరిగింది. తను రోజూ మా హాస్టల్‌ ముందు నుంచే క్లాసుకెళ్లేది. ఆమె ఏ రంగు డ్రెస్‌ వేసుకుందో చూసి నేనూ అదే రంగు వేసుకొని వెళ్లేవాణ్ని. అయినా పట్టించుకుంటేగా!
ఓరోజు నోటీసుబోర్డులో మార్కుల జాబితా చూస్తోంది. మంచి ఛాన్స్‌ అనుకుంటూ వెళ్లి ‘క్లాస్‌ ఫస్టా? సెకండా?’ చొరవగా పలకరించా. ఎప్పట్లాగే మొహం చిట్లించింది. ఇక లాభం లేదని అక్కణ్నుంచి కదులుతుంటే ‘నేను వేసుకునే కలర్‌ డ్రెస్సే నువ్వూ వేసుకుంటున్నావ్‌. ఏంటి సంగతి?’ అంది. అక్కడే గెంతులేయాలన్నంత సంతోషం. అయినా ఏం మాట్లాడకుండా అక్కణ్నుంచి జారుకున్నా. స్కూటీపై తన నిక్‌నేమ్‌ రాసుండేది. ఆ ముద్దుపేరుతోనే సంబోధించానోసారి. ‘ఫర్లేదు.. తెలివైనవాడివే. నాకోసం చాలానే కష్టపడుతున్నావ్‌’ అని మెచ్చుకుంది. ఇక నేను రెచ్చిపోవడానికి లైసెన్స్‌ దొరికినట్టే అనుకున్నా. కానీ నా దురదృష్టంకొద్దీ అప్పుడే ఓ పరీక్ష కోసం వేరే వూరెళ్లాల్సి వచ్చింది. పదిరోజులు క్లాసుకు హాజరు కాలేకపోయా. అదీ నా మంచికేనని తర్వాత అర్థమైంది.
‘ఏంటి ఎక్కడికెళ్లావ్‌? చెప్పి వెళ్లాలనే కామన్‌సెన్స్‌ లేదా?’ రాగానే నన్ను వూపేస్తూ అడిగింది. గాల్లో తేలిపోయా. ఆరోజే మా ఫోన్‌ నెంబర్లు తర్జుమా అయ్యాయి. ఆపై చాటింగ్‌లు.. మీటింగ్‌లు.. సినిమాలు.. షికార్లు.. కామనయ్యాయి. కోర్సు పూర్తికాకముందే మనసులూ ఇచ్చిపుచ్చుకున్నాం. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నాం. ‘మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా? నువ్వు నన్ను మోసం చేయవుగా’ అనేది బేలగా. ‘నిన్నొదిలితే నా ప్రాణం వదిలినట్టే’ అభయమిచ్చేవాణ్ని. ఆ ప్రేమ అలాగే కొనసాగితే మేం ఈపాటికే భార్యాభర్తలయ్యేవాళ్లం. జరిగింది వేరు.
ఏమైందో తెలియదుగానీ కోర్సు పూర్తై ఇంటికెళ్లాక మాట్లాడ్డం మానేసింది. నేనది తట్టుకోగలనా? ఫోన్లు చేశా. ‘ఎందుకు మా అమ్మాయి వెంటపడుతున్నావ్‌?’ వాళ్ల నాన్న నిలదీశారు. ఇంటిచుట్టూ తిరిగా. ‘ఇంకోసారి కనపడితే జైళ్లొ ఉంటావ్‌’ బెదిరించారు. అయినా ప్రియసఖిని మర్చిపోవడం నావల్ల కాలేదు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గింది. మరోవైపు ఉద్యోగం సంగతి ఏమైందని ఇంట్లోవాళ్ల ఒత్తిడి. ఎంజాయ్‌ చేయడానికే కోర్సులో చేరావంటూ సన్నిహితుల వెక్కిరింపులు. వెరసి తనపై పీకల్దాకా కోపం పెరిగింది.
ఆమెది మోసమో, ఇంట్లోవాళ్ల ఒత్తిడితో అలా చేస్తుందో అర్థం కాకపోయేది. కానీ నా ప్రేమ విలువ తెలియాలంటే.. తనే నా దగ్గరికి పరుగెత్తుకు రావాలంటే ఏదైనా సాధించి చూపించాలనే కసి మొదలైంది. అందుకు ఏకైక మార్గం జాబ్‌ కొట్టడం. వెంటనే పుస్తకం అందుకున్నా. రాత్రీపగలు మరచి ఐదునెలలు చదివా. నా కష్టం ఫలించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఇప్పుడు నేను వూహించనంత గుర్తింపు, గౌరవం, ప్రశంసలు దక్కుతున్నాయి. నన్ను దూరం పెట్టి పరోక్షంగా నా విజయానికి కారణమైంది తనే. ఇప్పటికీ ఆమెకు దగ్గరవ్వాలనే కోరుకుంటున్నా. 

బైక్‌ కలిపింది మా ఇద్దరినీ!


క్లాస్‌మేట్‌ పెళ్లి కోసం వూరెళ్తున్నా. సిటీ దాటుతుండగా పార్కింగ్‌ చేసిన బండికి తాళం వేయలేదనే సంగతి గుర్తొచ్చి గుండె జల్లుమంది. అసలే మోజు పడి కొన్న కొత్త పల్సర్‌. ఇన్సూరెన్స్‌ కూడా లేదు. వెంటనే ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశా. ‘నిన్ననే వూరెళ్లాన్రా’ వాడి మాటతో డీలా పడిపోయా. ‘ఓసారి నా ఫ్రెండ్‌కి కాల్‌ చెయ్‌. హెల్ప్‌ చేస్తాడు’ అంటూ ఓ నెంబరిచ్చాడు. ప్రాణం లేచొచ్చింది.
క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్‌ కలిపా. ‘హలో.. ఎవరు?’ అందో అమ్మాయి గొంతు. ఫ్రెండ్‌ ఫ్రెండ్‌ భార్యో, చెల్లినో అనుకొని విషయం చెప్పా. ఇక్కడ అలాంటి పేరుతో ఎవరూ లేరంది. ఏదో వంకతో మాటలు కలిపే ఇడియట్స్‌ ఎక్కువయ్యారంటూ తిట్టింది. అసలే బాధలో ఉన్న నాకు తన మాటలు చిరాకు తెప్పించాయి. బండి నెంబర్‌ చెప్పి ‘నీతో సోది మాట్లాడ్డానికి ఫోన్‌ చేయలేదు. డౌట్‌ ఉంటే వెళ్లి చెక్‌ చేస్కో. ముందు మర్యాదగా మాట్లాడ్డం నేర్చుకో’ అంటూ దులిపేశా. తప్పుడు నెంబర్‌ ఇచ్చిన ఫ్రెండ్‌నీ వాయించా.
‘మా ఇల్లు బస్టేషన్‌ దగ్గరే. తమ్ముడు వెళ్లి బైక్‌కి తాళం వేశాడు. వూరొచ్చాక కీ తీస్కెళ్లొచ్చు’ ఓ గంటయ్యాక మెసేజ్‌ పంపిందా అమ్మాయి. థాంక్స్‌తోపాటు ముందు జరిగిందానికి సారీ చెప్పా. మర్నాడు స్నేహితుడి పెళ్లి ఘనంగా జరిగింది. సాయంత్రం ఆలస్యం కావడంతో ఆ రాత్రే తిరిగొద్దాం అనుకున్నా కుదరలేదు. తర్వాతరోజు ఉదయం బస్సు దిగగానే నేరుగా ఆఫీసుకెళ్లిపోయా. మర్నాడు నా వీక్లీ ఆఫ్‌. కొన్ని పండ్లు కొనుక్కొని అమ్మాయి చెప్పిన అడ్రెస్‌కి వెళ్లా. గుమ్మంలోనే ఎదురొచ్చింది. సమంతలా అందంగా లేకపోయినా కాజల్‌లా పెద్దకళ్లతో ఆకట్టుకునేలా ఉంది. అప్పుడప్పుడు బుగ్గల్లో సొట్టలుపడి ఆకర్షణీయంగా కనపడుతోంది. ‘ఇంకాస్త ముందొస్తే బాగుండు. మావాళ్లతో కలిసి గుడికెళ్లేదాన్ని’ మొహం చిట్లిస్తూ చెప్పింది. సారీ చెప్పి పండ్ల కవర్‌ చేతికిస్తుంటే ‘ఇలాంటి ఫార్మలిటీసేం అక్కర్లేదు. మీరు దయచేస్తే నేను బయటికెళ్తా’ కొట్టినట్టే చెప్పింది.
గదికొచ్చాక రోజంతా తన ఆలోచనలే. ఆపై అప్పుడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాణ్ని. ఎప్పుడో ఓసారి బదులిచ్చేది. ఓసారి ప్రేమ, పెళ్లిపై అభిప్రాయం అడిగా. ‘అమ్మానాన్నల్ని కష్టపెట్టే ప్రేమ నాకు నచ్చదు. వాళ్లు చెప్పిన అబ్బాయినే పెళ్లాడతా’ అంది. ఆ మాటతో ఆమెపై మరింత ప్రేమ పెరిగిపోయింది. తర్వాత ఏమైందో తెలియదుగానీ కొద్దిరోజులకే నాతో మాట్లాడ్డం మానేసింది. తట్టుకోలేకపోయా. ఓరోజు నేరుగా వాళ్లింటికెళ్లా. బైక్‌ హారన్‌ కొడితే బయటికొచ్చింది. సంతోషంతో చేతులూపుతూ హాయ్‌ చెప్పా. కొరకొరా చూసి ‘గెటౌట్‌’ అనేసి లోపలికెళ్లిపోయింది. నా మొహం మాడిపోయింది.
ఆ రాత్రే ఫోన్‌ చేసింది. నీకు సాయం చేయడమే తప్పైందంటూ మొదలుపెట్టింది. ‘ఆరోజు నువ్వు మా ఇంటికొచ్చినపుడు పక్కింటివాళ్లు చూసి నాన్నకి చెప్పారట. తర్వాత మనం అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం గమనించి తప్పుగా అర్థం చేసుకున్నారు. పరువు తీస్తున్నావ్‌ అని నాన్న బాధ పడ్డారు’ అని ఏడుస్తూ చెప్పింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. తర్వాత బాగా ఆలోచించాక ఓ నిర్ణయానికొచ్చా.
‘ఈరోజే నాకు పెళ్లిచూపులు. దయచేసి ఇంకోసారి ఫోన్‌ చేయొద్దు. మా ఇంటి వైపు రావొద్దు’ ఓ పొద్దునే తన సందేశం. నవ్వుతూ సరేనన్నా. ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పెళ్లిచూపుల కుర్రాడ్ని నేనేనని. తను నాకిష్టమైన అమ్మాయి. పెద్దలంటే గౌరవం. సాయం చేసే గుణముంది. ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? పైగా మా సామాజికవర్గమే. అమ్మానాన్నల్ని ఒప్పించి వాళ్లతో మాట్లాడించా. నా గురించి ఆరా తీసి ఓ వారమయ్యాక వాళ్లూ ఓకే అన్నారు. ఈ ఎపిసోడ్‌లో అందరికన్నా ఆశ్చర్యపోయింది మాత్రం ఆ అమ్మాయే. పెళ్లిచూపులు సక్సెస్‌ అయ్యాయి. ఈనెల చివరి వారంలో మా పెళ్లి. మీరంతా ఆశీర్వదించండి. అన్నట్టు నా జీవితాన్ని ప్రేమ తీగలా అల్లుకోబోతున్న అమ్మాయి పేరు లత.

