తంబి లేక నేను లేను!
'తర్వాత క్లాస్ సీనియర్లు తీసుకుంటారట. చచ్చాంపో' క్లాస్‌మేట్ నిట్టూర్పుతో నా గుండెలో రైళ్లు పరుగెత్తాయి. ఓ ఫంక్షన్ విషయమై ముందురోజే వాళ్లతో గొడవపడ్డా. జూనియర్లు నాకు అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లు క్లాస్ తీసుకోవడానికి వస్తున్నారంటే కచ్చితంగా మాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! వాళ్లని తప్పించుకోవాలని గ్రౌండ్‌వైపు అడుగులేస్తున్నా. 'మేడమ్.. అటెళ్లొద్దు. సీనియర్లు అట్నుంచే వస్తున్నారు' కేకేశాడు నారాయణస్వామి. సహాధ్యాయి. 'అయినా జరిగిన దాంట్లో మీ తప్పేం లేదుగా? పదండి ఏం చేస్తారో చూద్దాం' క్లాసులోకి లాక్కెళ్లినంత పని చేశాడు. సీనియర్లు నాపై విరుచుకు పడుతుంటే జూనియర్లందరినీ ఏకం చేసి నన్ను బయటపడేశాడు. ఆరోజు నుంచి అతడిపై అభిమానం మొదలైంది.నోట్స్ కోసం మా ఇంటికొచ్చాడోరోజు. వెళ్తూవెళ్తూ మీతో ఓ విషయం మాట్లాడాలన్నాడు. లవ్వూగివ్వూ అంటే లాగి చెంపకాయ్ కొట్టాలకున్నా. కానీ తనలా అన్లేదు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని అక్కా అని పిలవొచ్చా' అంటూ మనసు టచ్ చేశాడు. 'నీ ఇష్టం తంబీ' అన్నా. ఆరోజు నుంచి మేం అక్కాతమ్ముళ్లం అయ్యాం.
తెలిసో, తెలియకో వయసు ప్రభావంతో యువత కొన్ని తప్పులు చేస్తుంటారు. మా తరగతిలో కొందరలా చేస్తుంటే తంబి సున్నితంగా మందలించేవాడు. భవిష్యత్తులో ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో విడమరిచి చెప్పేవాడు. చిన్న వయసులో వాడి పెద్దరికం చూసి ముచ్చటేసేది. అప్పుడప్పుడు నాకూ హితబోధ చేసేవాడు. అందులో అజమాయషీ కన్నా అభిమానమే ఉండేది. వాడి సాంగత్యంలో నేనూ చలాకీ పిల్లనయ్యా. యాంకరింగ్‌లు, డ్యాన్స్‌లు.. అబ్బో రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి. డీఎడ్ పూర్తి అయి వీడ్కోలు తీసుకుంటుంటే ఏడుపాగలేదు. 'అక్కా మనం కాలేజీనే వదిలేస్తున్నాం. మన అనుబంధాన్ని కాదు' అని ఓదార్చాడు.
డీఎస్సీ పడింది. తంబి, నేను, ఇంకో క్లాస్‌మేట్ కోచింగ్ కోసం కర్నూలొచ్చాం. బ్యాగులు స్కూళ్లో పెట్టి హాస్టల్ వెతకడానికెళ్లాం. వచ్చేసరికి బ్యాగ్‌లో డబ్బులు మాయం. ఏం చేయాలో తెలీక ఏడుపు మొహం పెడితే 'మై హూ నా' అంటూ హాస్టల్ ఫీజు కట్టేశాడు. అలాగని తనేం బాగా డబ్బున్నవాడు కాదు. అదేమాటంటే 'నీ సొంత తమ్ముడైతే ఇలా చేయడా?' అని నా నోర్మూయించాడు. వాడి దయ, సహకారంతో కోచింగ్ కూడా అయిందనిపించా.
ఇంటికెళ్లగానే అమ్మకి తీవ్ర అనారోగ్యం. ఆసుపత్రికి తీస్కెళ్లాం. ఆపరేషన్ చేయాలన్నారు. నెలరోజులు అక్కడే ఉన్నాం. విషయం తెలిసి పరుగెత్తుకొచ్చాడు. అడక్కుండానే అన్నిరకాల సాయం చేశాడు. బంధువులు ముఖం చాటేస్తున్నవేళ ఆత్మబంధువయ్యాడు. ఇవన్నీ తలచుకొని ఏడుస్తుంటే 'నేనుండగా నీ కళ్లలో కన్నీరు రాకూడదక్కా' అని సముదాయించాడు. 'ఇంకో మూడునెలల్లో మనకు ఉద్యోగాలొస్తాయి. కష్టాలన్నీ తీరతాయి' అని తను చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తే.
కట్ చేస్తే.. తంబీ మాటే నిజమైంది. ఇప్పుడు వాడూ, నేనూ టీచర్స్. అమ్మ ఆరోగ్యం బాగైంది. కష్టాలు తీరాయి. ఈరోజు నేనింత సంతోషంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ తంబీదే. కాలేజీ అనుభవాల గని. కొందరికి మంచి స్నేహితులు దొరుకుతారు. ఇంకొందరికి ప్రేమ. నాకు నా తంబీనిచ్చింది. నా కష్టసుఖాల్లో, బాధ్యతలో, కుటుంబంలో ఒకడై నిస్వార్థ ప్రేమ కురిపించిన తంబీ.. నేను నీకు ఏమివ్వగలను.. 'ఐలవ్యూ తంబీ' అనే మాట తప్ప!
© Shekharmine
No comments:
Post a Comment