Monday, 15 February 2016

ప్రేమలో పడొద్దు ప్లీజ్‌!

ఎన్నడూ లేనిది టీచర్‌ ఓ అమ్మాయిని వెంటపెట్టుకొని రావడంతో క్లాసంతా గప్‌చుప్‌. అమాయకమైన మొహంపై అలల్లా ఎగిసిపడుతున్న కురుల్ని సవరించుకుంటూ తను ఏంజెల్‌లా కనిపించింది నాకు. కౌమారం కవ్విస్తుంటే పాఠం వినడం మరిచి ఆ అమ్మాయినే చూస్తుండిపోయా.
కొన్నాళ్లకు పైచదువుల కోసం పక్కవూరికెళ్లా. లక్కీగా తనూ అక్కడే చేరింది. పేరూ, వివరాలు కనుక్కున్నా. ఆమెని చూడటం కోసమే రోజూ క్లాసులకెళ్లా. కానీ మాట కలిపే ధైర్యం లేదు. చూపులతోనే సరిపెట్టుకుంటూ ఏళ్లు గడిపా. తర్వాత వేరే వూళ్లలో, వేర్వేరు కాలేజీల్లో చేరాం. తను కనిపించక ప్రాణం విలవిల్లాడేది. ఓసారి సెలవులకు వూరెళ్లా. ‘ఏంటీ, నాగ్‌ కనిపించడం లేదు. ఈసారి ఇంటికొస్తే నేను అడిగినట్టు చెప్పు’ అని మా పక్కింటి అమ్మాయితో అందట. నా ఆనందానికి అవధుల్లేవ్‌. ఆమెదీ నాలాంటి స్థితేనని అర్థమైంది.
బీటెక్‌లో బోలెడు మంది అమ్మాయిలు, అందగత్తెలు. నా మనసు మాత్రం చిన్ననాటి నేస్తంపైనే ఉండేది. నా స్నేహితులు లవర్స్‌తో గంటలకొద్దీ మాట్లాడేవాళ్లు. బైక్‌పై షికార్లు చేసేవాళ్లు. నాకూ అలా చేయాలనే ఉబలాటం మొదలైంది. మేం రోజూ కలుసుకున్నట్టు, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డట్టు కలలు కనేవాణ్ని. ఫేస్‌బుక్‌లో గాలించి ఆఖరికి తన ఫొటో సంపాదించా. ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకొని పొద్దున్నుంచి రాత్రిదాకా లక్షసార్లు చూస్తూ మురిసిపోయా. ఎన్నాళ్లిలా? ఫోన్‌ నెంబర్‌ ఇప్పించమని ఓసారి తన స్నేహితురాలిని బతిమాలా. ‘నేనెవరికీ నెంబర్‌ ఇవ్వను. మాట్లాడను’ అందట. నాకు షాక్‌. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి సక్సెస్‌ అయ్యా.
మొదటిసారి నిమిషం పదహారు సెకన్లు మాట్లాడా. ‘నీతో అప్పుడప్పుడు ఇలా ఫోన్‌లో మాట్లాడొచ్చా?’ అభ్యర్థిస్తే నవ్వి సరేనంది. అనుక్షణం నాలో ఆ నవ్వులు, మాటలే. తన పుట్టినరోజు మరోసారి మాట కలిపే అవకాశమొచ్చింది. శుభాకాంక్షలు చెప్పి అత్యుత్సాహంతో నాలుగైదు ఎక్స్‌ట్రా మాటలు మాట్లాడా. అంతే. ఆపై నేనెన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తదు. మెసేజ్‌కి సమాధానం ఇవ్వదు. మాటలాపేయడానికి కారణమేంటో చెప్పదు. పదేపదే ప్రయత్నించి విసిగిపోయా. తట్టుకోలేక ఒక్కోసారి హాస్టల్‌ టెర్రస్‌ పైకెళ్లి ఏడ్చేవాణ్ని.
మనసు, మస్కిష్కంలో తనే. పుస్తకం తెరిస్తే తన రూపమే. చదువు బుర్రకెక్కేది కాదు. ఫలితం పరీక్షల్లో ఫెయిల్‌. బాగా చదివి, ఉద్యోగం చేస్తాననుకున్న కన్నవాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు ఇంట్లో పూట గడవని పరిస్థితి. ఎంత తిరిగినా కొలువు దొరకలేదు. ప్రేమలో ఫెయిల్‌. చదువులో ఫెయిల్‌. పని లేదు. ఖాళీ కడుపుతో, కన్నవాళ్లకి భారంగా మిగిలా. ఎనిమిదేళ్లు ప్రేమ లోకంలో విహరించినందుకు ఫలితం ఇది.
తప్పెవరిది? బాగా ఆలోచిస్తే నాదేననిపించింది. తనెప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. ఒకవేళ ప్రేమించి, పెళ్లి చేసుకున్నా పోషించే పరిస్థితుల్లో లేను. ఒకట్రెండుసార్లు పలకరిస్తే నేనే ఏవేవో వూహించుకున్నా. ప్రేమే లోకమనుకొని ఆ ధ్యాసలో చదువును నిర్లక్ష్యం చేశా. ఈ పరిస్థితి నా ఒక్కడిది కాదు. ప్రేమలో పడితే హీరోల్లా ఫీలయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమ తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వొచ్చు! సుఖంగా బతికే జీవితాన్ని మాత్రం ఇవ్వదు. దయచేసి అర్థం చేసుకోండి.

© Shekharmine

No comments:

Post a Comment