విఫలమైన ప్రేమకు.. భారమైన వీడ్కోలు!


డిగ్రీ మొదటి రోజు. రవీ... పిలుపుతో నాతో పాటూ ఇంకో అబ్బాయీ ‘ప్రెజెంట్‌ మేడమ్‌’ అన్నాడు. తనదీ నా పేరే. సాయంత్రం మాట కలిపా. తొందర్లోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం.
ఫస్టియర్‌లో రవి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చాడు. నేను థర్డ్‌. నాకు మూడోస్థానం వచ్చిందని వాడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఇలాంటి ఫ్రెండ్‌ దొరికినందుకు నేను సంతోషించా. నా విషయంలోనే కాదు... తను అందరూ బాగుండాలనుకుంటాడు. తన వల్ల ఎవరు బాధపడ్డా తట్టుకోలేడు.
రవి మంచివాడు, పైగా తెలివైనోడు. సహజంగానే అమ్మాయిల దృష్టిలో పడ్డాడు. అలా ఓ అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ‘రేయ్‌... నీలాంటోడు ప్రేమలో పడొద్దు... తేడా వస్తే దేవదాసువైపోతావ్‌’ సరదాగా మందలించేవాణ్ని. నవ్వేవాడు. తను ప్రేమించిన అమ్మాయికి ఏం గిఫ్ట్‌ ఇవ్వాలి? ఎక్కడికి తీస్కెళ్లాలి? ప్రేమని ఎలా వ్యక్తం చేయాలి? ప్రతీదీ అడిగేవాడు. తోచింది చెప్పేవాణ్ని.
సెకండియర్‌లో నా మార్కులు పెరిగితే, రవివి తగ్గాయి. పైగా క్లాస్‌ బంక్‌లూ ఎక్కువయ్యాయి. ప్రేమలో పడితే ఇవన్నీ 
మామూలేగా అనుకున్నా. చివరి ఏడాదిలో అయితే వాడి నెంబరే గల్లంతైంది. అడిగితే ‘బాగా రాయలేదు... అందుకే ఫెయిలయ్యా’ తేలిగ్గా చెప్పేశాడు. జీవితంలో మొదటిసారి రవిపై విపరీతమైన కోపమొచ్చింది. ప్రేమలో పడి చదువును నిర్లక్ష్యం చేశావని బాగా తిట్టా. తర్వాత ముభావంగా ఉండేవాడు. నాతో మాట్లాడ్డం తగ్గించాడు. గతంలోలాగా ఏ విషయం షేర్‌ చేసుకోవడం లేదు. తిట్టినందుకు నొచ్చుకున్నాడేమోనని సారీ చెప్పా. ‘ఛఛ అదేం లేదురా. నన్ను తిట్టే అధికారం నీకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది?’ అన్నాడు. ‘మరెందుకు నీ ప్రవర్తన మారింది. అసలేం జరిగిందో చెప్పమ’ని నిలదీశా. నోరు విప్పాడు.
‘లవ్‌లో ఫెయిలైన నా స్కూల్‌ ఫ్రెండ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. అందరం కలిసి కాపాడాం. అయినా చస్తానని బెదిరిస్తున్నాడు. వాడేమైపోతాడో అని బాధగా ఉందిరా’ అంటూ అసలు విషయం చెప్పాడు. వీడి బాధ చూడలేక ‘చచ్చేవాడు చెప్పి చావడు, బెదిరించడు. చావాలంటే చాలా ధైర్యం కావాలి. తన గురించి ఆలోచించడం మానెయ్‌’ అన్నా. ఆ క్షణం వాడి మొహంలో బాధ మాయమైంది. ‘థాంక్యూరా. నా ఫ్రెండ్‌ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. వాడికిక ఏ బాధా ఉండదు’ అంటూ నన్ను గుండెలకు హత్తుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత రవి మొహంలో ఆనందం చూశా.
‘మీ కాలేజీ స్టూడెంట్‌ ఎవరో లారీ కిందపడి చనిపోయారటగా’ వూరి నుంచి ఫోన్‌ వస్తే ఆదుర్దాగా టీవీ ఆన్‌ చేశా. ఆ విద్యార్థి ఎవరో కాదు నా ప్రాణనేస్తం రవీనే. ఏడుస్తూ బయటికి పరుగెత్తా. వాడు పోయిన నాలుగోరోజు నాకో ఉత్తరం వచ్చింది. ఎలా పంపాడో, ఎప్పుడు పంపాడో తెలియదుగానీ అది రవి నుంచే. ‘నన్ను క్షమించరా! ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను ఉండకపోవచ్చు. నువ్వు ఎంత చెబుతున్నా వినకుండా ప్రేమలో పడ్డా. నాకంటే అందగాడు, ఆస్తిపరుడు తనకు దొరకగానే నన్ను మర్చిపో అంది. ప్రాణం, జీవితం అనుకున్న అమ్మాయిని మర్చిపోవడం ఎలారా? ఇంకోసారి మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసు కంప్లైంట్‌ ఇస్తానంది. ఆ క్షణం నుంచే చస్తూ బతుకుతున్నా. ఇవన్నీ నీతో చెబితే డిస్ట్రబ్‌ అవుతావని చెప్పలేదు. అన్నట్టు నీకు నా ఫ్రెండ్‌ గురించి చెప్పాను కదా... అది నేనే. నన్ను ఓదార్చడానికి నువ్వు ఇచ్చిన సలహా నాకు నచ్చింది. ఇందులో నీ తప్పేం లేదు. ఒక స్వార్థపరురాలి చేతిలో దారుణంగా మోసపోయినందుకు నాకు నేను విధించుకుంటున్న శిక్ష. కడదాకా నీతో స్నేహితుడిగా ఉండలేకపోయినందుకు నన్ను క్షమించరా. ఇట్లు నీ రవి’ చదవడం పూర్తయ్యేసరికి ఉత్తరం కన్నీళ్లతో తడిసిపోయింది.
‘నువ్వు పోతే నిన్ను వంచించిన అమ్మాయి ఇంకో అబ్బాయిని వెతుక్కుంటుంది. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు చెట్టంత కొడుకు తిరిగిరాలేడు’ ఎక్కడో చదివినట్టు గుర్తు. రవి ఈ విషయం తెలుసుకోలేక వాళ్లకి దుఃఖమే మిగిల్చి వెళ్లాడు. వాడిలా వైఫల్యాన్ని తట్టుకోలేని పిరికివాళ్లు ప్రేమ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అర్ధిస్తున్నా.

