Monday, 15 February 2016

కరిగిన హృదయం..కమనీయం మా జీవితం!

‘ఆశా.. ఒక్క నిమిషం ఇలా వస్తావా?’ మేనేజర్‌ మదన్‌ పిలుపుతో ఆయన క్యాబిన్‌లోకి వెళ్లా. నా కళ్లలోకి చూసి నీళ్లు నమిలారు. క్షణమయ్యాక వూపిరి పీల్చుకొని ‘నువ్వంటే నాకిష్టం. ఐలవ్యూ’ అన్నారు. నేనేం విన్నానో నిమిషంపాటు అర్థం కాలేదు. తేరుకున్నాక ఎలా స్పందించాలో తెలియక బిక్కమొహమేశా. ‘ప్రేమే కాదు... నువ్వొప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా’ అంటూ అభ్యర్థించాడు. నాకంతా అయోమయంగా ఉంది. ‘నాక్కొంచెం సమయం కావాలి’ అన్నా.
‘ఎన్నిరోజులు?’
‘నాలుగు నెలలు’
‘ఓకే.. నీ కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తా’ అన్నారు మదన్‌.
పెద్ద సంస్థలో చిన్న ఉద్యోగం నాది. టెలీకాలర్‌ని. తనేమో మేనేజర్‌. పైగా అందగాడు. తనంత తానుగా వచ్చి ప్రేమిస్తున్నానంటే ఎవరైనా అదృష్టంలా భావిస్తారు. నాకేమో భయమేసింది. ఎందుకంటే మొదట్నుంచీ నాకు ప్రేమంటే గిట్టదు. పెద్దలతో గొడవలు, చీవాట్లు, ఒకరికొకరు దూరమవుతారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ప్రేమ అనవసరం అనిపించేది. కొన్నాళ్లు ఏమీ తేల్చకుండా నాన్చితే తనే వదిలేస్తాడులే అనుకున్నా. కానీ మదన్‌ పట్టు వదల్లేదు. రోజుకోసారైనా నా విన్నపం ఏమైందన్నట్టుగా బుంగమూతి పెట్టేవాడు. ఇక తప్పదనుకొని తన గురించి ఎంక్వైరీ మొదలుపెట్టా. ఎన్నిసార్లు వాకబు చేసినా ప్రతిసారీ రాముడు మంచి బాలుడు అన్నదే జవాబు. ‘నువ్వు లక్కీఫెల్లో’ అన్నారు స్నేహితులు. ఏరకంగా చూసినా తనే నాకు బెస్ట్‌ అనిపించింది. అమ్మానాన్నలూ ఒప్పుకుంటారనే నమ్మకం. తనతోనే నా జీవితం అని ఫిక్సయ్యా. కానీ నా అంచనా తప్పింది. ‘ఈ పెళ్లికి నేను ఒప్పుకోను’ అన్నారు నాన్న. నేనూ తగ్గలేదు. ‘మదన్‌ని తప్ప వేరొకర్ని చేస్కోను’ తెగేసి చెప్పా.
మరోవైపు మదన్‌ నన్ను వాళ్లింట్లో పరిచయం చేశాడు. ‘ఏంటి డిగ్రీ వరకే చదివావా? మావైపు అంతా పీజీలు, పీహెచ్‌డీలు చేశారు తెలుసా?’ నిష్ఠూరమాడారు మదన్‌ అక్కలు. ఆ మాట నాకు ఆర్డర్‌లా అనిపించింది. ఇక తప్పదనుకొని ఎంఏ ఇంగ్లిష్‌ కట్టా. ఓ పక్క చదువు, మరోవైపు ఉద్యోగం, ఇంట్లో నాన్నతో గొడవ. మదనే ధైర్యం చెప్పేవాడు. రెండేళ్లు గడిచాయి. చదువులో పాసయ్యానుగానీ ప్రేమ పరీక్ష నెగ్గలేదు. ఎంత బతిమాలినా నాన్న మా ప్రేమకు అంగీకరించలేదు. కోపంతో తరచూ చేయి చేసుకునేవారు. అక్కా అక్కా అంటూ నా చేయి పట్టుకొని తిరిగిన తమ్ముడూ కొట్టాడు. అమ్మ అర్థం చేసుకున్నా ఏం చేయలేని పరిస్థితి తనది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పెద్దల్ని ఎదిరించి ఇంటి గడప దాటా.
వాళ్ల తరపు పెద్దలు, మా స్నేహితుల సాయంతో మేం అన్నవరంలో పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఆశీర్వదించినా, నాన్న ఛీకొట్టారు. కోరుకున్నవాడ్ని కట్టుకున్నానన్న తృప్తి లేదు. కన్నవాళ్లు దూరం అయ్యారే అన్న బాధ. అంతులేని ప్రేమతో మదన్‌ ఓదార్చేవాడు.
ఆర్నెళ్లు గడిచాయి. ‘మీ నాన్న అప్పుడప్పుడు నీ గురించి అడుగుతూ బాధ పడుతున్నారు’ అనే తీపి కబురు చెప్పింది అమ్మ. ఎంతైనా కన్నహృదయం కదా! నాపై ప్రేమ ఎక్కడికి పోతుంది? ఆలస్యం చేయకుండా వెళ్లి ఆయన కాళ్లపై పడిపోయా. తలపై చేయేసి ప్రేమగా నిమిరారు. ఆయన కంటి కొనల్లోంచి రెండు ఆనందభాష్పాలు నా నుదిటిపై పడ్డాయి. నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా.

© Shekharmine

No comments:

Post a Comment