Monday, 12 October 2015

ఎంతపని చేశావ్ ప్రేమా?

అమ్మానాన్నలున్నారు. మొహం చూపించలేడు! పెళ్లాం పిల్లలున్నా తనవారు కాదు! ఎందుకిలా? అంటే 'ప్రేమే'నన్నది సమాధానం. ఏం జరిగిందో అతడి మాటల్లోనే.

యూనివర్సిటీ బస్టాపు. సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిలతో కళకళలాడుతోంది. ఇంతలో బూడిద రంగు పంజాబీ డ్రెస్, తెల్ల చున్నీ వేసుకున్న ఓ ఏంజెల్ నాముందు నుంచి నడిచెళ్లింది. 'మన క్లాసే మామా. వూరు ఖమ్మం' వివరాలందించి నన్నీలోకంలోకి లాగాడు ఫ్రెండ్. పట్టుబట్టి పరిచయం చేసుకున్నా. మూణ్నెళ్లలో బాగా దగ్గరయ్యాం.

దసరా సెలవులిచ్చారు. పదిరోజులు నరకం కనపడింది. రాగానే మనసు విప్పా. నువ్వులేక నేను లేనన్నా. వారం వూరించి పచ్చజెండా వూపింది. ఓరోజు మీ పేరెంట్స్‌ని తీసుకొచ్చి మాట్లాడమంది. అమ్మానాన్నలు వద్దంటున్నా ఆతృతగా బయల్దేరా. అక్కడ దారుణ అవమానం. కనీసం ఇంట్లోకి కూడా పిలవలేదు. బయటే నిల్చోబెట్టి మాట్లాడి 'విషయం తర్వాత చెబుతాం' అన్నారు. భారంగా తిరిగొచ్చా. పన్నెండురోజుల్లో నా బ్యాంకు పరీక్ష. అదే జీవితం అనుకొని ప్రిపేరవుతున్నా. ఇంతలో తన లేఖ. 'మావాళ్ల హింస తట్టుకోలేకపోతున్నా. చచ్చిపోవాలనుంది. వెంటనే వచ్చెయ్'మని సారాంశం. ఫ్రెండ్స్‌ని వెంటబెట్టుకొని కారులో బయల్దేరా. పోలీసులతో బెదిరించారు. తిరిగొచ్చాం. ఖర్చు మోపడైంది. పరీక్ష పోయింది. దేవదాసునయ్యా. ఇక తను దక్కదనుకున్నా.

'గ్రూప్‌వన్ మెయిన్‌కి ఎంపికయ్యా. వైజాగ్‌లో శిక్షణ తీసుకుంటున్నా' సడెన్‌గా ఓరోజు తన ఫోన్. రెక్కలు కట్టుకొని వాలిపోయా. రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవాళ్లం. మళ్లీ ఏమైందో! ఒక్కసారిగా మాట్లాడ్డం మానేసింది. 'నువ్వెవరో అమ్మాయ్‌తో తిరుగుతున్నావట. నా ఫ్రెండ్ చెప్పింది' అదీ సాకు. ఎంత చెప్పినా వినదే. ఉండేచోటు, నెంబర్ మార్చేసింది. పిచ్చివాణ్నైపోయా. ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో మళ్లీ ప్రత్యక్షమైంది. 'మీకు ఎవరూ దొరకలేదా? నా బోయ్‌ఫ్రెండే కావాలా?' అని నా స్నేహితురాళ్లు అందర్నీ తిట్టింది. నామీద ప్రేమనుకుకొని నవ్వుకున్నా.
ఖమ్మంలో టీచరుద్యోగం వచ్చింది తనకి. నన్ను వదిలి వెళ్లనంది. బుజ్జగించా. తర్వాత పెద్దల్ని కాదని చర్చిలో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాం. నెలకు రెండుసార్లు వెళ్లొచ్చేవాడిని. మా ప్రేమకు ప్రతిరూపంగా ఏడాది తిరక్కముందే పాప. ఇక అక్కణ్నుంచి తనలోని రాక్షసత్వం విజృంభించింది. రోజూ గొడవ. నాకు వేరే సంబంధాలున్నాయనేది. ఓపిక పడితే 'తప్పు చేస్తున్నావ్ గనకే నోరు తెరవట్లేదు' అనేది. కోపంతో చేయి చేసుకునేవాడిని. నా బ్యాగ్ బయట విసిరేసేది. హాస్టల్‌కొచ్చేవాణ్ని. పాపని, తనని చూడాలని ప్రాణం కొట్టుకునేది. వెళ్తే మళ్లీ అదే తంతు. మూడేళ్లు గడిచాయి.

మా గొడవలతో తన అమ్మానాన్నలకి దగ్గరైంది. వాళ్లు మరింత రెచ్చగొట్టేవాళ్లు. ఈలోపు బాబు పుట్టాడు. నేను చేస్తున్న ప్రైవేటుద్యోగం మానేసి పీహెచ్‌డీలో చేరి ఫెలోషిప్‌కి ఎంపికయ్యా. బాబును చూసుకుంటూనే రీసెర్చ్ చేసుకుందామనుకున్నా. రోజూ సాధించేది. రీసెర్చ్ పనిమీద సిటీకెళ్తే 'లవర్‌ని కలవడానికా?' అనేది. ఎప్పటికైనా మారుతుందిలే అని ఓపిక పట్టా. కానీ తను మారలేదు సరికదా ఓ భార్య గురించి భర్త వినకూడని మాట నా చెవి న పడింది. నిట్టనిలువునా కుప్పకూలిపోయా.

గొడవలు ముదిరాయి. వరకట్న వేధింపు కేసు పెట్టింది నాపై. తన బాగోతం పోలీసుల ముందుంచా. నన్నొదిలేశారు. ఇంటికి తాళమేసి పేరెంట్స్ దగ్గరికెళ్లింది. ఒంటిరినయ్యా. వూరెళ్లి ముసలి తల్లిదండ్రులకు మొహం చూపించలేను. ప్రేమ మోజులో ఆరోజు వాళ్ల మాట విన్లేదు. పెళ్లీడుకొచ్చిన చెల్లెళ్లతో ఛీకొట్టించుకోలేను. ఇంతకుముందు నాకో కుటుంబం, పిల్లలు ఉన్నారనే తృప్తి ఉండేది. ఇప్పుడదీ లేదు. నా నేపథ్యం, బాధ్యతలు అన్నీ మర్చిపోయి ప్రేమ మైకంలో మునిగిపోయినందుకు నాకు దక్కిన ఫలితం ఇది.
© Shekharmine

No comments:

Post a Comment