Friday, 29 July 2016

మారాను నేను... మన్నించు నన్ను!


నా అనుభవం చదివాక చాలా మందికి నాపై అసహ్యం వేయొచ్చు. కొందరు జాలి చూపొచ్చు. కానీ మీరు నాలా ఉండొద్దన్నదే నా కోరిక అంటున్న ఓ యువకుడి అంతరంగం ఇది...
నేను దినేశ్‌. చదువు, అందంలోనే కాదు... అమ్మాయిల్ని ఆకర్షించి నా చుట్టూ తిప్పుకోవడంలోనూ ఫస్టే. ఇలా చేయడం తప్పని నేనెపుడూ ఫీల్‌ కాలేదు. పైగా నా టాలెంట్‌కి గర్వపడేవాణ్ని.
డిగ్రీ పూర్తై పీజీలో చేరా. నా టార్గెట్‌ అమ్మాయిలే. ఇంతలో తులసి పరిచయమైంది. తను అందరికన్నా భిన్నం. ఇవ్వడమేగానీ తీసుకోవడం తెలియదు. ‘నేనింతవరకు ఏ అమ్మాయి మొహం చూడలేదు’ అంటే నమ్మేసింది. ‘నువ్వంటే నాకు ప్రాణం’ అనగానే గుండెలపై వాలిపోయింది. తన నిస్వార్థ ప్రేమ చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేసేది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనుకునేవాణ్ని. ఏదేమైనా తులసితోనే ఏడడుగులు నడవాలని ఫిక్సయ్యా. కానీ మనం మారాలనుకున్నా మన అలవాట్లు మారనివ్వవు. పాత గాళ్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, మీటింగ్‌లు చాటుమాటుగా కొనసాగుతూనే ఉండేవి.
పీజీ పూర్తైంది. పెద్దల్ని ఒప్పించి తులసిని పెళ్లాడా. మూణ్నెళ్లు సాఫీగానే సాగింది సంసారం. తర్వాతే మొదలయ్యాయి లుకలుకలు. కొడుకు కట్నం కోసం ఆశ పడ్డ నాన్న ఉత్తి చేతులతో వచ్చిన కోడల్ని సహించేవాడు కాదు. ఇది కాకుండా ఓ పాత స్నేహితురాలితో సరస సంభాషణలు చేస్తూ పట్టుబడ్డా. భార్య దేన్నైనా సహిస్తుందిగానీ భర్త ఇంకొక అమ్మాయితో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేదని అప్పుడే అర్థమైంది. అమాయకురాలు అపరకాళిక అయ్యింది. తన ముందు దోషిగా నిలబడ్డం నాకేమాత్రం నచ్చలేదు. ‘నా భార్య నన్ను అనుమానిస్తోంది’ అంటూ అమ్మానాన్నలతో అడ్డంగా అబద్ధం ఆడేశా. అసలే తనపై కడుపుమంటతో ఉన్నవాళ్లు అనుమానించే పెళ్లాన్ని వదిలించుకొమ్మని ఉచిత సలహా ఇచ్చారు.
గొడవలు ముదురుతుండగానే పాప పుట్టింది. కొత్త బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయి. సుఖపడాల్సిన వయసులో ఒక్కసారిగా వచ్చిపడ్డ కష్టాల్ని తట్టుకోలేకపోయా. ఇవన్నీ భరించలేక పిరికివాడిలా తులసికి దూరంగా పారిపోయా. నీతో నాకేం సంబంధం లేదని చెప్పేశా. తనూర్కోలేదు. నాపై కేసు పెట్టి కోర్టుకీడ్చింది. కన్నవాళ్లూ మొహం చాటేశారు. విధిలేక మళ్లీ తనతోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడైనా తప్పు తెలుసుకుంటే నా జీవితం వేరేలా ఉండేది.
పరువు తీసిందని పెళ్లాంపై పగ పెంచుకున్నా. ‘అయిందేదో అయిపోయింది. ఇప్పట్నుంచైనా బాగుందాం’ అని బతిమాలేది. నేను వింటేగా! ‘నీతోనే ఉంటా. కానీ బతికినంతకాలం నీతో కాపురం చేయను’ అని శపథం చేశా. మళ్లీ నా పాత జీవితంలోకి వెళ్లిపోయా. ఇదేంటని అడిగితే తిట్టేవాణ్ని, కొట్టేవాణ్ని. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుందట. ఎన్నాళ్లని నన్ను భరిస్తుంది తను. ‘మీకు నచ్చినట్టుగా మీరుండండి. మారమని అడగను. నేనూ మీతో మాట్లాడను’ అందోరోజు. ఒకే ఇంట్లో ఒంటరులమయ్యాం.
ఏడేళ్లు గడిచాయి. నేను చేసిన పాపం ఫలితమేమో కొన్ని కారణాలతో నా ఉద్యోగం వూడింది. తల్లిదండ్రులు, తమ్ముడి దగ్గరికెళ్తే ‘ఏరి కోరి పెళ్లి చేసుకున్న పెళ్లాం ఉందిగా. మమ్మల్నెందుకు సాయం అడుగుతున్నావ్‌?’ అనేవారు. ఇప్పుడు నా భార్యే ఉద్యోగం చేస్తూ నన్ను, పాపని పోషిస్తోంది. మానసికంగా, శారీరకంగా తనని ఎంతో హింసించినా నాకు మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. కానీ మౌనం తప్ప మా మధ్య మరేం లేవు. కొద్దిరోజుల్లోనే నా పరిస్థితి, నా భార్య గొప్పదనం అర్థమైంది. పూర్తిగా మారిపోయాను. ‘తప్పు చేశా. మునుపటిలా కలిసి మెలిసి ఉందాం’ అని బతిమాలా. ఒప్పుకోలేదు. ‘ఇంతకాలం నీవల్ల నాకే సుఖం దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు? పాప కోసమే బతుకుతున్నాను. అలాగే బతకనివ్వు’ అంది. కానీ తను తప్పకుండా మారుతుందనే ఆశతోనే బతుకుతున్నా.
ప్రేమించడబడటం ఒక గొప్ప వరం అంటారు. తులసి నన్ను ప్రేమించినంతకాలం నాకు ఆ విలువ తెలియలేదు. విలువ తెలిసే సమయానికే ఆమె మనసు విరిగింది. నా జీవితం నాలాంటి భర్తలకు కనువిప్పు కావాలి.

