చెన్నై స్టేషన్. రైలు దిగి టాక్సీ కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలో ఏడాది వయసున్న బాబు పరుగెత్తుకొచ్చి నా కాళ్లను చుట్టేశాడు. ఆ వెనకే పిల్లాడి తల్లి . కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకుంటూ నావైపు చూపింది. ఒక్కసారిగా తన కళ్లు విప్పారాయి. ‘వణక్కం. ఎప్పడి ఇరుక్కీంగ?’ (నమస్తే... ఎలా ఉన్నారు)’ అంది నన్ను ఉద్దేశించి. తెల్లమొహమేశా. జవాబివ్వకముందే ‘ఎన్న పండ్రీంగా’ (ఏం చేస్తున్నారు)’ మరో ప్రశ్న సంధించింది. ముక్కూమొహం తెలియని వ్యక్తి నన్నిలా అడగడమేంటి? నాకాశ్చర్యం వేసింది. నాకు తమిళం తెలిసినా తెలియనట్టే ‘హూ ఆర్ యూ?’ అన్నా. ‘నేను శారదామణి. నీ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని’ అనడంతో నా గుండెల్లో బాంబులు పేలాయి. అసలు నేను చెన్నైలో అడుగుపెట్టిందే తన కోసం.
పీజీ పరీక్షలు. సమయముందని ఫేస్‌బుక్ తెరిచా. ‘హుమ్‌మ్...’ అని ఇన్‌బాక్స్‌లో ఓ సందేశం. ప్రొఫైల్ చూస్తే శారదామణి, చెన్నై అని ఉంది. అవతలివైపు అమ్మాయైతే ఏ కుర్రాడి మనసైనా గాల్లో తేలిపోవాల్సిందేగా! నేనూ ఉత్సాహంగా చాటింగ్ చేశా. ఎగ్జామ్ గంట కొట్టడంతో లోపలికి పరుగెత్తా. మనసంతా తనపైనే ఉండటంతో హడావుడిగా పరీక్ష రాసి మళ్లీ చాటింగ్‌లోకి దిగా.
నాకు తమిళం రాదు. తనకి తెలుగు తెలియదు. ఇద్దరం వచ్చీరాని ఇంగ్లిష్‌లోనే చాట్లాడుకునేవాళ్లం. మా కబుర్లకు అర్థరాత్రుళ్లూ కరిగిపోయేవి. ఎప్పడి ఇరుక్కే?, రొంబ నండ్రి, ఇరవు వణక్కం... ఇలా అప్పుడప్పుడు తమిళ పదాలు ఉపయోగించేది తను. గూగుల్‌లో గాలించి మరీ వాటి అర్థాలు తెలుసుకొని రిప్లై ఇచ్చేవాణ్ని. తర్వాత ఫోన్‌నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆన్‌లైన్ ప్రేమ సెల్‌ఫోన్లకు పాకింది. ఆపై పట్టుపట్టి మణి సాయంతోనే తమిళం కూడా నేర్చేసుకున్నా. ఆపై మనసంతా తనే నిండినవేళ ‘నాన్ ఉన్నై కాదలిక్కిరేన్ శారదామణి’ అని చెప్పేశా. తనూ ముసిముసిగా నవ్వి నా ప్రేమకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తర్వాత మణి వూహ లేకుండా, మణితో వూసులాడకుండా ఈ రెండేళ్లలో ఒక్కరోజు కూడా గడవలేదు. మేం పెళ్లి చేసుకోవాలనీ, ఓ అందాల పొదరిల్లు కట్టుకోవాలని భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేసుకున్నాం.
విజయనగరంలో రైలెక్కి చెన్నైలో దిగా. నేనెవరి కోసం వెళ్లానో తనే ఎదురొచ్చింది. కానీ చంకన బిడ్డతో. అన్నింటికన్నా పెద్ద షాక్ ఏంటంటే నేను ఫేస్‌బుక్‌లో చూసింది తనను కాదు. ఫ్రెండ్ ఫొటో పెట్టిందట. చాటింగ్ చేసిందీ, మనసువిప్పి మాట్లాడింది మాత్రం తనతోనే. ఫొటో మారినా మనసు తనదే కదాని స¾ర్దుకుపోదాం అనుకుంటే వేరొకర్ని మనువాడింది. నా ఆశల్ని చిదిమేసింది. ఇది మోసం కాదా? అనుకుంటే ‘నిన్ను గుర్తుపట్టి ఎందుకు పలకరిస్తుంది?’ అంది మనసు. ‘మరి నన్ను ప్రేమించి వేరే వ్యక్తిని పెళ్లాడటం వంచనేగా?’ మళ్లీ మథనం. మనసు ఛిద్రం అవుతుంటే తననే నిలదీశా. ‘నిన్నే పెళ్లాడతానని అమ్మానాన్నలకి చెప్పా. వేరే ప్రాంతమని ఒప్పుకోలేదు. మేం చూసిన సంబంధం చేసుకోకపోతే చచ్చిపోతాం అని బెదిరించారు’ ఉబికి వస్తున్న కన్నీళ్లతో చెప్పింది. ఇక నేను ఏమనగలను?
రెండేళ్లుగా తనే లోకమనుకున్నా. తనతో అందమైన జీవితం వూహించుకున్నా. ఆఖరికి సొంతూరొదిలి పరాయి రాష్ట్రంలో స్థిరపడటానికి సిద్ధపడ్డా. కానీ వూహించనిది జరిగింది. ఏది ప్రేమో?, ఏది నమ్మకమో, ఏది మోసమో తేల్చుకోలేక ముందుకెళ్తుంటే వెనకనుంచి ‘రామూ’ అన్న పిలుపు. తనే. నన్నేనా అని వెనక్కి తిరిగా. మళ్లీ నావైపు పరుగెత్తుకొస్తున్న బాబును వారిస్తోంది శారదామణి. అంతే.. నా కళ్లు చెమర్చాయి. మోసపోయాననుకున్న నా బాధ పటాపంచలైంది. మనసు గర్వంతో నిండిపోయింది.
© Shekharmine
No comments:
Post a Comment