అందం మేనిరంగులో ఉండదు. అర్ధం చేసుకునే మనసులో ఉంటుంది. అలాంటి అమ్మాయి దొరికితే జీవితంలో అన్నీ విజయాలే అంటున్న యువకుడి అనుభవం. మొదటి పెళ్లిచూపులు...
అమ్మాయి బాగుంటుందా? తననేం అడగాలి? మనసులో అలజడి. ఘల్లుఘల్లుమన్న పట్టీల చప్పుడు నా ఆలోచనలకు బ్రేక్ వేసింది. పట్టు పరికిణీ, పొడవాటి జడ, జడలో తురుముకున్న కనకాంబరాలు... తెలుగుతనం పోతపోసినట్టు ఉన్న తను నా ముందుకొచ్చింది. నన్ను చూసి చిన్నగా నవ్వింది. బుగ్గల్లో సొట్టపడి ఆ అందం రెట్టింపైంది. వివరాలు ఇచ్చిపుచ్చుకున్నాం. 'అన్నీ కుదిరాయి. ముహుర్తం పెట్టుకోవచ్చు' అంది పిన్ని. మధ్యవర్తి. నాకూ నచ్చింది. మాతో వచ్చిన వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి అభిప్రాయం చెప్పమన్నా. 'అమ్మాయి నల్లగా ఉందిరా. నీకు సరిపోదు' తేల్చేశాడు. అమ్మానాన్నలదీ అదేమాట. 'ఏ విషయమైనా ఫోన్ చేసి చెబుతాం' అంటూ బయల్దేరాం. 'నీది మంచి ఉద్యోగం. అందగాడివి. అమ్మాయేమో నల్లగా ఉంది. పైగా ఆస్తిపరులు కాదు' అంటూ నా నోరు నొక్కేశారు ముగ్గురూ. మావాళ్లన్నట్టు తను మరీ నలుపేం కాదన్నా వినరే!
పెళ్లిచూపుల పేరుతో ఏ అమ్మాయినీ బాధ పెట్టొద్దు అన్నది నా పాలసీ. ఫొటో పంపమంటే అమ్మాయి బాగుందని లాక్కెళ్లింది పిన్ని. చివరికిలా జరిగింది. బాగా ఆలోచించాక తనని కలిసి సారీ చెప్పాలనుకున్నా. నేరుగా వాళ్లాఫీసుకెళ్లా. గేటు బయటే ఆపేశాడు సెక్యూరిటీ. మీరెవరు? ఎందుకొచ్చారు? ఏం మాట్లాడతారు? ప్రశ్నలు సంధించాడు. బాధ పడ్లేక అసలు విషయం చెప్పా. ఆపై అతడు చెప్పిన మాటలతో నా మతి పోయింది. స్వాతి చాలామంచి అమ్మాయనీ, ముగ్గురి పని ఒక్కతే చేస్తుందనీ, తనంటే అందరికీ అభిమానమనీ చెప్పాడు. ఆఖర్లో తను సెలవులో ఉందని, ఆమెని చేస్కోకపోవడం నా దురదృష్టమని జాలి పడ్డాడు. ఒక్కసారి మాట్లాడమని చెప్పమని నెంబర్ ఇచ్చి వచ్చా.
మూడ్రోజుల ఎదురుచూపులు ఫలించాయి. 'పెళ్లిచూపుల్లో నచ్చని అమ్మాయితో మళ్లీ మాట్లాడాలనుకోవడం పద్ధతి కాదు. దయచేసి ఇంకోసారలా చేయొద్దు' కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా పెట్టేసింది స్వాతి. ఆ మాటతో తను మరింత నచ్చేసింది. సరాసరి వాళ్లింటికెళ్లిపోయా. 'మీరెన్ని షరతులు పెట్టినా సరే. మీ అమ్మాయినే చేస్కుంటా' అన్నా వాళ్ల నాన్నతో. మొదట్లో కుదరదన్నారు నాన్నాకూతుళ్లు. పిన్ని రాయబారంతో కరిగారు. పెళ్లి ఘనంగా జరిగింది. ఆపై తను నాకు దక్కడం ఎంత లక్కీనో అర్ధమైంది. మూణ్నెళ్లలో అమ్మానాన్న, అక్క అందరి నోట్లో స్వాతినే. అంత కలుపుగోలుగా ఉండేది. ఎంత పనైనా నవ్వుతూ చేసేది.
హాయిగా సాగిపోతున్న సంసారంలో కష్టాల పిడుగు. పరిస్థితేం బాగోలేదని పింక్‌స్లిప్ చేతిలో పెట్టింది కంపెనీ. అప్పటికే స్వాతి ఉద్యోగం మానేసింది. ఖర్చులకు గడవనంత పరిస్థితేం లేదుగానీ భవిష్యత్తుపై బెంగ మొదలైంది. అదిగో అప్పుడే నా స్వాతి అర్ధాంగికి అర్ధం చెప్పింది. 'మనం దుస్తుల వ్యాపారం చేద్దాం' అంది. ఏసీ గదులు.. కంప్యూటర్‌కి పరిమితమైనవాడ్ని వ్యాపారంలోకి దిగడమంటే మాటలా? నావల్ల కాదన్నా. తనే ధైర్యం చెప్పింది. వాళ్ల మామయ్య సహకారం కోరింది. తమ్ముడ్ని ఇంట్లో ఉండి చదువుకుంటూ సాయపడమంది. మూడున్నర లక్షలతో షాపు తెరిచాం. తన మంచితనం, మాటకారితనంతో గిరాకీ ఊపందుకుంది.
ఎనిమిదేళ్లు గడిచాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆపై మేం పట్టిందల్లా బంగారమైంది. ఊహించనంత సాధించాం. గతంలో నా జీతానికంటే నాలుగైదు రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నా. ఏడుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇదంతా నా బెటర్‌హాఫ్ చలవే. ఆరోజు తన వెంటపడి నా అదృష్టాన్ని దక్కించుకున్న ఫలితమే.
© Shekharmine
No comments:
Post a Comment