ఆమె మనసు... నలుపు


అందం మనసుకి సంబంధించింది... శరీరానికి కాదు. ఈ నిజం తెలుసుకోలేక బలైపోయానంటున్న ఓ యువకుడు.
‘అమ్మాయి రంగు తక్కువ. మరోసారి ఆలోచించరా’ నసుగుతూనే ఉంది అమ్మ. నేనేం పట్టించుకోలేదు. తన మనసు నాకు నచ్చింది. అంతే. ‘అమ్మాయి నచ్చింది’ మరో మాటెత్తకుండా చెప్పేశా. పెళ్లిచూపులు ముగిశాయి.
నెల కిందటే పరిచయమైంది తను. మొహంపై చెరగని చిరునవ్వు. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆమె సొంతం. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు అరుదు. ఇదే చెప్పి పెద్దల్ని ఒప్పించా. రంగు తక్కువని గొణిగినా నా బలవంతంతో ఒప్పుకున్నారు. ముహూర్తం పెట్టేసుకున్నాం. నెలరోజుల్లో పెళ్లి.
రోజులు గడుస్తున్నా అమ్మ అసంతృప్తి తగ్గలేదు. ‘అమ్మాయి నలుపు. నాకు నచ్చలేదు’ రోజుకు పదిసార్లైనా గుర్తు చేసేది. విధిలేక ‘మీరు చూసిన అమ్మాయినే చేస్కుంటా’ అని కన్నవాళ్లకి మాటిచ్చా. మొదటి సంబంధం కాన్సిల్‌ అయింది.
తొందర్లోనే నా జీవితంలోకి ఓ అందగత్తె వచ్చింది. కోడల్ని చూసి అమ్మ మురిసిపోయేది. తనతో బయటికెళ్తే నేనూ గర్వపడేవాణ్ని. కానీ తను ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏమందో తెలుసా? ‘ఇది ఇల్లా? ఓల్డేజీ హోమ్‌నా?’ అంది అమ్మమ్మ, నాన్నమ్మలను ఉద్దేశించి. మా గుండెలదిరాయి. ఆ ఒక్కరోజే కాదు... ప్రతిరోజూ తూటాల్లాంటి మాటలతో మా మనసుల్ని ఛిద్రం చేసేది. ఏరోజు ఏం వినాల్సి వస్తుందో అని హడలిపోయేవాళ్లం. నోటికి ఏది వస్తే అది వాగేది. మనుషులంటే లెక్క లేదు. నెల తిరిగేలోపే స్వర్గంలాంటి ఇంటిని నరకం చేసింది.
వేరు కాపురం పెడితే తను మారుతుందనుకుంది అమ్మ. పెట్టాక అదీ జరగలేదు. మీ అమ్మానాన్నలతో మాట్లాడొద్దు... కలవొద్దు... అని షరతులు పెట్టేది. ఒక్కగానొక్క కొడుకు జీవితాన్ని నాశనం చేశానని అమ్మ ఏడ్వని రోజు లేదు. తన టార్చర్‌ భరించలేక ఓరోజు ఆత్మహత్యా యత్నం చేసి ఓడిపోయా. దీంతో తన దృష్టిలో మరింత చులకనయ్యా. చేతకానివాడిననేది. గృహహింస కేసు పెడతానని బెదిరించేది.
మూడేళ్లు గడిచాయి. ఇప్పటికీ నాకు అవే కష్టాలు. మరోవైపు నేను వదులుకున్న అమ్మాయి భర్తతో, పండంటి బాబుతో వూళ్లొ నా కళ్లముందే తిరుగుతోంది. తనని చూసినప్పుడల్లా మనసుకి రంపపు కోత. మేం పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అన్నపుడు మాపై గొడవకు దిగలేదు. హుందాగా సెలవు తీసుకుంది. నన్ను మరుగుజ్జును చేసింది. అంతమంచి అమ్మాయిని వదులుకున్నందుకు ఇప్పుడు అందరం బాధ పడుతున్నాం. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? మనం చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది అబద్ధం. ఇప్పుడే అనుభవించి తీరాలి. నేనే నిదర్శనం.

Friday, 15 July 2016

నిజం...మా ఆయన బంగారం


పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి చాలా ఆశలుంటాయ్‌. కలలుంటాయ్‌. చేసుకోబోయేవాడు అందగాడు, ఆస్తిపరుడై ఉండాలని కోరుకుంటారు. నేనూ అందరిలా వూహల్లో తేలిపోయేదాన్ని.
నాకో కజిన్‌ ఉండేది. నా వయసే. ఒకేలా ఆలోచించేవాళ్లం. డిగ్రీ కాగానే తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇద్దరిలో ఒకరి కల నెరవేరింది. కొద్దిరోజులకే నా వంతు. ‘అబ్బాయిఅందంగా ఉంటాడు. నెలకి ఎనభైవేల జీతం. ఆస్తిపరులు’ నాన్న చెబుతుంటే నా పాదాలు గాల్లోకి లేచాయి. చివర్లో ‘కానీ’ అంటూ ఆగిపోయారు. నాలో కంగారు. ‘తను కొంచెం హ్యాండీక్యాప్డ్‌. సర్దుకుపోవాలమ్మా’ అనడంతో గుండె కలుక్కుమంది. ‘నాకీ సంబంధం వద్దు’ క్షణం ఆలోచించకుండా చెప్పేశా. రెండ్రోజులు మౌనవ్రతం చేశా. ‘ఇంతకంటే మంచి సంబంధం తేలేనమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఎవరితోనూ పోల్చి చూసుకోవద్దు’ చేతులు పట్టుకొని అర్థించారు నాన్న. జలజలా కన్నీళ్లు రాలాయి.
ముహూర్తం పెట్టుకున్నాం. నా కష్టాలు మొదలయ్యాయి. మంచి సంబంధం దొరికింది అన్నవాళ్లే అవిటివాడ్ని చేసుకుంటోందని చాటుగా గుసగుసలాడుకునేవాళ్లు. ఈ బాధలో నేనుంటే ఆయన ఫోన్‌. మాట్లాడ్డం ఇష్టంలేక ఏదో చెప్పి తప్పించుకునేదాన్ని. ఈ బాధలోనే పెళ్లి కూడా జరిగిపోయింది. ఏదైనా ఫంక్షన్‌కెళ్తే నా కజిన్‌ జంటని ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అనేవాళ్లు. నాకేమో జాలి చూపులు. ఇది భరించేక నా జీవితం త్వరగా ముగిస్తే బాగుండు అనుకున్నరోజులున్నాయి. నా మనసులో ఉన్నది మా ఆయనకు తెలియదు కదా! నన్ను ఇంప్రెస్‌ చేయడానికి తెగ ప్రయత్నించేవారు.
పెళై్ల ఏడాదైంది. ఓసారి మా ఇంటికి బంధువులొచ్చారు. నా కజిన్‌ కాపురం బాగా లేదన్నారు. తన భర్త రోజూ తాగొచ్చి గొడవ చేస్తాడనీ, జల్సాలకు చాలా ఖర్చు చేస్తున్నాడని చెప్పారు. బాధేసింది. ‘తనతో పోలిస్తే నువ్వు అదృష్టవంతురాలివి. మీ ఆయన చాలా మంచోడు’ అన్నారు. మొదటిసారి మా ఆయన గురించి మనస్ఫూర్తి ప్రశంస విన్నా. అది నాకో టానిక్‌లా పనిచేసింది. నిజంగా నా భర్త అంత మంచివారా? ఆలోచనలు మొదలయ్యాయి. ఎంగేజ్‌మెంట్‌ నుంచి ఆయన్ని దూరంగా పెడుతున్నా. చిరాకు పడుతున్నా. మా ఆయన మాత్రం నన్ను ఒక్క మాట అన్లేదు. పైగా ఏ లోటూ రాకుండా ప్రేమగా చూసుకునేవారు. ఆలోచిస్తుంటే నేనెంత అమానుషంగా ప్రవర్తించానో బోధ పడింది. ఆరోజు నుంచే మారాలనుకున్నా.
ప్రతి వీకెండ్‌, ప్రతి ఫంక్షన్‌కి ఆయనతో కలిసి బయటికెళ్లేదాన్ని. ఇష్టంగా, మనస్ఫూర్తిగా. ఈ మార్పు చూసి నా భర్త చాలా సంతోషించారు. ఇంతలో ఆయనకు జర్మనీ వెళ్లే అవకాశమొచ్చింది. దేశం దాటాక మా మధ్య అన్యోన్యత మరింత పెరిగింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చేవరకు ఎదురుచూడటం... సరదాగా బయటికెళ్లడం... భలే థ్రిల్లింగ్‌గా ఉండేది. ఇద్దరం కలిసి దిగిన ఫొటోల్ని అప్పుడప్పుడు సరదాగా ఫేస్‌బుక్‌లో పెట్టేదాన్ని. ‘మీ ఆయన హీరోలా ఉన్నాడే’ అనేవారు ఫ్రెండ్స్‌. నాలో కొత్త అనుమానం మొదలైంది. ‘మీరు ఏ అమ్మాయినైనా ప్రేమించారా?’ అడిగానోసారి. తిండికీ లేని నేపథ్యం... బడికి కిలోమీటర్లు నడిచి వెళ్లిన రోజుల గురించి చెప్పారు. మంచిస్థాయికి చేరడం కోసం కాలేజీ రోజుల్లో చదువు తప్ప వేరేవాటిపై దృష్టి పెట్టలేదన్నారు. నా కళ్లు చెమర్చాయి.
ఏడాదిలో మా ఆయన ప్రాజెక్ట్‌వర్క్‌ విజయవంతంగా పూర్తైంది. ఇండియా తిరిగొచ్చాం. రిసీవ్‌ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు చాలామంది ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. మా ఆయనతోపాటు నన్నూ పొగడ్తల్లో ముంచెత్తారు. అదీ మనస్ఫూర్తిగా. ఒక గొప్ప వ్యక్తి భార్యగా నేనెంతో పొంగిపోయా. ఇంటికొచ్చాక విన్న ఓ వార్త కలవరపాటుకి గురి చేసింది. చెడు అలవాట్లతో నా కజిన్‌ భర్త ఆస్తి మొత్తం కరిగించాడట. కుటుంబం గడవడానికి తను ఉద్యోగం చేస్తుందని తెలిసింది.
నేను గొప్ప స్థానంలో ఉన్నానని చెప్పడానికి మీ ముందుకు రాలేదు. జీవిత భాగస్వామి ఎంపికలో అందం, ఆస్తి ఒక్కటే ప్రామాణికం కాదు. గుణగణాలు, వ్యక్తిత్వం అంతకన్నా ముఖ్యమని అనుభవంతో చెబుతున్నా.
Like our Page and Download Our App.
https://www.facebook.com/NaaLoveStory/
https://play.google.com/store/apps/details?id=com.app.naalovestory

