వేసిన అడుగు.. జారిన మాట.. చేసిన తప్పు.. వెనక్కి తీసుకోలేం. ఒక్కోసారి వాటి ఫలితాలు దారుణంగా ఉంటాయ్. అలా చేసిన పొరపాటుకు మిత్రుడి జీవితం నాశనం అయ్యిందంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడో యువకుడు.
డిగ్రీ ఆఖరి పరీక్షలు. హిస్టరీ పేపర్. చరిత్రంటే ఆసక్తేగానీ రాజవంశాలు, చారిత్రక సంఘటనలు గుర్తుండేవి కావు. ఆ కొరుకుడు పడని సంఘటనల్ని కాగితంపై పెట్టి హాల్లోకి వెళ్లా. కాపీ కొట్టడం తప్పని మనసు గోల పెడుతున్నా తప్పింది కాదు. 'ముందే చెబుతున్నా. నకలు కొట్టడం, పక్కవాడి దాంట్లో చూసి రాయడం కుదరదు. ఏవైనా చిట్టీలుంటే బయట పడేసి రండి' ఆఖరి అవకాశం ఇచ్చారు రాములు సర్. నలుగురైదుగురు ఆయన చెప్పినట్టే విన్నారు. కాసేపు వూగిసలాడి మిన్నకుండిపోయా నేను.
పరీక్ష మొదలై అరగంటైంది. మంచినీళ్లు తాగడానికి బయటికెళ్లారు మాస్టారు. చొక్కా పట్టీలో మడిచిన కాగితం తీసి రాయడం మొదలెట్టా. కొద్దిసేపటికే వెనక నుంచి నన్ను సమీపిస్తున్న అడుగుల చప్పుడు. కాగితం దాచే సమయం లేదు. కింద పడేసి ఏమీ ఎరగనట్టే జవాబుపత్రంలో తలదూర్చా. సరాసరి నా దగ్గరికొచ్చారు సర్. 'కిందపడ్డ చిట్టీ తీసి ఇది నీ పనేనా?' అన్నారు. గుండె వేగం రెట్టింపైంది. పెదాలు తడారిపోయాయి. 'నాకేం తెలియదు సర్. ముందున్న శ్రీనుదేమో' వెనకాముందు ఆలోచించకుండా అబద్ధమాడేశా. నా మాటతో వాడు చివాల్న లేశాడు. తనకసలే కోపమెక్కువ. 'ఏంట్రా పిచ్చిపిచ్చిగా ఉందా? నా పేరెందుకు లాగుతున్నావ్్?' అంటూ మీదికొచ్చాడు. ఏదైతే అదైందని 'వీడు జేబులోంచి తీయడం చూశా'నన్నా. దాదాపు నన్ను కొట్టినంత పన్జేశాడు. ఇద్దర్ని విడదీసి చేతిరాత పోల్చి చూశారు సర్. ముందే ఈ సీన్ వూహించి మా పక్కింటి కుర్రాడితో రాయించడంతో బతికిపోయా. అయితే శ్రీను రాతకి కొంచెం దగ్గరగా ఉండటంతో వాడిదేనని తేల్చేశారు సర్. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పమన్నారు. చేయని తప్పునకు నేనెందుకు సారీ చెప్పాలంటూ వాదించాడు. అప్పుడే స్క్వాడ్ రావడం.. ఆయనతోనూ వాడు వాదించడంతో పేపరు లాక్కొని 'వన్ ఇయర్ డిబార్' అని రాశారు. తేలు కుట్టిన దొంగలా నేను గప్‌చుప్.
నా తప్పు వాడి జీవితాన్ని ముంచేస్తుందని వూహించలేకపోయా. ఉన్న అరెకరానికి మరో ఎకరం కౌలుకు తీసుకొని వ్యవసాయంలోకి దిగాడు శ్రీను. అది కలిసి రాక అప్పులు రెట్టింపయ్యాయి. అవి తీర్చడానికి హమాలీగా మారాడు. మళ్లీ పుస్తకం పట్టలేని పరిస్థితి. ఇది తెలుసుకొని వాడి దగ్గరికెళ్లి క్షమించమని చేతులు పట్టుకున్నా. ముందు నాపై చాలా కోపంగా ఉండేవాడు. ఆపై 'నా తలరాత ఇలా ఉంటే నువ్వేం చేస్తావులే' అనేవాడు.
మరోవైపు నేను డిగ్రీ పాసై బీఈడీలో చేరా. అది పూర్తికాగానే లక్కీగా వేల ఖాళీలతో డీఎస్సీ విడుదలైంది. బాగా కష్టపడటంతో కొలువు దక్కింది. ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నా. ప్రస్తుతం నలభైవేల జీతం, సమాజంలో గౌరవం నా సొంతం. శ్రీను మాత్రం హమాలిగానే కొనసాగుతున్నాడు. దానిక్కారణం నేనే. అది గుర్తొచ్చినప్పుడల్లా అపరాధభావం వెంటాడుతోంది. ఆరోజు నేను వెంటనే తప్పు ఒప్పుకొని ఉంటే విషయం ఇంతదాకా వచ్చేదే కాదు. పైగా మొదట్నుంచీ వాడిదీ టీచర్ కావాలనే కోరికే. నాకన్నా బాగా చదివేవాడు. క్లాసులో మొదటి పదిమందిలో ఉండేవాడు. ఆరోజలా జరిగి ఉండకపోతే కచ్చితంగా లక్ష్యం అందుకునేవాడే.
మనం చేసేది తప్పా? ఒప్పా? అని మనకు కచ్చితంగా తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా అది ఇతరుల జీవితాలతో ముడిపడిందైతే చిన్న పొరపాటుకు కూడా తావీయొద్దు. లేదంటే.. మనం ఎంత ఎదిగినా మానసిక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది.
Like Our Facebook Fan Page: NaaLoveStory
© Shekharmine
No comments:
Post a Comment