ఆధునిక ఉపకరణాలు, జీవనశైలిలో వచ్చిన వేగం.. మాటల మాయ చేస్తాయి. మనిషిని చూడకుండానే మనసిచ్చేసి, మనువు దాకా తీసుకెళ్ళే పరిస్థితులను కాల్పిస్తున్నాయ. ఆ వలలో పడకుండా మెలకువ వహించాలి అంటూ తన అనుభవాలను వివరిస్తున్నారు ఓ పాఠకురాలు.
మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలకు ముగ్గురు పిల్లలం. ఆస్తులు లేవు. బాగా చదివించడమే మంచి భావిష్యత్తునందించడం అనుకునే వారు నాన్న. చిన్నప్పట్నుంచి బిడియంగా పెరిగాన్నేను. నలుగురితో కలిసేదాన్ని కాదు. నిర్మొహమాటంగా ఉండలేను. పదో తరగతి వరకు ఊళ్లోనే చదువుకొన్నా. తరవాత దగ్గర్లో మంచి కళాశాలలు లేక హాస్టల్లో ఉంచి చదివించారు.
ఇంటర్ సెకండియర్. సంక్రాంతి సెలవులకి ఇంటికొచ్చాను. ఓ రోజు ఇంట్లోని సెల్ కి మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరూ లేకపోవడంతో నేను ఫోనందుకున్నా. అవతల మగ గొంతు. 'సారి రాంగ్ నంబర్' అని పెట్టేశాడు. ఎందుకోగానీ ఆ స్వరం నన్ను బాగా ఆకట్టుకొంది. మళ్ళీ మాట్లాడితే బాగుండుననిపించింది. కాసేపటికి ఓ సంక్షిప్త సందేశం. ఆశ్చర్యం.. ఆ సందేశం మిస్డ్ కాల్ వ్యక్తి నుంచే. 'మీ గొంతు బాగుంది! మీ పేరేంటి? ఏం చదువుతున్నారు?' అన్న ప్రశ్నలకు క్లుప్తంగా బదులిచ్చా. అలా స్పందించినందుకూ అభినందన సందేశం. నలుగురిలూ అంతగా కలవని నాకు ఆ ప్రశంసలు పన్నీటి జల్లులా అనిపించాయి. ఆ తరవాత కూడా హలోలు, హాయ్ లు, పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడు శుభాకాంక్షలు, చదువుల వివరాలతో అటూ ఇటూ మెసేజీలు నడిచాయి. తను ఎంసీఏ చదువుతున్నాడు. ఐటీ, అమెరికా, భవిష్యత్తు గురించి చెప్పేవాడు. మనసులో మాట్లాడాలని ఉన్నా అది ఇంట్లో ఫోను కాబట్టి దయచేసి [ఫోన్లు చేయొద్దని చెప్పేశాను. తను వింటేనా? ఓ రోజు అన్నయ్య మా తీరుని గమనించాడు. నన్ను చెడామడా తిట్టాడు. తనకి ఫోన్ చేసి ఎవరు నువ్వని నిలదీశాడు. భయపడి ఫోను చేయలేదు.
నాల్రోజులు గడిచాయి. తన మాట వినబదకపోఎసరికి ఉండబట్టలేక నేనే ఫోను కలిపాను. 'అన్నయ్య తిట్టినందుకు సారి, నేను హాస్టల్ కి వెళుతున్నాను' అని చెప్పా.బతిమాలితే హాస్టల్ లో స్నేహితురాలి నంబరిచ్చా. తిరిగి మా మాటలు జోరందుకున్నాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. అమ్మానాన్నలు పంపిన డబ్బులన్నీ రీ ఛార్జీలకే అయిపోయేవి. అత్తెసరు మార్కులతో ఇంటర్ గట్టెక్కా. అమ్మానాన్నలు అడిగితే ఆరోగ్యం బాగోలేక పరీక్షలు సరిగా రాయలేకపోయానని చెప్పా. 'అయ్యో.. అక్కడ తినీతినకా చదువుతుంటే మరీ చిక్కిపోతావమ్మా.. ఆ డిగ్రీ ఏదో ఇక్కడే ఉండి చదువుకో' అంది అమ్మ. అంత ప్రేమ చూపిస్తుంటే అబద్ధాలతో మోసం చేస్తున్నానని అనిపించినా.. మనసు అతని స్నేహానికే మొగ్గుచూపింది. ఊళ్లోనే చదువంటే తననిక కలవలేను అనుకొని మళ్ళీ పట్నం వెళ్లి తనని కలిశాను. కబుర్లు, సినిమాలు, షికార్లు. నాల్రోజుల తరవాత ఇంటికొచ్చా.
ఫోనులో పలకరించే మనిషిని నేరుగా చూశానన్న సంతోషం నాది. కాని అది ఎంతో కాలం నిలవలేదు. తిరిగొచ్చాక తనకి ఫోను చేస్తే నిరాశగా మాట్లాడాడు. మర్నాడూ అదే నిరాసక్తత. ఆ పైనా పొడి పొడి మాటలు. ఒక్కోసారి ఫోను కూడా తీసేవాడు కాదు. తీసినా మాటల్లో విసుగు, కసురు. ఇద్దరికీ తగవు. ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాడో ఏమో.. వాళ్ళెవరైనా ఫోను తీస్తే నానా మాటలనేవారు. ఏడుపోచ్చేది. డిగ్రీ మొదటి సంవత్సరం తప్పాను. అక్కయ్య చదువులో సూపర్. నాకు శ్రద్ధ లేదని ఇంట్లో సంబంధాలు చూడ్డం మొదలు పెట్టారు. ఏడుస్తూ విషయం అతనితో చెప్పా. 'వెరీ గుడ్.. ఆలస్యమెందుకు చేసుకో' అన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు. ఫోను నంబరూ మార్చేశాడు. తన స్నేహం, ప్రేమతో మోసపోయానని అర్థమయింది. డీలా పడ్డా. దిగులు కమ్ముకొంది. అమ్మ గమనించింది. ఆరా అడిగింది. విషయం చెప్పా. మొదట బాధ పడింది. తరవాత అనునయించింది. 'మనసు వెళ్ళిన ప్రతి చోటుకీ మనం వెళ్ళకూడదు' అంటూ మందలించింది. చదువయ్యేదాకా చెప్పినట్టు విను.. లేదంటే నీ జీవితం గాడి తప్పుతుంది అంటూ హెచ్చరించింది. ఈసారి దగ్గరుండి చదివించింది. 'ప్రతి మార్కూ ముఖ్యమే నీకు' అని చెబుతూ పరీక్షలు రాయించింది. డిగ్రీ ఫస్టు క్లాసులో పాసయ్యాను. అప్పటికే కనువిప్పు పొందిన నేను పీజీలో చేరి దానిని పూర్తి చేశా. ఓ కళాశాలలో ఉన్నతోద్యోగం సాధించా.
ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు గుడ్డిగా ప్రేమలో పడ్డారని తెలిసినా, ఆన్ లైన్ ప్రేమల గురించి ప్రస్తావన తెచ్చినా గట్టిగా మందలిస్తాను. 'పరీక్ష'లకు నిలిచిన స్నేహాలు, ప్రేమలనే ఆదరించమంటాను. పెద్దలకు తెలిపి ఆమోదం పొందే ఆత్మవిశ్వాసమూ ప్రదర్శించాలని చెబుతాను.

No comments:
Post a Comment