ప్రేమతో.. నో చాటింగ్‌! నో టాకింగ్‌!


మరదలిపై మనసు పడ్డాడో బావ. మాటలు కలిపినా కలవడం కుదరదంది మరదలు. పట్టుపడితే చిత్రమైన షరతు పెట్టింది. ఏంటది? అబ్బాయి మాటల్లోనే.
‘వన్‌ ఇయర్‌ నాతో మాట్లాడొద్దు. చాట్‌ చేయొద్దు. అలా చేస్తే నేనే వచ్చి నిన్ను కలుస్తా’ మరదలి మాట నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అది తలచుకున్నప్పుడల్లా మనసును మెలిపెట్టే బాధ. ఏడాది తనతో మాట్లాడకుండా ఎలా ఉండాలా అని. చెప్పలేనంత సంతోషం కూడా. సంవత్సరం గడిస్తే తను నాకు దక్కుతుందని.
డిగ్రీ దాకా నేనూ అందరిలాంటోడినే. చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. కో-ఎడ్‌ కాకపోవడంతో అమ్మాయిలతో పెద్దగా మాట్లాడింది లేదు. చదువయ్యాక పోలీసు కావాలనే లక్ష్యంతో కోచింగ్‌ తీసుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో నాకో మరదలు ఉందని తెలిసింది. తనువంతా ఉద్వేగం. ఏవో గొడవలతో మామయ్య కుటుంబానికి, మాకు రాకపోకల్లేవ్‌. ఇప్పుడు తన గురించి తెలియగానే చూడాలి, కలవాలనే ఉబలాటం. తన నోటి నుంచి ‘బావా’ అనే పిలుపు వినాలనే తపన.సిటీలో బీటెక్‌ చదివేది తను. కలుసుకోవడం ఎలా అనుకుంటుంటే ఫేస్‌బుక్‌ దారి చూపింది. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే మర్నాడే ఆమోదించింది. ‘ఎక్కడుంటావ్‌? ఏం చేస్తావ్‌?’ ప్రశ్నలు సంధించా. అంతే వేగంగా స్పందించింది. నేను తన బావనని చెప్పలేదు. అన్నట్టు మా ఇద్దరి బ్లడ్‌ గ్రూప్‌, పుట్టినవారం, నచ్చిన ఆట, ఇష్టదైవం... అన్నీ ఒకటే. పేర్లూ కలిశాయి. ఇవన్నీ చెబుతుంటే నోరెళ్లబెట్టేది. ‘ఇన్ని ఎలా తెలుసుకున్నావ్‌? నాపై నీకంత ఆసక్తి ఎందుకు?’ అనడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్‌. ‘ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ గురించి ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యమే’ అన్నా. ‘సారీ... నేను ప్రేమించట్లేదుగా’ ఒక్కమాటతో గాలి తీసేసింది. బాధ నుంచి తేరుకుంటూనే నేను నీ బావనని చెప్పా ఆఖరి అస్త్రంగా. అయినా తను పట్టించుకుంటేగా!
తను చిన్నచూపు చూస్తేనేం... నేనొదులుతానా? ఫ్రెండ్‌ సాయంతో తన ఫొటో సంపాదించా. ఫర్వాలేదు... అందంగానే ఉంది. అడక్కముందే నా ఫోటోని పంపా. ఫోన్‌నెంబరూ జత చేశా. మర్నాడే ‘హాయ్‌’ అంటూ మెసేజ్‌. నా ఆనందానికి అవధుల్లేవ్‌. ‘ఫోన్‌ నెంబర్‌ ఇచ్చావు... ఫొటో కూడా పంపొచ్చుగా’ అన్నా ఏమీ ఎరుగనట్టే. ఆ ఛాన్స్‌ లేదు. ఇంకోసారి అడగొద్దంది.
తనకి సెలవులిచ్చారట. చెప్పకుండానే ఇంటికెళ్లిపోయింది. విషయం తెలిసి చాలా బాధపడ్డా. మాటమాత్రమైనా చెప్పొద్దా? అదే అడిగితే ‘నీకు చెప్పాలని ఏమైనా రూల్‌ ఉందా? నా ఇష్టం. మా నాన్న ఇష్టం’ అంది. నేనెంతో తల్లడిల్లిపోతుంటే తనకి అంత నిర్లక్ష్యమా? ‘ఇంకెప్పుడూ నీ గురించి అడగను. జీవితంలో డిస్ట్రబ్‌ చేయను. గుడ్‌బై’ అన్నా కోపంతో. ‘థాంక్స్‌, బై’ తన సమాధానం. కానీ రెండ్రోజులకు మించి తనతో మాట్లాడకుండా ఉండలేకపోయా. కాళ్లబేరానికెళ్లా. ‘సరేలే... ఇంకోసారి పోజు కొట్టకు’ అంది. మనసు కుదుటపడింది.
రోజూ చాట్లాడుకుంటున్నాం. కుదిరినపుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఇంతేనా? మరదల్ని కలవాలని కోరికగా ఉండేది. తనేమో కుదరదనేది. నాకు పట్టుదల పెరిగిపోయేది. ‘నన్ను కలవాల్సిందే. దాని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అన్నానోసారి ఆవేశంగా. అదిగో అప్పుడే ఏడాదివరకు మాట్లాడొద్దు, చాటింగ్‌ చేయొద్దనే షరతు పెట్టింది. అలా చేస్తే స్వయంగా వచ్చి కలుస్తానంది. ఇప్పటికి ఆర్నెళ్లు పూర్తయ్యాయి. బాధగా. నా ప్రియమైన ప్రేమకోసం ఇంకో ఆర్నెళ్లు ఎదురుచూస్తూనే ఉంటా. తీయనైన బాధతో.
Like our Page and Download Our App.
https://www.facebook.com/NaaLoveStory/
https://play.google.com/store/apps/details?id=com.app.naalovestory

Wednesday, 6 July 2016

మాటలు మన్నించు...మనసును గమనించు!


ప్పుడు ఇంటర్‌. నాలో ఏం నచ్చిందోగానీ ఓ అమ్మాయి నన్ను తెగ ఫాలో అయ్యేది. ‘రేపు సాయంత్రంలోగా ప్రేమిస్తున్నానని చెప్పకపోతే సూసైడ్‌ చేసుకుంటా’ అందోసారి. జడుసుకొని ఓకే చెప్పేశా. ఆ కొద్దిరోజులకే నా కష్టాలు తీర్చడానికి రాఖీ పండగొచ్చింది. ఆమె ఇంటికెళ్లి అందరిముందే రాఖీ కట్టమన్నా. చేసేదేంలేక కట్టింది. వారం తిరక్కముందే వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టింది. పట్టించుకోలేదు.డిగ్రీ పూర్తై ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నా. ఓరోజు ఓ అమ్మాయి ఫోన్‌ చేసింది. వరుసకు మరదలవువుతానంది. ఆ వంకతో తరచూ కాల్‌ చేసేది. క్యాజువల్‌గా మాట్లాడి అమ్మకిచ్చేవాణ్ని. తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నానంది. లైట్‌ తీసుకున్నా. తర్వాత పైచదువుల కోసం సిటీకెళ్లా. అప్పట్నుంచి నేను చేస్తే తన ఫోన్‌ బిజీ వచ్చేది. ఆరా తీస్తే తను ఇంకో అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసింది. కొంచెం బాధేసింది.

‘మాదాపూర్‌లో కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌ ఉంది. తీస్కెళ్లవూ?’ గోముగా అడిగింది అత్తయ్య కూతురు. నా లైఫ్‌లోకి వచ్చిన మూడో అమ్మాయి. సాయంత్రం తిరిగొస్తుంటే చదువు, ప్రేమ సంగతులు కూపీ లాగింది. స్వచ్ఛంగా ఉండాలనుకునేవాణ్ని కదా! అంతా చెప్పా. ‘నిన్ను కోల్పోయిన రెండో అమ్మాయి దురదృష్టవంతురాలు. నా ప్రేమను ఒప్పుకో. జీవితాంతం తోడుంటా’ అంది. ఆశ్చర్యమేసింది. కొద్దిరోజులు ఆలోచించా. వరుసైందీ, పైగా నా గురించి తెలిసిన అమ్మాయి. పచ్చజెండా వూపా. గెంతులేసింది.
సెలవుల్లో ఇంటికెళ్లా. ‘మీ అత్తయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందట. నాల్రోజుల్లో అతడితో పెళ్లి’ అంది అమ్మ. నాకు షాక్‌. పెళ్లి కూడా ఫిక్సయ్యాక ఇంక తనతో మాట్లాడ్డం వ్యర్థం అనిపించింది. తర్వాత తెలిసిందేంటంటే చాలాకాలం నుంచి అత్తయ్య కూతురు వేరే అబ్బాయిని ‘కూడా’ ప్రేమిస్తోందట. ఈ దెబ్బతో అమ్మాయిలపైనే నమ్మకం పోయింది.
కొన్నాళ్లకి బంధువుల పెళ్లికి వూరెళ్లా. చుట్టాలంతా ఓ అమ్మాయిని తెగ పొగుడుతున్నారు. తనే సీత. అందం, పెద్దలంటే గౌరవం చూపే అమ్మాయి. కుర్రాళ్ల వంక కన్నెత్తి చూడదు. రెండ్రోజులు గమనించాక వాళ్లు చెప్పింది నిజమేననిపించింది. తనే నా భార్యని ఫిక్సయ్యా. అన్నయ్య పెళ్లికార్డు ఇవ్వడానికి మళ్లీ ఆ వూరెళ్లా. ఏదో పనిమీద బయటికెళ్లిందట. కార్డు వెనకాల నా వివరాలు రాసి వాళ్లింట్లో ఇచ్చా. దాదాపు నెలకు నా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌ పంపింది. వెంటనే డయల్‌ చేశా. రిప్లై లేదు. ఆపై ఎన్నిసార్లు ప్రయత్నించానో లెక్కేలేదు.
చాన్నాళ్లకు కరుణించింది. మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ మొదలయ్యాయి. తర్వాత నా గతంతోపాటు మనసులోమాట కూడా చెప్పా. ‘నువ్వు ముందు మా అమ్మానాన్నలకు నచ్చాలి. వాళ్లు ఓకే అంటేనే మన పెళ్లి’ అంది నిర్మొహమాటంగా. కష్టపడి ప్రయత్నించి సీత అమ్మానాన్నల్ని ఇంప్రెస్‌ చేశా. వాళ్లింట్లో ఒకడిగా కలిసిపోయా. మా పరిచయమైన తన మొదటి పుట్టినరోజుకి వాళ్లూరెళ్లా. రాత్రి పన్నెండిటికి నేనే స్వయంగా తనతో కేక్‌ కట్‌ చేయించా. ఆరోజు తనే ‘ఐలవ్యూ సోమచ్‌’ అంది. మనస్ఫూర్తిగా తనని నా గుండెలకు హత్తుకున్నా.
కారణాలేంటో తెలియదు. తను ఫోన్‌ చేయడం తగ్గించింది. నేను చేస్తే ఎత్తదు. చాలారోజులు ఇదేవరుస. పాత అమ్మాయిలు గుర్తొచ్చారు. సీత కూడా అలాంటిదేమో? అనే అనుమానం మొదలైంది. ‘గాళ్స్‌ అంతా ఇంతేరా. వాడుకొని వదిలేసే రకం’ స్నేహితుల మాటలతో విచక్షణ కోల్పోయా. ఆవేశంతో నానా మాటలన్నా. ‘నా మీద నమ్మకం లేకపోతే నన్నొదిలెయ్‌’ అని ఒకే ఒక మాట అంది. కోపం, కసి. నేరుగా వాళ్లింటికెళ్లా. అనారోగ్యంతో ఉంది. ఇతర సమస్యలతో బాధ పడుతోందని తెలిసింది. ఇవన్నీ చెబితే నేను ఎక్కడ బాధ పడతానోనని కొన్నాళ్లుగా నన్ను దూరం పెడుతోందట. నిజం తెలిశాక సిగ్గుతో తలొంచుకున్నా.
ఉద్యోగరీత్యా ఇప్పుడు విదేశంలో ఉన్నా. నా మనసు మాత్రం సీత దగ్గరే ఉంది. తనకేమో నాపై అలక. అనుమానించానుగా... సహజమే! కానీ నా గతం నాతో ఆ పనిచేయించింది. మన్నించి క్షమిస్తే పెళ్లి బాజాలకు సిద్ధమవుతా.

Download Our App from Playstore:
https://play.google.com/store/apps/details?id=com.app.naalovestory&hl=en

Saturday, 25 June 2016

ప్రేమ మధురం... పెద్దలు కఠినం


‘హాయ్‌... నేను స్రవంతిని. ప్రాజెక్టు వర్క్‌ కోసం హైదరాబాద్‌ వస్తున్నా. మీ సాయం కావాలి’ పొద్దునే మెసేజ్‌. అది చూడగానే నా మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా ఓకే చెప్పా.
స్రవంతి... ఆ పేరెలా మర్చిపోగలను? తను ఎంసీఏలో నా జూనియర్‌. అందగత్తేకాదు తెలివైంది కూడా. టాపర్‌గానో, ఏదో పోటీల్లో ఫస్టొచ్చిందనో తన గురించి తరచూ వినేవాణ్ని. సీనియర్‌ననే గౌరవంతో అప్పుడప్పుడు నన్ను పలకరించేది. నేనూ ‘హాయ్‌’ అనేవాణ్ని. అంతవరకే మా పరిచయం.
చదువు పూర్తై కొలువు వేటలో పడ్డా. పెద్దగా కష్టపడకుండానే ముంబయిలో ఉద్యోగమొచ్చింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈమధ్యలో స్రవంతితో ఎప్పుడూ టచ్‌లో లేను. తెలివైన అమ్మాయిగా, జూనియర్‌గా మాత్రం గుర్తుంది. ఇదిగో ఈ సందేశంతో మళ్లీ తన ఆలోచనల్లోకి వెళ్లిపోయా.
ప్రాజెక్టు వర్కు, కొలువు సలహాలు... కారణం ఏదైతేనేం మా మధ్య రోజూ సంభాషణలు కొనసాగేవి. మధ్యమధ్యలో వ్యక్తిగత చర్చలు, అభిరుచులు, అభిప్రాయాలూ పంచుకునేవాళ్లం. నేనుండేది ముంబయి, తనది హైదరాబాద్‌. అయినా పక్కపక్కనే ఉన్నట్టు ఫీలయ్యేవాళ్లం. ఉన్నట్టుండి ‘నన్ను పెళ్లి చేసుకుంటారా సర్‌?’ అనడిగిందోరోజు. నిజం చెప్పాలంటే తనంటే నాకూ ఇష్టమే. అందం, అణకువ, తెలివైన అమ్మాయి ఎవరికి నచ్చదు? కాకపోతే మా నేపథ్యాలు వేరు. తను బాగా ఆస్తిపరురాలు. ఒక్కతే కూతురు. నాదేమో పేద కుటుంబం. అదే మాట చెప్పి ‘ఇది జరిగేపని కాదేమో. నీ ఆలోచన మానుకో’ అన్నా. ‘ఆకర్షణ లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదిది. మీరంటే మనస్ఫూర్తిగా ఇష్టం’ అంది. ఇంట్లోవాళ్లను నేనొప్పిస్తానంది. అంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఒప్పుకున్నా. కానీ ‘మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటేనే మన పెళ్లి’ అని షరతు పెట్టా.
ప్రతి పుట్టినరోజుకి స్రవంతి పేరెంట్స్‌ ఏదో బహుమతి ఇస్తారు. ఈసారి నన్ను భర్తగా ఇమ్మందట. ఠాఠ్‌... వీళ్లేదంది వాళ్లమ్మ. ఆపై వెంటనే నాకు ఫోన్‌ చేసి ‘మాకున్నది ఒకే కూతురు. నీలాంటివాడికి కాకుండా బాగా డబ్బున్నవాడికి ఇవ్వాలనుకుంటున్నాం. తనని మర్చిపో’ అందామె దబాయింపుగా. ‘ఒకర్నొకరం ఇష్టపడ్డాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నాకూ మంచి జాబ్‌ ఉంద’ని ప్రాధేయపడ్డా విన్లేదు. స్రవంతే నన్నోదార్చింది.
నా దురదృష్టంకొద్దీ అప్పుడే నా ఉద్యోగం వూడింది. స్రవంతి జాబ్‌లో చేరింది. తనకి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఎన్‌ఆర్‌ఐ సహా మంచి సంబంధాలొచ్చాయి. నా కోసం అన్నీ వదులుకుంది. ‘మన పెళ్లి కచ్చితంగా జరిగితీరుతుంది’ అని ధైర్యం చెప్పేది. మరోవైపు నా ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఓరోజు అమ్మకి సీరియస్‌ అని ఫోన్‌ రాగానే పరుగెత్తుకెళ్లింది స్రవంతి. అక్కడికెళ్తే అంతా ఉత్తిదే. తిట్టి, కొట్టి పెళ్లికి బలవంతపెట్టారు. నాతో చెప్పి ఏడ్చింది. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. తర్వాత వాళ్లే ఒప్పుకుంటారంది. నేనొప్పుకోలేదు. పాతికేళ్లుగా ప్రాణం పెట్టుకున్న కన్నవాళ్ల పరువు తీయడం నాకిష్టంలేదు. ఎలాగోలా వాళ్లని ఒప్పిద్దాం అని స్రవంతికి నచ్చజెప్పా. తర్వాత మా ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఈమధ్యే తెలిసింది. మేం ఒప్పించడానికింకేం లేదని. స్రవంతి ఆమోదం లేకుండానే వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్‌ చేసేశారు ఆ కఠినహృదయులు.
చాలామంది అమ్మాయిలు డబ్బున్నవాడు దొరకగానే ప్రేమించినవాడ్ని వదిలేస్తారు. కానీ నా స్రవంతి అలా కాదు. పేదవాడినైనా నాకోసం కడదాకా పోరాడింది. అసరమర్థత, అవివేకంతో నేనే తనని దక్కించుకోలేకపోయా. పెద్దల ధనవ్యామోహానికి మా ప్రేమ బలైంది. ఇది చదివాకైనా అలాంటి వాళ్లలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.
Download Our App from Playstore.
https://play.google.com/store/apps/details?id=com.app.naalovestory

Tuesday, 14 June 2016

ప్రేమను అడ్డగించా...పెళ్లికి పెద్దనయ్యా!


సాయంత్రం ఆరున్నరకి బొబ్బిలిలో ట్రెయిన్‌ ఎక్కా. జనంతో బోగీ కిక్కిరిసిపోయింది. సర్దుకునేలోపే తర్వాతి స్టేషనొచ్చింది. పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నట్టుగా ఓ కుర్రాడు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి నా పక్కనే నిలబడ్డాడు. కాసేపయ్యాక ఉబుసుపోక పలకరించా. మాటల్లో తెలిసింది తను మా దూరపు బంధువని.
ఆ కుర్రాడి బ్యాగులోంచి నీటిచుక్కలు కారుతున్నాయి. చెబితే బ్యాగు కిందికి దించి తెరిచాడు. లోపల తడి దుస్తులున్నాయి. అంతకన్నా అందులో ఉన్న అమ్మాయి దుస్తులు నన్నాకర్షించాయి. ఉత్సుకత ఆపుకోలేక ‘ఎవరిదా డ్రెస్‌?’ అన్నా. గాఢంగా నిట్టూర్చి ఫ్లాష్‌బ్యాక్‌ విప్పడం మొదలుపెట్టాడు.
‘ఇంటర్‌ అయ్యాక త్వరగా స్థిరపడొచ్చని ఐటీఐలో చేరాలనుకున్నా. దరఖాస్తు పత్రం కోసం విజయనగరంలోని ఓ కాలేజీకెళ్లా. ఆ పక్క కాలేజీలో ఆరోజు ఏయూ పీజీ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. రంగురంగుల డ్రెస్సుల్లో సీతాకోకచిలకల్లా గుమిగూడిన అమ్మాయిలను చూస్తూ అక్కడే ఆగిపోయా. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి చూపులు నన్ను తాకాయి. తదేకంగా నన్నే చూస్తోందామె. అందగత్తెకాదుగానీ తన మొహంలో ఏదో ఆకర్షణ. ధైర్యం చేసి తనదగ్గరికెళ్లా. ‘మీదేవూరు’ అంటూ మాట కలిపా. అయిదు నిమిషాల్లో ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం.
నా ఇంటర్‌, తన డిగ్రీ పూర్తయ్యాయి. అంటే ఆమె నాకన్నా మూడేళ్లు పెద్ద. మా అనుబంధానికి దీన్నో అడ్డంకిగా భావించలేదు. తను పీజీలో చేరింది. మా ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. తరగతులు ఎగ్గొట్టి మరీ కలుసుకునేవాళ్లం. రోడ్లు, సినిమాలు, హోటళ్లు, పార్కులు... మేం తిరగని చోటు లేదు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదాని కొన్నిసార్లు తొందరపడ్డాం కూడా. తర్వాతేంటి? మావాళ్లెలాగూ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే చెన్నై వెళ్లి అక్కడే ఓ గుళ్లొ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను విశాఖపట్నంలో ట్రైన్‌ ఎక్కుతుంది. ఆమెకోసమే ఈ డ్రెస్‌’ సినిమా స్టోరీలా కథంతా వివరించాడు.
వాళ్లు ఇంట్లోంచి పారిపోతున్నారని నాకర్థమైంది. పైసా సంపాదన లేదు. అంతదూరం వెళ్లి ఎలా బతుకుతారు? ఒకవేళ పాపో, బాబో పుడితే? వూహించుకుంటేనే భయమేసింది. జీవితంపై అవగాహనలేని ప్రాయంలో తప్పు చేస్తున్నారనిపించింది. ఎలాగైనా వాళ్లని ఆపాలనుకున్నా. చాలాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది. ‘ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. నీలాగే తను ఇంకో ఇద్దరు కుర్రాళ్లతో తిరగడం చూశా’ అని అడ్డంగా అబద్ధమాడేశా. ఓ అమ్మాయి గురించి చెడుగా చెప్పడం తప్పే. కానీ ఆ క్షణంలో తప్పలేదు. నా మాట వినగానే ఆ కుర్రాడి మొహంలో రంగులు మారాయి. ‘నిజమే అన్నయ్యా. చాలాసార్లు తన ఫోన్‌ బిజీ వచ్చేది. బహుశా వాళ్లతో మాట్లాడేదేమో?’ అన్నాడు. నేను మరింత రెచ్చిపోయి కట్టుకథలల్లాను. ‘ఏదైనా తేడా వస్తే జైళ్లొ వేస్తార’ని భయపెట్టాను. బెదిరిపోయాడు. అమ్మాయి అక్కర్లేదంటూ వైజాగ్‌ రాకముందే దిగిపోయాడు.
ఆ కుర్రాడ్ని బహుశా జీవితంలో మళ్లీ కలవలేనేమో అనుకున్నా. కానీ కలిశాడు. నేనూహించని షాక్‌ ఇచ్చాడు. ఏడాదయ్యాక ఓరోజు మా ఇంటికొచ్చాడు. ‘అన్నయ్యా... మా పెళ్లికి రావాల’ంటూ ఓ శుభలేఖ చేతిలో పెట్టాడు. పెళ్లికూతురు తను ప్రేమించిన అమ్మాయే. నాకు దిమ్మతిరిగిపోయింది. ‘నువ్వు చెప్పినపుడు నీ మాటలే నిజమనుకున్నా. తర్వాత ఆలోచిస్తే నేను చూడంది నమ్మడం తప్పనిపించింది. నా ప్రేయసి ప్రేమలోనూ తేడా కనిపించలేదు. ఆపై నా అదృష్టంకొద్దీ ఓ మంచి పనిలో చేరా. పెద్దలూ పెళ్లికి ఒప్పుకున్నారు’ అంటూ సంతోషంగా చెప్పాడు. ఆ క్షణం నాలో ఒకింత సిగ్గు, ఒకింత గర్వం.
ఉద్దేశం ఏదైనా ఆరోజు నేను చేసినదాంతో ఆ ప్రేమికులిద్దరికీ మంచే జరిగింది. వాళ్లకు పెద్దల ఆమోదం దొరికింది. జీవితం గాడిలో పడింది. నేనలా చెప్పి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అన్నట్టు వాళ్ల పెళ్లికి కూడా వెళ్లి కొత్తదంపతుల్ని ఆశీర్వదించా. కానీ వాళ్లు చెన్నై పారిపోవాలనుకున్నారనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు.
Like Our Facebook Page:
https://www.facebook.com/NaaLoveStory/

అలుసు చేసి... మనసు మూసి!


కాలంతోపాటూ అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అలా మార్చుకోనివాడు మనిషే కాదు’. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇది నాకూ వర్తిస్తుందని వూహించలేకపోయా.
ఎందుకో తెలియదు. మొదట్నుంచీ నాకు మగాళ్లంటే చిరాకు, కోపం, భయం. ప్రేమ వూసులు మొదలయ్యే కౌమారంలోనూ నా అభిప్రాయం మారలేదు. టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌ సెకండియర్‌ పూర్తయ్యాయి. ఆ తర్వాతే ఓ మిరకిల్‌ జరిగింది. అందుక్కారణం చైతూ. మొదటిచూపులోనే తను బాగా నచ్చేశాడు. ముఖ్యంగా అతడి నవ్వు. నన్నేదో శక్తి ఆవహించినట్టు కొద్దినిమిషాలు అతడ్నే చూస్తుండిపోయా. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. ఆకర్షణ.. పేర్లేవైనా పెట్టుకోవచ్చుగాక. చైతూ నాకు నచ్చేశాడు. మొదటిసారి ఒకబ్బాయికి దగ్గర కావాలనే ఉబలాటం మొదలైంది నాలో. రోజులు వారాల్లోకి మారాయి. చైతూని చాటుమాటుగా గమనించడం నాకలవాటైంది.
‘ఎన్నాళ్లీ నిరీక్షణ?’ నిలదీసిందోరోజు నా మనసు.
నెంబర్‌ కనుక్కొని కాల్‌ చేశాను. మాట పెగల్లేదు. ‘హాయ్‌.. నేను పూజిత. ఎలా ఉన్నావ్‌? చదువు బాగా సాగుతోందా?’ కష్టమ్మీద మూడు ముక్కలు మాట్లాడా. తనూ పెద్దగా స్పందించలేదు. ఆపై మళ్లీ పాత కథే. చూపుల్తోనే సరిపెట్టుకోవడం. ఐదారు నెలలయ్యాక మళ్లీ మాట కలిపా. ఈసారి మాత్రం బాగా ప్రిపేరయ్యా. యోగక్షేమాలయ్యాక ‘నీ నవ్వు బాగుంటుంది. నీతో మాట్లాడ్డం నాకిష్టం’ అన్నా ధైర్యంగా. ఓ అమ్మాయి అలా అంటే ఏ అబ్బాయైనా ఎగిరి గంతేయాలి. కానీ గురుడిలో కదలిక లేదు. ‘థాంక్స్‌’ చెప్పి ఫోన్‌లో ఎర్ర మీట నొక్కేశాడు. నా మనసు నొచ్చుకుంది. బహుశా నేను చెప్పిన విధానం బాగా లేదేమో అనుకొని ఎసెమ్మెస్‌ పెట్టా. ‘నువ్వంటే ఇష్టం. నీతో మాట్లాడాలని ఉంది’ అంటూ. రోజంతా ఎదురుచూసినా సమాధానం లేదు. కన్నీళ్లు పొంగుకొచ్చాయి.

తనతో ఇంకోసారి మాట్లాడొద్దనుకున్నా నావల్ల కాలేదు. పుట్టినరోజు, పండగ, ప్రత్యేక సందర్భం ప్రతిసారీ పిచ్చిదానిలా తనకు ఫోన్‌ చేస్తూనే ఉండేదాన్ని. వెంటపడుతున్నానని చులకనయ్యానేమో? ‘అస్తమానం ఫోనెందుకు చేస్తున్నావ్‌? ఇంకోసారలా చేయకు. చిరాగ్గా ఉంది’ అనేశాడోసారి. ఏడుపాగలేదు. ఎంత గింజుకున్నా తనవైపు నుంచి స్పందన లేదు. అయినా మనసు మారదే! ఓసారి ఫ్రెండ్‌ ఫోన్‌ నుంచి చేశా. అపరిచితురాలిలా మాట్లాడా. బాగానే స్పందించాడు. నేను హ్యాపీ. కానీ అదే నా కొంప ముంచింది. నా స్నేహితురాలు చైతూ నెంబర్‌ సేవ్‌ చేసుకొని నాకు తెలియకుండా పరిచయం పెంచుకుంది. ప్రేమాయణం మొదలుపెట్టింది.
‘నీ ఫ్రెండ్‌ని నాతో పరిచయం పెంచుకొమ్మని నా నెంబర్‌ ఇచ్చావటగా. ఇప్పుడు తనంటేనే నాకిష్టం. ఆమెని లవ్‌ చేస్తున్నా. ఇంకోసారి నాకు ఫోన్‌ చేయకు’ అని చైతూ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు. నా గుండె పగిలింది.
‘మీ ఫ్రెండ్‌, నేను ఫలానా చోట కలుసుకున్నాం’, ‘రేపు కలిసి సినిమాకెళ్తున్నాం’ అంటూ కావాలనే మెసేజ్‌లు పంపేవాడు. చదువుతుంటే ఏడుపొచ్చేది. ఇంకా తన వెంటపడటంలో అర్థం లేదనిపించింది. అతడిపై ప్రేమ చంపుకొని డ్రాప్‌ అయ్యాను. నెంబర్‌ మార్చేశాను.
మూడేళ్లు గడిచాయి. ఓరోజు ఒక కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘హాయ్‌ ఎలా ఉన్నావ్‌?’ అవతలివైపు చైతూ. యోగక్షేమాలడిగాను. తను ఏడవడం మొదలెట్టాడు. నాకేం అర్థం కాలేదు. ‘నీ ఫ్రెండ్‌ నన్ను మోసం చేసింది. వాడుకొని వదిలేసింది’ బావురుమన్నాడు. కాసేపు నిశబ్దం. తర్వాత ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనడిగాడు. నవ్వాలా? ఏడవాలా? అర్థం కాలేదు. ‘చెప్పు పూజితా.. చేస్కుంటావా?’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఏడుపూ, నవ్వూ కలగలిసి నా కళ్లు వర్షించడం మొదలెట్టాయి. కానీ అతడి ప్రపోజల్‌కి మాత్రం నేనొప్పుకోలేదు. ఎందుకంటే పదిరోజుల కిందటే నాకు పెళ్లైంది.

Like Our Faceboook Page:
https://www.facebook.com/NaaLoveStory/